Categories: TOP STORIES

డిసెంబరులోపు మాస్టర్ ప్లాన్లు సిద్ధమైతే అద్భుతమే

  • మాస్టర్ ప్లాన్ల తయారలో పురపాలక శాఖ విఫలం
  • తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్లయినా పురోగతి లేదు
  • బడ్జెట్ కేటాయింపుల్లేవు.. కన్సల్టెంట్లను నియమించలేదు
  • ఇలాగేతై మాస్టర్ ప్లాన్లు ఎన్నటికీ పూర్తి కావు!

పురపాలక శాఖ డిసెంబరులోపు మాస్టర్ ప్లాన్లు సిద్ధమవుతాయని ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. కానీ, వివరాల్లోకి వెళితే ఎక్కడా డిసెంబరులోపు మాస్టర్ ప్లాన్లు పూర్తవుతాయని లేనే లేదు. అయినా, మాస్టర్ ప్లాన్ల తయారీకి బడ్జెట్ కేటాయించకుండా.. తగిన సిబ్బందిని నియమించకుండా.. కనీసం కన్సల్టెంట్లను ఎంపిక చేయకుండా.. మాస్టర్ ప్లాన్లు ఎలా పూర్తవుతాయో అమాత్యులకే తెలియాలి. వాస్తవానికి చెప్పాలంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైనప్పట్నుంచి.. మాస్టర్ ప్లాన్ల తయారీలో పురపాలక శాఖ పూర్తి నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోంది. వీటి ప్రాధాన్యతను గుర్తించి.. తగిన బడ్జెట్ ను కేటాయిస్తే తప్ప.. మాస్టర్ ప్లాన్లు తయారు కావనే విషయాన్ని ఇప్పటికైనా మంత్రి కేటీఆర్ అర్థం చేసుకోవాలి. దానికి అనుగుణంగా సరైన ప్రణాళికలు రచించాలి. లేకపోతే, కొత్త పట్టణాలను ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఎలాంటి ఉపయోగం ఉండనే ఉండదు.

* 142 పురపాలక సంఘాల్లో కేవలం 74 మాస్లర్ ప్లాన్లు అమల్లో ఉండగా.. మిగతా 68 పురపాలక సంఘాల్లో కేవలం 8 మాస్టర్ ప్లాన్లను సిద్ధం చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపారు. అయినా, వీటిని ఎందుకింకా ఆమోదించలేదు? అసలు వీటిని కూలంకషంగా అధ్యయనం చేసి.. అర్థం చేసుకుని.. ఆమోదం తెలిపే ఉన్నతాధికారులు పురపాలక శాఖలో కరువయ్యారా? వీటిని ఆమోదించడానికి ఇంకా ఎంతకాలం కావాలి? 15 మాస్టర్ ప్లాన్లను తయారు చేసి ప్రభుత్వ ఆమోదించడానికి సిద్ధంగా ఉన్నాయని పురపాలక శాఖ అంటోంది. అదేవిధంగా, 45 మాస్టర్ ప్లాన్లను యుద్ధప్రాతిపదికన తయారు చేస్తున్నారని చెబుతున్నారు. వీటిని ఇంకా ఎంత కాలం తయారు చేస్తారు? ఇవి ఎందుకు ఆలస్యమవుతున్నాయి? ఇందుకు తగిన కారణాలేమిటో పురపాలక శాఖ ఉన్నతాధికారులు విశ్లేషించాలి.

మాస్టర్ ప్లాన్ల అమల్లో ఉండి కాలపరిమితి ముగిసిన 27 మాస్టర్ ప్లాన్లలో 2 పట్టణాల రివైజ్డ్ మాస్టర్ ప్లాన్లు ప్రభుత్వం ఆమోదించింది. రెండు రివైజ్డ్ మాస్టర్ ప్లాన్లు ప్రభుత్వ ఆమోదానికి పంపించారు. మరి, వీటికి ఎందుకు ఆమోదం లభించలేదు? మిగతా 23 పట్టణాల మాస్టర్ ప్లాన్లను రివైజ్ చేస్తున్నారు. ఇంకా ఎంతకాలం ఇలా రివైజ్ చేసుకుంటూ వెళతారు? ఎందుకు ఇవి పూర్తి కాలేదో అమాత్యులకే తెలియాలి. ఇప్పటికైనా పురపాలక శాఖ మాస్టర్ ప్లాన్ల తయారీలో చిత్తశుద్ధితో వ్యవహరించాలి. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని.. అందుకు తగ్గ బడ్జెట్ ను కేటాయించి.. మాస్టర్ ప్లాన్లను తయారు చేయాలి.

This website uses cookies.