కింగ్ జాన్సన్ కొయ్యడ : భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికీ సీఎం కేసీఆర్‌కు ఉన్నంత సమ్మిళతమైన విజన్ లేదని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పేదవారి సంక్షేమం, అభివృద్ధి, పర్యావరణం, పరిశ్రమలు, వ్యవసాయం, ఐటీ, పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి.. వంటివన్నీ పక్కాగా.. ప్రణాళికాబద్ధంగా జరుగుతుండటమే ఇందుకు నిదర్శనమని అన్నారు. అందుకే, హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో భూముల ధరలు పెరుగుతున్నాయని తెలిపారు. 2009లో సిరిసిల్ల వంటి ప్రాంతంలో లక్ష రూపాయలు విలువ చేయని భూమి విలువ ఈరోజు గణనీయంగా పెరిగిందన్నారు.
ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకూ ఎక్కడ చూసినా ఎకరం ధర పదిహేను నుంచి 25 లక్షలకు ఎకరా చెబుతున్నారని వెల్లడించారు. ఒకప్పుడు నీళ్లు లేక, కరెంటురాక కునారిల్లిపోయిన రైతులు నేడు ధీమాగా ఉన్నారని సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం యొక్క సమర్థత, దక్షత గల నాయకుడి విజన్ వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. సాధారణంగా ప్రభుత్వం ఏదో ఒక అంశం మీదే ఎక్కువగా ఫోకస్ పెడుతుందని.. గతంలో చంద్రబాబు నాయుడు ఐటీ, బిజినెస్, పరిశ్రమల మీద దృష్టి పెట్టేవారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎక్కువగా వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాల మీద దృష్టి పెట్టేవారు.
కానీ, ఇక్కడ కేసీఆర్ నాయకత్వంలో పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. ఐటీ ఎగుమతులు పెరుగుతున్నాయని, వ్యవసాయ ఉత్పత్తులు అధికం అవుతున్నాయని.. పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సమ్మిళతమైన, ఒక అరుదైన అభివృద్ధి జరుగుతోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. 230 కోట్ల మొక్కల పెట్టి ఏడు శాతం గ్రీన్ కవర్ పెంచిన రాష్ట్రం మనదని.. యునైటెడ్ నేషన్స్ హైదరాబాద్‌ని భారతదేశంలోనే ట్రీ సిటీగా వరుసగా రెండుసార్లు గుర్తించిందని గుర్తు చేశారు. ఇంకా, ఏమన్నారో కేటీఆర్ మాటల్లోనే..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి విద్యుత్తు సామర్థ్యం 7600 మెగావాట్లు ఉంటే, డిమాండ్ 9వేల మెగా వాట్లు ఉండేది. విద్యుత్తు సంక్షోభంతోనే తెలంగాణ ప్రయాణం ఆరంభమైందన్నారు. 25 లక్షల బోర్ వెల్స్ టూబ్ వెల్స్ ఉండేవి. వాటికి కరెంటు రాదు. నీళ్లు రాదు, సిరిసిల్లలో 800 ఫీట్లు కొట్టినా నీళ్లు వచ్చేవి కావు. తెలంగాణలో ఏడు మండలాల్ని పక్కన రాష్ట్రంలో కలిపేశారు. పవర్ జెనరేషన్ స్టేషన్ కూడా పోయింది. కేసీఆర్ సమర్థత, దక్షత వల్ల సుమారు ఆరు నెలల్లోపే విద్యుత్తు సమస్యను పరిష్కరించారు. రైతులకు 24 గంటలు ఉచితంగా విద్యుత్తును అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గర్వంగా చెప్పగలను. గృహాలకే కాదు పరిశ్రమలకూ నాణ్యమైన కరెంటును అందజేస్తున్నాం.
7000 వేల నుంచి ఇప్పుడు విద్యుత్తు సామర్థ్యం పదహారు వేల మెగావాట్లకు ఎలా చేరింది. 2025కల్లా 26 వేల మెగా వాట్లకు చేరుకుంటాం. ఇదెలా సాధ్యమైంది? లీడరుకు కమిట్‌మెంట్ ఉండాలి. డైలాగు కొట్టి ఛూమంతర్ అంటే అయిపోదు. అల్లావుద్దీన్ అద్భుత దీపం, మంత్రదండాలు ఎవరి వద్ద ఉండవు. పని చేయాలి. ఒళ్లు వంచాలి. బుర్ర పెట్టాలి. దానికి రిసోర్స్ అన్నీ కూడగట్టాలి. అప్పుడే పనవుతుంది. అదే కేసీఆర్ చేశారు. విజయం సాధించారు.
