ఒకవైపు.. 84 గ్రామాల్లో అడ్డికీ పావుశేరుకు అమ్ముకున్న 80 శాతం రైతులు..
మరోవైపు.. 111 వన్ ను ఎరగా చూపెట్టి అగ్గువకు కొన్న రాజకీయ నాయకులు, పెట్టుబడిదారులు..
ఇంకోవైపు.. వ్యవసాయం తప్ప ఇతర వ్యాపకం తెలియని 20 శాతం రైతులు..
రాజకీయ ధనదాహమధనంలో ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేస్తే..
గరళాన్ని మింగడానికి హైదరాబాద్ వాసులు సిద్ధంగా ఉన్నారా?
నిన్నటివరకూ అమృతం వంటి గండిపేట్ నీటిని ఆస్వాదించిన భాగ్యనగర వాసులు.. ఇక నుంచి విషవాయువులు పీల్చడానికి సిద్ధంగా ఉండాల్సిందేనా? చిన్నపాటి వర్షానికే గోదారిని తలపించే నగర రహదారులు.. వరదలు సంభవిస్తే తట్టుకుంటుందా? ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేస్తే.. ఆయా ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాలు, ఆకాశహర్మ్యాలు, విల్లా కమ్యూనిటీలు ఏర్పడితే.. జంట జలాశయాలు మురికికూపం అవుతాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదలు ఎక్కువై.. జంట జలాశయాల గేట్లను ఎత్తాల్సి వస్తే.. భాగ్యనగరంలోకి మురుగునీరు ప్రవేశిస్తుంది కదా.. ఈ విషయం ఎందుకు పాలకులకు అర్థం కావట్లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
2014 నుంచి హరితహారం మీద అధిక దృష్టి సారిస్తూ, ప్రతి మున్సిపాలిటీని పచ్చదనంగా తీర్చిదిద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వం వాస్తవికంగా ఆలోచించాలి. ట్రిపుల్ వన్ జీవో రద్దు గురించి పునరాలోచించాలి. 84 గ్రామాల ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రత్యేకంగా ఏదైనా ప్యాకేజీని ప్రకటించండి. అక్కడి భూముల విలువల్ని మార్కెట్ రేటుతో సమానంగా పెంచండి. వారికి కొత్త స్కీములను అందజేయండి. అక్కడ వ్యవసాయం చేసేవారిని విశేషంగా ప్రోత్సహించండి. అంతేతప్ప, భాగ్యనగరానికి నష్టం వాటిల్లే నిర్ణయాల్ని తీసుకోకండి. 111 జీవో రద్దు చేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి.
This website uses cookies.