Categories: LEGAL

కార్మికుల సంక్షేమం కోసం.. లేబర్ సెస్ వాడటమే ఉత్తమం

అసలే లాక్ డౌన్.. పనికి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు.. ఇక్కడే ఉండాలంటే చేతిలో నయా పైసా లేదు. మరి, ఇంటి అద్దెలు కట్టడమెలా? తిండి తినడమెలా? నిత్యావసర సరుకులు కొనుక్కోవడమెలా? ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో భవన నిర్మాణ సంక్షేమ కోసం వసూలు చేసే లేబర్ సెస్సును వినియోగించుకోవడం ఉత్తమమని న్యాయవాది కేవీఎస్ రామచంద్రరావు అన్నారు. కార్మికులు స్వస్థలాలకు వెళ్లొద్దని ప్రభుత్వం ప్రకటనలు గుప్పించి వదిలేస్తే సరిపోదని.. వారి ఆలనాపాలనా చూసేందుకు ఈ నిధిని వినియోగించడమో సరైన మార్గమని చెబుతున్నారు.దాదాపు పదహారేళ్ల క్రితం పురుడు పోసుకున్న లేబర్ సెస్ చట్టం గురించి రియల్ ఎస్టేట్ గురుకు ప్రత్యేకంగా వివరిస్తున్నారు. మరి, ఆయన ఏం చెబుతున్నారంటే..

KVS Ramachandra Rao

శవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న నిర్మాణ రంగాన్ని పరిగణనలోకి తీసుకుని.. 2005లో అప్పటి కేంద్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. నిర్మాణాల్లో పని చేసే భవన నిర్మాణ కార్మికులకు విధి నిర్వణహలో అంగవైకల్యం ఏర్పడినా, దుర్మరణం చెందినా ఆయా కుటుంబానికి నష్టపరిహారాన్ని అందించడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశ్యం. అంటే, ఆపద సంభవిస్తే ఆయా కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునే చట్టమిది. దీని ప్రకారం.. ప్రతి రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం నిమిత్తం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలి. ప్రతి నగరంలో నిర్మాణాల్ని చేపట్టే నిర్మాణ సంస్థ.. తమ మొత్తం ప్రాజెక్టులో విలువలో ఒక శాతం సొమ్మును సెస్సు రూపంలో ఈ సంక్షేమ బోర్డుకు జమ చేయాలి. ఆయా సొమ్మును కేవలం కార్మికుల సంక్షేమం నిమిత్తమే వినియోగించుకోవాలి. కాకపోతే, ఈ సొమ్మును కార్మికుల సంక్షేమానికి పెద్దగా వాడుతున్న సందర్భాల్లేవని చెప్పొచ్చు. కొందరు అధికారులు ఈ సొమ్మును ఇతర పనులకు వినియోగిస్తున్నట్లు సమాచారం. ఇదే సొమ్ముతో కొన్ని సందర్భాలతో జీతాలూ చెల్లించారు.

ప్రత్యేక రిజిస్టర్ ఉండాలి..

అస్పాం, బీహార్, చత్తీస్ ఘడ్, జార్ఖండ్, ఒరిస్సా, బెంగాల్ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు మన వద్ద ఎక్కువగా నిర్మాణ కార్యకలాపాల్లో పాల్గొంటారు. ఇందులో దినసరి కూలీలు, బార్ బెండర్లు, పేయింటర్లు, కార్పెంటర్లు, ఫ్లోరింగ్ పనులు చేసేవారు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు వంటివారూ ఎక్కువగా ఉంటారు. వీరందరితో కూడిన ఒక రిజిస్టర్ ను ప్రతి నిర్మాణ సంస్థ సిద్ధం చేసి.. వాటి వివరాల్ని స్థానిక కార్మిక బోర్డుకు అందజేయాలి. అంటే, ఆయా కంపెనీలో ఏయే రాష్ట్రాలకు చెందిన కార్మికులు పని చేస్తున్నారో స్పష్టంగా తెలియజేస్తూ విధిగా ఒక శాతం సెస్సును చెల్లించాలి. కాకపోతే, తెలివైన కొందరు బిల్డర్లు ఏం చేస్తారంటే.. ఈ పనిని మొత్తం గుత్తేదారులకు అప్పగిస్తున్నారు. ఆయా పనులన్నీ తను చూసుకుంటాడులే తమకు సంబంధం లేదని భావిస్తారు. నిజానికిలా వ్యవహరించడం చట్టపరంగా తప్పు. ఒకవేళ గుత్తేదారు లేబర్ సెస్సు చెల్లించకపోతే ఆయా సొమ్మును కట్టాల్సిన బాధ్యత అసలైన యజమాని మీదే ఉంటుంది. కాకపోతే, బ్రతుకు తెరువు కోసం వచ్చిన నగరానికొచ్చే కార్మికుల్ని అనేక నిర్మాణ సంస్థలు ఇలాగే మోసం చేస్తున్నాయి.

సెస్ ఎంత మంది కట్టారు?

ఏదైనా ఒక నిర్మాణంలో వలస కార్మికుడు ఒక్క రోజు పని చేసినా అతనికి పీఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలని చట్టాలున్నప్పటికీ, ఈ విషయాన్ని గుత్తేదారులు పెద్దగా పట్టించుకోరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని పెద్దగా పట్టించుకోకపోవడం వల్లే కొవిడ్ వంటి సమయాల్లో భవన కార్మికులు తమ స్వస్థలాలకు తరలి వెళ్లిపోతున్నారు. ప్రభుత్వ పర్యవేక్షణ లోపించడం, ఆమ్యామ్యాలకు అలవాటు పడ్డ అధికారుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా కొందరు బిల్డర్లు లేబర్ సెస్సను ఎగ్గొడుతున్నారని తెలిసింది. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది బిల్డర్లు ఏయే ఏరియాల్లో నిర్మాణాల్ని కడుతున్నారు? అందులో ఎంతమంది లేబర్ సెస్ చెల్లించారనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టమైన ఒక ప్రకటన విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకోసం ఆయా సంస్థలు రుణాల కోసం రూపొందించే ప్రాజెక్టు నివేదికను పరిగణనలోకి తీసుకుంటే ఉత్తమం.’’

కార్మికుల సంక్షేమం..

‘‘లేబర్ సెస్సును చెల్లించే బిల్డర్లు ఏం చేయాలంటే.. కరోనా విపత్కర సమయంలో.. లేబర్ సెస్ నిధుల్ని లాక్ డౌన్ సమయంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం నిమిత్తం వినియోగించాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి.’’

This website uses cookies.