Categories: TOP STORIES

అర్ధరాత్రి వేళ భూకబ్జాకు యత్నం

ఫీనిక్స్ సంస్థపై ఫిర్యాదు

తన వెంచర్ పక్కనే ఓ వ్యక్తికి ఉన్న ప్రైవేటు భూమిని అర్ధరాత్రి వేళ కబ్జా చేసేందుకు ఫీనిక్స్ సంస్థ ప్రయత్నించింది. ఏకంగా 30 మంది బౌన్సర్లు, బుల్డోజర్ తో వచ్చి ఆ భూమి చుట్టూ ఉన్న ఫెన్సింగ్ ను ధ్వంసం చేసింది. అడ్డుకోబోయిన వాచ్ మెన్ పై విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. ఈ వ్యవహారంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలోని మేడిపల్లి గ్రామంలో ఫీనిక్స్ కంపెనీ 50 ఎకరాల్లో వెంచర్ వేస్తోంది. ఈ భూమికి ఆనుకుని ముందు భాగంలో రఘు అలేఖ్ అనే వ్యక్తికి 1300 గజాల స్థలం ఉంది. ఈ భూమిపై కన్నేసిన ఫీనిక్స్ పెద్దలు.. దాన్ని ఆక్రమించుకోవడానికి గతంలో రెండు సార్లు ప్రయత్నించారు. హద్దులు చెరిపేసి గందరగోళం చేయడంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు.

దీంతో కోర్టు అడ్వొకేట్ కమిషన్ ను నియమించింది. ఆ కమిషన్ రెవెన్యూ అధికారులతో సర్వే చేయించి హద్దులు నిర్ధారించారు. అనంతరం రఘు తన స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసుకున్నారు. తన స్థలంలో కంటైనర్ రూమ్ ఏర్పాటు చేసుకుని వాచ్ మన్ ను పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఫీనిక్స్ కంపెనీ తాజాగా మరోసారి ఆ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించిందని రఘు రాచకొండ పోలీస్ కమిషనర్, మహేశ్వరం డీసీపీలకు ఫిర్యాదు చేశారు. ఈనెల 16న అర్ధారత్రి సమయంలో దాదాపు 30 మంది బౌన్సర్లు జేసీబీలతో వచ్చి బౌండరీ చుట్టూ నిర్మించుకున్న బేస్ మెంట్ ను, ఫెన్సింగ్ ను కూల్చి వేశారని పేర్కొన్నారు. అడ్డుకోబోయిన తన మేనేజర్ శ్రీరామ్, వాచ్ మెన్ రాజుపై దాడి చేసి కొట్టారని వివరించారు. ఈ నేపథ్యంలో శ్రీనిధి వెంచర్ తోపాటు కృష్ణంరాజు, బాబూరావుపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

This website uses cookies.