వెలుగులోకి వచ్చిన
మరో ప్రీలాంచ్ మోసం..
ఆందోళనలో బయ్యర్లు
సొమ్ము అడిగితే బెదిరింపులు
ప్రీ లాంచ్ పేరుతో కోట్లు కొల్లగొట్టిన క్రితికా డెవలపర్స్
ఎల్బీనగర్ కేంద్రంగా ప్రీలాంచ్ దందా
2020లో సేల్స్.. ఇప్పటిదాకా ఆరంభం కాని పనులు
కస్టమర్ల మనీని డైవర్ట్ చేశారనే ఆరోపణలు
సొమ్ము వెనక్కి ఇవ్వమంటే బెదిరింపులు
న్యాయం చేయమని కోరుతున్న బాధితులు
హైద్రాబాద్‌లో ప్రీ లాంచ్ మోసాల పరంపర ఆగట్లేదు. ఒకరిని చూసి మరొకరు ఉడాయిస్తున్నారో..! లేక టైమ్ చూసి బిచాణా ఎత్తేస్తున్నారో..! ప్రతీ వారం- పది రోజులకోక కంపెనీ మోసం బయటపడటం మాత్రం కలవరపెడుతోంది. సువర్ణభూమి, ఆర్జే గ్రూప్ చీటింగ్ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. ఇప్పుడు మరో సంస్థ బండారం బయటపడింది. ప్రీ లాంఛ్ ఆఫర్ పేరుతో బయ్యర్లను రోడ్డున పడేసింది ఎల్బీ నగర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న క్రితికా ఇన్‌ఫ్రా డెవలపర్స్. నాలుగేళ్ల క్రితమే కస్టమర్ల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ సంస్థ తమ ఫ్లాట్స్ ఎక్కడా..? అని అడిగితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. క్రితికా ఇన్ ఫ్రా తీరుతో కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు.
నిర్మాణ రంగంలో ఏమున్నా.. లేకపోయినా కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం డెవలపర్స్ అండ్ రియల్ ఎస్టేట్ సంస్థలకు చాలా ముఖ్యం. కొంతమంది మోసగాళ్ల పుణ్యమా అని ఇప్పుడు ఆ నమ్మకమే పోయేలా కనిపిస్తోంది. ప్రీ లాంఛ్ ఆఫర్లు.. బై బ్యాక్ సేల్స్ అంటూ మోసం చేస్తుండటంతో డబ్బులు కట్టిన వారంతా రోడ్డున పడుతున్నారు. ఎప్పుడో ఒకసారి జరిగితే ఏమోలే అనుకోవచ్చు గానీ నెలలో రెండు లేదా వారం-పది రోజులకో కంపెనీ బిచాణా ఎత్తేయడం మాత్రం ఆందోళన చెందాల్సిన విషయమే. లేటెస్ట్‌గా ప్రీ లాంఛ్ ఆఫర్ల పేరుతో మోసం చేసింది క్రితికా ఇన్‌ఫ్రా డెవలపర్స్. డబ్బులు కట్టించుకోని సంవత్సరాలు దాటినా- ఇప్పటివరకు తమ ఫ్లాట్స్‌ను తమకివ్వలేదంటూ కస్టమర్లు ఆందోళన చేస్తున్నారు.
2020లో ప్రీ లాంచ్ పేరుతో సేల్స్ చేసి కస్టమర్ల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారు క్రితికా ఇన్‌ఫ్రా నిర్వాహకులు. ఎల్బీ నగర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న క్రితికా ఇన్‌ఫ్రాకు రాధా భూక్యా ఎండీ కాగా.. డైరెక్టర్‌గా ధూమవాత్ గోపాల్.. సీఈవోగా శ్రీకాంత్ వ్యవహరిస్తున్నారు. హైద్రాబాద్ శివార్లలోని తట్టి అన్నారంలో 2 ఎకరాల్లో శేషాద్రి ఓక్ పేరుతో ఎస్+6 అపార్ట్‌మెంట్ నిర్మిస్తామని 2020లో ప్రీ లాంచ్ సేల్స్ చేసి ఇప్పటివరకు నిర్మాణాలు కూడా చేపట్టలేదు. అలాగే ఉప్పల్‌లో 3 ఎకరాల్లో శేషాద్రి సిల్వర్ ఓక్ పేరుతో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్స్ నిర్మిస్తామని హ్యాండిచ్చారు. ప్రీ లాంచ్ పేరుతో దాదాపు 150 మంది కస్టమర్స్ నుంచి కోట్ల రూపాయలను వసూలు చేశారు నిర్వాహకులు. ఏళ్లు గడుస్తున్నా ఎటువంటి నిర్మాణాలు చేపట్టకపోగా.. బయ్యర్ల నుంచి కలెక్ట్ చేసిన డబ్బుని తమకున్న ఇతర వ్యాపారాల్లోకి మళ్లిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయ్. క్రితికా ఇన్ ఫ్రా తమని మోసం చేస్తుందని గ్రహించిన బాధితులు తమ డబ్బును తిరిగివ్వమని అడగ్గా మొదట్లో మాయమాటలు చెప్పి తప్పించుకొన్న యాజమాన్యం.. ఇప్పుడు ఏకంగా బెదిరింపులకు దిగుతోందని వాపోతున్నారు బాధితులు. తమకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్నారు.