- దుబాయ్, అబుదాబీలో ఆకాశహర్మ్యలను
నిర్మించిన బడా నిర్మాణ సంస్థ - ఈస్ట్ హైదరాబాద్‌లో నయా స్కే స్ర్కేపర్ ఆరంభం
- జి+ 31 అంతస్తుల్లో ఆకాశహర్మ్యం
- నాలుగేళ్లలో పూర్తయ్యే అవకాశం
దుబాయ్, అబుదాబీలో ఎత్తయిన ఆకాశహర్మ్యాల్ని నిర్మించిన ఓ అంతర్జాతీయ నిర్మాణ సంస్థ.. హైదరాబాద్‌లో అడుగుపెట్టిందా? మేఘాలను తాకే నిర్మాణాల్ని చేపట్టేందుకు ప్రణాళికల్ని రచిస్తోందా? ఇంతకీ ఆ కంపెనీ నేపథ్యమేమిటి? నగరంలో ఎక్కడ స్కై స్క్రేపర్‌ని నిర్మిస్తోంది? ఎన్ని అంతస్తుల్ని కడుతోంది? ఇలాంటి ముఖ్యమైన అంశాల్ని తెలుసుకోవాలంటే మీరు ఈ కథనం చదవాల్సిందే!
హైదరాబాద్ నగరానికి గల విశిష్ఠత.. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మౌలిక సదుపాయాల కారణంగా.. దేశవిదేశీ ఐటీ సంస్థలు దృష్టి సారిస్తున్నాయి. గత కొన్నేళ్ల నుంచి పలు నిర్మాణ సంస్థలు స్కై స్క్రేపర్ల నిర్మిస్తున్నాయి. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని పశ్చిమాసియా దేశాల్లో ఆకాశహర్మ్యాల్ని నిర్మిస్తున్న ఓ సంస్థ భాగ్యనగరంలోకి అడుగుపెట్టింది. ఈ సంస్థ ప్రత్యేకత గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. లెబనాన్‌లో 1967లో ఆరంభమైన ఆ సంస్థ.. ప్రప్రథమంగా బీరూట్‌లో అమెరికా లైఫ్ ఇన్సూరెన్స్ బిల్డింగ్‌ని ఆరంభించింది. తర్వాత అబుదాబీలో హమదాన్ సెంటర్, యూఏఈలో ఇంటర్ కాంటినెంటెల్ హోటల్, దోహాలో అమీర్ ఆఫ్ ఖతార్ పాలేస్, అబుదాబీలో సిల్వర్ టవర్, లివా సెంటర్, రీట్ టవర్, షార్జాలో ఎతిసలాట్ ఆఫీసెస్, అబుదాబీ ట్రేడ్ సెంటర్ వంటి నిర్మాణాల్ని చేపట్టింది. ఆకాశహర్మ్యాల నిర్మాణాలకు ఈ సంస్థ పెట్టింది పేరు.
దుబాయ్‌లో 2008లో ద రోజ్ రొతానా అనే 333 మీటర్ల కట్టడాన్ని చేపట్టింది. అబుదాబీలో సన్ అండ్ స్కై టవర్స్, దుబాయ్‌లో సన్ అండ్ స్కై టవర్స్, స్కై వ్యూ, అల్మాస్ టవర్, అబుదాబీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ వంటి ఆకాశహర్మ్యాల్ని చేపట్టింది. రెసిడెన్షియల్ టవర్స్ విషయానికి వస్తే.. అబుదాబీలో గేట్ టవర్స్, దుబాయ్‌లో ఎలైట్ టవర్, యాక్కూబ్ టవర్, ఫౌంటెయిన్ వ్యూస్, బీరూట్‌లో ప్లాటినం టవర్ వంటి ఆకాశహర్మ్యాల్ని చేపట్టిన ట్రాక్ రికార్డు ఈ సంస్థకు సొంతం. ప్రస్తుతం ఈ సంస్థ ముంబైలో లోధా టవర్స్ వారి వరల్డ్ వన్ ముంబై, ఢిల్లీలో స్పిరా వంటి ప్రాజెక్టుల్ని నిర్మిస్తోంది.
తూర్పు హైదరాబాద్ ఎందుకు?
పశ్చిమ హైదరాబాద్ తర్వాత అధికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఈస్ట్ సిటీయే నిలుస్తుంది. ఇప్పటికే ఇన్ఫోసిస్ వంటి ఐటీ కంపెనీలు పోచారంలో కార్యకలాపాల్ని నిర్వహిస్తున్నాయి. అక్కడికి ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి సులువుగా రాకపోకల్ని సాగించొచ్చు. పైగా, ఔటర్ రింగ్ రోడ్డు కూడా తూర్పు హైదరాబాద్ నుంచి వెళుతోంది. ఇలాంటి సానుకూలాంశాల్ని దృష్టిలో పెట్టుకుని.. ఉప్పల్ మెట్రో స్టేషన్ పక్కన జి+31 అంతస్తుల ఆకాశహర్మ్యాన్ని నిర్మించేందుకు ప్రణాళికల్ని రచిస్తోంది. ఆయా స్టేషన్.. కాదు కాదు ఆయా ప్రాంతంలోనే ఇది ప్రప్రథమ ఆకాశహర్మ్యమని చెప్పొచ్చు. సుమారు రెండు ఎకరాల్లో రెండు టవర్లను నిర్మిస్తోంది. ఒక్కో టవర్ జి ప్లస్ 31 అంతస్తులో కడుతోంది. ఇందులో వచ్చేవి దాదాపు 300 ఫ్లాట్ల దాకా ఉంటాయని సమాచారం.
ఈస్ట్ హైదరాబాద్ ఈజ్ రైజింగ్..
మంత్రి కేటీఆర్ తూర్పు హైదరాబాద్ అభివృద్ధి చేయడానికి పక్కా ప్రణాళికల్ని రచిస్తున్నారు. రానున్న రోజుల్లో పలు ఐటీ కంపెనీలూ ఇక్కడికొచ్చే అవకాశాలున్నాయి. భవిష్యత్తులో ఇక్కడి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పలు సంస్థలు ఈస్ట్ హైదరాబాద్‌లో ఆకాశహర్మ్యాల్ని కట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి.- కిశోర్, ఎండీ, ఆల్సేస్ కన్‌స్ట్రక్షన్స్