Categories: TOP STORIES

జీ స్వ్కేర్‌పై ఐటీ దాడులు

చెన్నైకు చెందిన రియ‌ల్ ఎస్టేట్ కంపెనీ జీ స్వ్కేర్ సంస్థ‌పై సోమ‌వారం ఉద‌యం ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. త‌మిళ‌నాడులోని చెన్నైతో పాటు దాదాపు 50 లొకేష‌న్ల‌లో గ‌ల సంస్థ కార్యాల‌యాల‌పై ఏక‌కాలంలో సోదాలు నిర్వ‌హించారు. ఇటీవ‌ల‌కాలంలో అనూహ్యంగా తెర‌మీదికొచ్చిన ఈ సంస్థ భారీ వెంచ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. అంతేకాదు, ప్ర‌చారంలోనూ జోరు పెంచింది. ఈ క్ర‌మంలో భారీ స్థాయిలో ప‌న్ను ఎగ‌వేత‌కు పాల్ప‌డింద‌ని ఐటీ విభాగం దృష్టికొచ్చింది. కొనుగోలుదారుల నుంచి అధిక స్థాయిలో ఈ సంస్థ‌ న‌ల్ల‌ధ‌నాన్ని వ‌సూలు చేసింద‌నే ఫిర్యాదులు అందాయి. ఈ కంపెనీ అస‌లు ఓన‌ర్లు ఎక్క‌డుంటారనే విష‌యాన్ని ఐటీ విభాగం తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని స‌మాచారం. హైద‌రాబాద్‌లోనూ రెండు వెంచ‌ర్ల‌ను ఆరంభించిన జీ స్వ్కేర్.. ఎంతమొత్తంలో ప్లాట్ల‌ను విక్ర‌యించింది? ఎంత మంది కొనుగోలుదారుల నుంచి న‌ల్ల‌ధ‌నం వ‌సూలు చేసింద‌నే విష‌యం వెల్ల‌డ‌య్యే అవ‌కాశ‌ముంది. చౌటుప్ప‌ల్‌లోని జీ స్వ్కేర్ ఎపిటోమ్ అనే వెంచ‌ర్ అనేక వివాదాల‌కు నిల‌యంగా మారింద‌నే విష‌యం తెలిసిందే. ఇందులో కేవ‌లం 300 ఎక‌రాల‌ను సేక‌రించి.. 1200 ఎక‌రాల్లో ప్లాట్ల‌ను అమ్ముతున్నామంటూ ప్ర‌చారాన్ని నిర్వ‌హిస్తూ కొనుగోలుదారుల్ని బోల్తా కొట్టిస్తోంది. ఈ 1200 ఎక‌రాల చుట్టుప‌క్క‌ల భూములున్న రైతుల‌ను త‌మ పొలాల్లోకి వెళ్ల‌నీయడం లేదు. ఈ 1200 ఎక‌రాల య‌జ‌మానిగా భావిస్తున్న ఢిల్లీ చ‌ద్దా గ్రూపు బినామీల‌కు చెందిన‌ స్థానిక మేనేజ‌ర్‌ను ఏదో ర‌కంగా మేనేజ్ చేస్తూ తెలంగాణ‌ రైతుల మీద దౌర్జ‌న్యాలు చేస్తున్నార‌ని స‌మాచారం. ఏదీఏమైనా, సోదాల‌న్నీ పూర్త‌య్యాక ఐటీ అధికారులు పూర్తి వివ‌రాల‌ను వెల్ల‌డిస్తార‌ని చెన్నై మీడియా చెబుతోంది.

This website uses cookies.