తెలంగాణలో ఎక్కడ చూసినా భూముల ధరలు పెరిగాయి. వ్యవసాయం 119 శాతం విస్తరించింది. ఎక్కడో మేడిగడ్డ వద్ద గోదావరి నీటిని ఒడిసిపట్టుకుని కొండపోచమ్మ సాగర్ వద్దకు తెచ్చాం. కేసీఆర్ అప్పు చేసి కాళేశ్వరం మీద ఖర్చు పెట్టారు. కొత్తగా 45 లక్షల ఎకరాలకు నీళ్లొచ్చింది. రెండు పంటలంటే 90 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చాయి. దాన్ని వల్ల సంపద సృష్టించబడుతుంది. మళ్లీ ఆ సంపద, ఈ రాష్ట్రంలోనే విద్య, వైద్యం, ఇల్లు కొనుక్కోవడం మీదే పెడతారు కదా.. ఇక్కడ రైతు బాగుపడితే, రైతు చేతికి పైసలొస్తే.. రాష్ట్రంలో సంపద పునరుత్పత్తి అవుతుంది కదా. అప్పు తీసుకుని కేసీఆర్ ఎక్కడ ఖర్చు పెట్టారు? విద్యుత్తు మీద పెట్టారు. ఎట్ల సాల్వ్ అయ్యింది కరెంట్ క్రైసిస్. అరవై ఏళ్లలో
సాధ్యం కానిది ఆరు నెలల్లో ఎలా సాధ్యమైంది? సబ్ స్టేషన్లు, లైన్లు వేశాం. విద్యుత్తు ఇన్‌ఫ్రాను డెవలప్ చేశాం. అది ప్రాడక్టీవ్ ఎక్సపెండీచర్. మనకే లాభం కదా..
మొన్న మహేశ్వరం విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ వచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమ.. మూడు షిఫ్టుల చొప్పున పని చేస్తున్నారు. ఎక్కువగా స్థానిక అమ్మాయిలే పని చేస్తున్నారు. విద్యుత్తు వస్తే పరిశ్రమలు నడుస్తయ్, ఇళ్లల్లో విద్యుత్తు సమస్య ఉండదు. సంపద పునరుత్పత్తి అవుతుంది. కేసీఆర్ అప్పు తీసుకుని మంచినీటి మీద పెట్టారు. తాగునీరు లభిస్తే.. వాటర్ బార్న్ డిసీజెస్ తగ్గుతాయ్. ఆరోగ్యం మీద ప్రజల ఖర్చు తగ్గుతుంది. పెట్టిన ప్రతిపైసా మళ్లీ మరోపైసాను సృష్టిస్తుంటే.. అది అప్పు కాదు. పెట్టుబడి. తెలివైన వారు చేసే పని ఇదే. మన భవిష్యత్తు తరాల మీద పెట్టే పెట్టుబడిని అప్పు కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దీన్నే లివరేజింగ్ ఎకానమీ అంటారు. దీన్ని ప్రతి దేశం చేస్తుంది. అప్పు చేసి సంపదను పునరుత్పత్తి చేయడం తప్పెలా అవుతుంది? ఇంటింటికి తాగునీరు ఇవ్వాలనే ఆలోచన కేసీఆర్ కు రానంత వరకూ ఇతర ముఖ్యమంత్రులకు ఎందుకు రాలేదు? ఏ ప్రధానమంత్రికి ఎందుకు రాలేదు? రైతుకు పెట్టుబడి పెట్టాలని ఎందుకు ఆలోచన రాలేదు?
నగరాలనేవి జాతీయ సంపద.. వీటిలో తగిన సౌకర్యాలు కల్పించకపోతే దేశానికి పెద్ద నష్టం చేసినట్లు అవుతుంది. సీఎం కేసీఆర్ 2014లో ప్రధానమంత్రిని కలిసినప్పుడు.. టాప్ 10 లేదా 15 నగరాల్లో పెరిగే జనాభా, వారి అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాల్లో ఏటా రూ.10- 15 వేల కోట్లు అభివృద్ధి నిమిత్తం అందజేయాలని.. అప్పుడే దేశం ఆర్థికంగా పరుగులు పెడుతుందని చెబితే ఆయన పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత వారు స్మార్ట్ సిటీస్, అమృత్ సిటీస్ అని ప్రవేశపెట్టారు. ఎవరి విజన్ వారిది, ఎవరి ఆలోచన వారిది.
This website uses cookies.