అమ్మకాలు పెంచుకునేందుకు రియల్ డెవలపర్లు ఆఫర్లు ప్రకటిస్తుంటారు. కొందరు ధర తగ్గిస్తే.. మరికొందరు మాడ్యులర్ కిచెన్లు లేదా ఏసీ వంటి ఉపకరణాలు ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తుంటారు. అయితే, ఇలాంటి ఉచిత హామీలు సైతం అమ్మకపు ఒప్పందంలో ఉండాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. అలా ఉంటేనే రెరా చట్టం పరిధిలోకి అవి వస్తాయని చెబుతున్నారు. ఇటీవల పుణెకు చెందిన ఓ కొనుగోలుదారు హింజెవాడిలో ఓ అపార్ట్ మెంట్ కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా డెవలపర్ ఆయనకు మాడ్యులర్ కిచెన్ మూడు ఏసీలు ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే, ఈ యాడ్ ఆన్ ఫ్రీల గురించి రిజిస్టర్డ్ ఒప్పందంలో చేర్చబోనని.. కేవలం ఈ మెయిల్ ద్వారా ధ్రువీకరిస్తానని డెవలపర్ పేర్కొన్నారు.
ఒప్పందం ప్రామాణిక ఫార్మాట్ కారణంగా ఉచితాలను అందులో పేర్కొనలేమని డెవలపర్ స్పష్టంచేశారు. దీంతో కొనుగోలుదారు గందరగోళానికి గురయ్యారు. ఈ మెయిల్ ద్వారా ఇచ్చిన హామీకి చట్టబద్ధత ఉంటుందా లేదా అని ఆలోచించారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. ఒప్పందంలో వాగ్దానాలను పేర్కొనకపోతే గృహ కొనుగోలుదారు వాటికి సంబంధించిన పరిహారం పొందే అవకాశం ఉండదని పలువురు అభిప్రాయపడ్డారు. కొంతమంది వినియోగదారులు ఇమెయిల్ సరిపోతుందని పేర్కొన్నప్పటికీ, మరికొందరు గృహ కొనుగోలుదారులు మాత్రం.. ఒప్పందంలో లేకుండా రెరా రక్షణ వర్తించదని స్పష్టం చేశారు.
న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (మహారేరా) డెవలపర్లు, గృహ కొనుగోలుదారుల మధ్య ఒక నమూనా ఒప్పంద ఫార్మాట్ రూపొందించింది. అది నిర్ణీత ఫార్మాట్ లో ఉన్నప్పటికీ, డెవలపర్లు ఏవైనా ఉచిత సౌకర్యాలు వాగ్దానం చేస్తే.. వాటిని అనుబంధంలో పొందుపరచాలని సూచించింది. శాశ్వత అంతర్గత ఫిక్చర్‌లలో వార్డ్ రోబ్‌లు, కిచెన్ క్యాబినెట్‌లు, వానిటీ టాప్‌లు, అద్దాలు, బాత్‌టబ్‌లు, వాటర్ క్లోసెట్‌లు, షవర్ స్క్రీన్‌లు మరియు బేసిన్‌లు మొదలైనవి అందులో పొందుపరచాలని పేర్కొంది. “ఇమెయిల్ కమ్యూనికేషన్లపై మాత్రమే ఆధారపడకుండా, గృహ కొనుగోలుదారులు డెవలపర్లు వాగ్దానం చేసిన అన్ని ఫిక్చర్‌లు, ఫిట్టింగ్‌లు మరియు సౌకర్యాలను ఒప్పందంలో స్పష్టంగా చేర్చారని నిర్ధారించుకోవాలి. డెవలపర్ ఈ వస్తువులను డెలివరీ చేయడంలో విఫలమైతే, ఇది రెరా కింద తగిన సహాయం పొందేందుకు వీలు కల్పిస్తుంది” అని నిపుణులు పేర్కొంటున్నారు.