తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ రంగం నుంచే వచ్చారు కాబట్టి.. రియాల్టీని సూపర్ డూపర్‌గా డెవలప్ చేస్తారని తొలుత అందరూ భావించారు. అసలు గత కాంగ్రెస్ ప్రభుత్వం కంటే.. ఈసారి రియాల్టీని కొత్త పుంతలు తొక్కిస్తారని ఆశించారు. మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలో ఫ్లాట్లను కట్టించే ప్రయత్నం కూడా చేస్తారని అనుకున్నారు. కానీ, అందరి అంచనాల్ని తలకిందులయ్యేలా చేశారని.. గత డిసెంబర్ నుంచి ఇప్పటివరకూ మార్కెట్‌ను కుప్పకూల్చేశారని.. యావత్ రియల్ రంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది.
హైదరాబాద్ రియల్ రంగంలో కొన్ని ప్రముఖ సంస్థలూ.. ఉద్యోగులకు సకాలంలో జీతాలివ్వలేని పరిస్థితి నెలకొంది. వెండార్లకు పేమెంట్లు చెల్లించలేక నానా ఇబ్బందులు పడుతున్నాయి. కొందరు డెవలపర్లు బ్యాంకులకు చెల్లింపులు చేయలేక గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు. ఇక వెంచర్లలో అయితే ప్లాట్లు కొనే నాధుడే లేకుండా పోయాడు. దీంతో, హైదరాబాద్ చుట్టుపక్కల గల అధిక శాతం వెంచర్లన్నీ పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. ఇలాంటి గడ్డు రోజులు గతంలో ఎన్నడూ రాలేదని అటు బిల్డర్లు ఇటు డెవలపర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌కు చెందిన ఒక డెవలపర్ ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండేవారు. గతంలో అనేక ఒడిదొడుకుల్ని ఎంతో సమర్థంగా ఎదుర్కొన్నారు. అలాంటి వ్యక్తి కూడా.. గత ఏడాది పరిస్థితుల్ని నుంచి బెంబేలెత్తిపోతున్నారు. ఆయనొక్కడే కాదు.. ఇలాంటి అధిక శాతం మంది హైదరాబాద్ డెవలపర్లు.. మార్కెట్ ఎప్పుడు మెరుగుపడుతుందా అని ఎదురు చూస్తున్నారు. అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కేవలం మూసీ గురించి మాట్లాడుతున్నారే తప్ప.. రియల్ మార్కెట్లో సానుకూల దృక్పథం నెలకొల్పడానికి పెద్దగా ప్రయత్నం చేయట్లేదని నిపుణులు అంటున్నారు.
ఫ్యూచర్ సిటీ గురించి తరుచూ మాట్లాడుతున్నా.. ట్రిపుల్ ఆర్ గురించి అప్డేట్స్ వస్తున్నా.. రియల్ రంగంలో నెలకొన్న భయం మాత్రం ఇంకా పోలేదు. గతేడాది డిసెంబరులోనే హైదరాబాద్‌ను వదిలేసిన ఇన్వెస్టర్లు మళ్లీ నగరానికి వచ్చేందుకు విముఖత చూపిస్తున్నారు. రాజకీయ రంగంలో నెలకొన్న అనిశ్చితి ఒక కారణంగా విశ్లేషిస్తున్నారు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం గతంలో మాదిరిగా హైదరాబాద్ అభివృద్ధిపై ప్రణాళికాబద్ధంగా వ్యవహరించట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గతంలో ఏం జరిగింది?
బీఆర్ఎస్ పాలనలో మంత్రి కేటీఆర్ ఎక్కడ సభలు జరిగినా, సమావేశాలు జరిగినా.. హైదరాబాద్ అభివృద్ధిపై తమ ప్రభుత్వ ప్రాధాన్యతల గురించి అనర్గళంగా చెప్పేవారు. గల్లీలో మాట్లాడినా.. ఢిల్లీకి వెళ్లినా.. నగరాభివృద్ధి గురించి పదేపదే మాట్లాడేవారు. విదేశీ సంస్థల ప్రతినిధులొచ్చినా.. దావోస్‌లో బడా కంపెనీల సీఈవోలైనా.. తమ ప్రణాళికల్ని విడమరిచి చెప్పేవారు. దానికి తగ్గట్టుగానే మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేసేవారు. అయితే, గత ఏడాది నుంచి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కేవలం రాజకీయాలే మాట్లాడుతుంది తప్ప.. డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టడం లేదనే విమర్శలున్నాయి.
హైదరాబాద్ అభివృద్ధి పట్ల వ్యూహాత్మకంగా, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం లేదనే అపఖ్యాతి మూటగట్టుకుంది. ఇప్పటికైనా, గత ప్రభుత్వాన్ని విమర్శించడం మానేసి.. తాము ఏ రకంగా నగరాన్ని అభివృద్ధి చేస్తామనే విషయంపై దృష్టి సారించాలి. రియల్ రంగాన్ని ప్రోత్సహించేందుకు తీసుకునే నిర్ణయాల్ని వెల్లడించాలి. రియల్ రంగంలో సానుకూల దృక్పదాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నించాలి.