ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్-ఎల్ఆర్ఎస్ Land Regularization Scheme-LRS కు పెద్దగా స్పందన లేకపోవడంతో GO No.59 జీఓ నంబర్ 59 పై దృష్టి సారించింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో ఏడాదిన్నరగా పెండింగ్ లో ఉన్న జీవో 59 కు సంబంధించిన ధరఖాస్తుల పరిష్కారానికి రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. జీఓ నెంబర్ 59 కింద సుమారు 58 వేలకు పైగా దరఖాస్తులను పరిష్కరించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు దాదాపు 6 వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఎల్ఆర్ఎస్ ప్రక్రియ కొనసాగుతుండగా.. ఇదే సమయంలో వచ్చే నెలలో జీఓ 59 పైనా నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారికవర్గాల సమాచారం.
ALSO READ: కో వర్కింగ్ స్పేస్ కు పెరుగుతున్న డిమాండ్!
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నవారికి ఆ భూములను క్రమబద్ధీకరించేందుకు 2014 డిసెంబర్ 30న జీవో 59 జారీ చేసింది అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ క్రమంలో 2022, 2023లో స్వల్ప మార్పులతో ఈ జీవోను పొడిగించింది కేసీఆర్ సర్కార్. దీని ప్రకారం 125 నుంచి 250 గజాల స్థలం ఉన్నవాళ్లు మార్కెట్ ధరలో 25 శాతం, 250 నుంచి 500 గజాలకు 50 శాతం, 500 నుంచి 750 గజాలకు 75 శాతం, 750 గజాలకు పైబడి స్థలం ఉంటే 100 శాతం చెల్లించాలి. ఇక జీఓ నంబర్ 58 ప్రకారం 125 గజాల లోపు నిర్మాణాలున్న స్థలాలను ఉచితంగా క్రమబద్ధీకరించేలా గతంలో నిర్ణయించారు.
అయితే BRS Govt బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జీఓ నంబర్ 59ని అడ్డుపెట్టుకుని విలువైన భూములను అక్రమంగా క్రమబద్ధీకరించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. హైదరాబాద్ లోని ఐటీ హబ్ ప్రాంతమైమైన Financial District ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోనే 20 ఎకరాలకు పైగా భూమిని కాజేసే ప్రయత్నాలు జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో 2023 నవంబర్ లో జారీ చేసిన కన్వేయన్స్ డీడ్ లను నిలిపివేసి, జీఓ నంబర్ 59కి సంబంధించిన లావాదేవీలపై నిషేధం విధించారు.
2022, 2023లో రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో 31 వేలు, మిగతా జిల్లాల్లో 26 వేల దరఖాస్తులతో మొత్తం 57 వేల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 32,788 దరఖాస్తులను ఆమోదించి డిమాండ్ నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం. 10 వేల మందికి పైగా ధర చెల్లించి కన్వేయన్స్ డీడ్ లు పొందగా, 3 వేల మందికి పైగా డబ్బులు చెల్లించినా డీడ్ లు జారీ చేయలేదు.
ఈ ప్రక్రియ మధ్యలోనే 2023 డిసెంబర్ లో బీఆర్ఎస్ సర్కార్ దిగిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రేవంత్ సర్కార్ పవర్ లోకి రాగానే జీఓ నంబర్ 59 పోర్టల్ ను నిలిపివేసింది. దీంతో గత యేడాదిన్నర కాలంగా డిమాండ్ నోటీసుల మేరకు డబ్బులు చెల్లించిన వారు, పాక్షికంగా డబ్బులు చెల్లించిన వారు, తనిఖీలు పూర్తి చేసిన వారు, కన్వేయన్స్ డీడ్ లు పొందిన వారు సైతం ప్రభుత్వ నిషేధంతో భూములపై లావాదేవీలు నిర్వహించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అర్హులైన వారికి ఇంటి స్థలాలపై హక్కులు కల్పించాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఎటూ ఎల్ఆర్ఎస్ ప్రక్రియను కొనసాగిస్తున్న ప్రభుత్వం.. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న జీఓ నంబర్ 59 దరఖాస్తులను పరిశీలించి, అక్రమాలను గుర్తించి, అర్హులైనవారి భూములను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
జీఓ నంబర్ 59 కి సంబంధించిన ధరఖాస్తుల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి, రాష్ట్ర ఖజానాకు ఆదాయం తేవడంతో పాటు సామాన్యులకు న్యాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని క్యాబినెట్ సబ్ కమిటీకి అందిన నివేదిక ప్రకారం, జీఓ 59 అమలు నిలిపివేయడానికి ముందు ప్రభుత్వానికి 534 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక ఇప్పుడు మిగతా దరఖాస్తుల పరిష్కారం ద్వారా 500 కోట్లు, అధిక విలువ గల భూముల క్రమబద్ధీకరణ ద్వారా 5,500 కోట్ల మేర ఆదాయం వస్తుందని రేవంత్ సర్కార్ అంచనా వేస్తోంది. ఎక్కడా అవకతవకలు జరగకుండా, నిజమైన లబ్ధిదారుల ఇళ్ల స్థలాలనుక్రమబద్దీకరించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.