కింగ్ జాన్సన్ కొయ్యడ: ఒక పడవకు రంధ్రాలు పడితే ఏం చేస్తారు? తక్షణమే వాటిని పూడ్చి వేసే ప్రయత్నం చేస్తారు. అందులో ప్రయాణించే కొందరు అతి తెలివైన వారు.. రంధ్రాలు పడ్డాయని తెలిసి.. దాన్ని తామెందుకు కష్టపడి పూడ్చాలి.. పడవ యజమానియే ఆ పని చేయాలని అతి తెలివిగా ఆలోచిస్తే ఏమవుతుంది? అతనొచ్చి మరమ్మతులు చేసే సమయానికి.. ఆ పడవ మునిగిపోయి.. అందులో ప్రయాణించేవారు దుర్మరణం చెందిన ఆశ్చర్యపడక్కర్లేదు.
అందుకే, ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండేందుకు.. పడవ యజమాని అనేక రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం వల్ల ఏర్పడే సమస్యలకు.. అందులో ప్రయాణించేవారు పరిష్కరిస్తేనే ప్రాణాలు నిలబడతాయి. హైదరాబాద్ నిర్మాణ రంగం అనే పడవకు యూడీఎస్, ప్రీలాంచుల వల్ల తూట్లు పడుతున్నాయి. ప్రభుత్వమే ముందుకొచ్చి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని వేచి చూసే ధోరణిని నిర్మాణ సంఘాలు వేచి చూస్తే.. నిర్మాణ రంగమంతా మునిగిపోయే ప్రమాదముంది. కాబట్టి, ఇప్పటికైనా వీరంతా తెలివిగా వ్యవహరించాలి. లేకపోతే ఆరంభ శూరులుగానే మిగిలిపోయే ప్రమాదముంది.
కరోనా థర్డ్ వేవ్ ముగిసినా.. నిర్మాణ రంగంలో అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ఇందుకు ప్రీలాంచ్, యూడీఎస్ అమ్మకాలో ప్రధాన కారణమని నిర్మాణ సంఘాలన్నీ ఎలుగెత్తి చాటాయి. తమ సంఘం సభ్యులే యూడీఎస్, ప్రీలాంచులు చేస్తున్నారని తెలిసినా, వారి గురించి ఇతర సభ్యులు ఫిర్యాదుల్ని అందజేసినా పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే, క్రెడాయ్ హైదరాబాద్ నిర్వహించే ప్రాపర్టీ షోలో ఆయా సంస్థలు బడా బడా స్టాళ్లను తీసుకోవడమో ప్రధాన కారణం.
నాలుగేళ్ల క్రితమే సొమ్మును అందజేసి నేటివరకూ నిర్మాణ పనుల్ని ఆరంభించని ఓ సంస్థ కార్యాలయం ముందు కొందరు కొనుగోలుదారులు ఏకంగా ధర్నా నిర్వహించారు. మరి, ఆ సంస్థపై చర్యలు తీసుకోవడానికి ఇంతకంటే మించిన సాక్ష్యం ఏముంటుందని తోటి సభ్యులు చెప్పినా ఈ సంఘం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
This website uses cookies.