Categories: TOP STORIES

ఆఫీస్ స్పేస్ కు అదిరే డిమాండ్

జీసీసీలు, థర్డ్ పార్టీ ఐటీ సర్వీస్
సంస్థల దన్నుతో అదే ఊపు

గతేడాది లీజింగ్ లో
వీటి వాటా 46 శాతం

నైట్‌ ఫ్రాంక్ నివేదిక వెల్లడి

భారత్ లో ఆఫీస్ స్పేస్ కు డిమాండ్ గణనీయంగా పెరిగిందని, అంతర్జాతీయ కంపెనీలు తమ ఉద్యోగాలను భారత్‌కు అవుట్‌సోర్సింగ్‌ చేస్తుండటమే ఇందుకు కారణమని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ పేర్కొంది.

2023లో మొత్తం వర్క్‌ స్పేస్ లీజింగ్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ), థర్డ్ పార్టీ ఐటీ సేవల సంస్థల వాటా 46 శాతంగా నమోదైందని వివరించింది. “ఆసియా పసిఫిక్ హొరైజన్: హార్నెసింగ్ ది పొటెన్షియల్ ఆఫ్ ఆఫ్‌షోరింగ్” పేరిట ఈ మేకు ఓ నివేదిక విడుదల చేసింది. ఇందులోని వివరాల ప్రకారం.. భారత్‌లో ఆఫ్‌షోరింగ్ పరిశ్రమ గణనీయంగా పెరిగి.. గ్లోబల్ ఆఫ్‌షోరింగ్ మార్కెట్లో 57 శాతం వాటాను దక్కించుకుంది. వ్యయాలను తగ్గించుకునేందుకు, నిర్వహణ సామర్ధ్యాలను మెరుగుపర్చుకునేందుకు కంపెనీలు తమ వ్యాపార ప్రక్రియలను లేదా సర్వీసులను ఇతర దేశాల్లోని సంస్థలకు అవుట్‌సోర్స్ చేయడాన్ని ఆఫ్‌షోరింగ్‌గా వ్యవహరిస్తారు. దీన్నే బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ (బీపీవో)గా కూడా పేర్కొంటారు. ఇందులో జీసీసీలు, గ్లోబల్ బిజినెస్ సర్వీసులు (జీబీఎస్‌) మొదలైనవి ఉంటాయి. కంపెనీలు వేరే ప్రాంతాల్లో అంతర్గతంగా ఏర్పాటు చేసుకునే యూనిట్లను జీసీసీలుగా వ్యవహరిస్తారు.

ఇక నివేదికలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. 2023లో ఆఫ్‌షోరింగ్ పరిశ్రమలో మొత్తం లీజింగ్ పరిమాణం 27.3 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. 2022తో పోలిస్తే 26 శాతం పెరిగింది. ఇందులో జీసీసీలు 20.8 మిలియన్ చదరపు అడుగులు, థర్డ్ ‍పార్టీ ఐటీ సేవల సంస్థలు 6.5 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ను లీజుకు తీసుకున్నాయి. 2023లో మొత్తం సేవల ఎగుమతుల్లో ఆఫ్ షోరింగ్ వాటా 60 శాతంగా నమోదైంది. సర్వీస్ ఎగుమతులు 2013లో 63 బిలియన్ డాలర్లుగా ఉండగా 2023లో మూడు రెట్లు వృద్ధి చెంది 185.5 బిలియన్ డాలర్లకు చేరాయి. ఆఫ్‌షోరింగ్ సేవలు అందించే గ్లోబల్ సంస్థల్లో 42 శాతం కంపెనీలకు భారత్‌లో కార్యకలాపాలు ఉన్నాయి.

2023 నాటికి దేశీయంగా జీసీసీల సంఖ్య 1,580కి పైగా ఉంది. దేశీయ ఆఫీస్ స్పేస్ లీజింగ్ లావాదేవీల్లో వీటి వాటా 2022లో 25 శాతంగా ఉండగా 2023లో 35 శాతానికి చేరింది. జీసీసీల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థల వాటా గణనీయంగానే ఉన్నప్పటికీ తాజాగా ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో వృద్ధికి సెమీకండక్టర్లు, ఆటోమొబైల్, ఫార్మా తదితర రంగాలు కారణంగా ఉంటున్నాయి. రాబోయే దశాబ్ద కాలంలో ఆఫీస్ మార్కెట్‌కు జీసీసీలే దన్నుగా నిలవనున్నాయి. 2030 నాటికి దేశీయంగా వీటి సంఖ్య 2,400కి చేరుతుందని అంచనా.

This website uses cookies.