కొత్తగా ఇల్లు కొనాలనుకునే ఆకాంక్షకు వడ్డీ రేట్లే అడ్డంకిగా మారాయి. ఇంటి రుణంపై వడ్డీ రేట్లు 9 శాతం దాటితే తమకు ఇబ్బందే అని ఎక్కువమంది భావిస్తున్నారు. ఫిక్కీ, అనరాక్ నిర్వహించిన సర్వేలో 90 శాతం మంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. గృహ రుణ రేట్లు 8.5 శాతం దిగువనే కొనసాగితే తమ ఇంటి కొనుగోలు నిర్ణయంపై ఎలాంటి ప్రభావం ఉండదని 71 శాతం మంది స్పష్టం చేశారు. 9 శాతం దాటితే తమ నిర్ణయాలు ప్రభావితం అవుతాయని 87 శాతం మంది తెలిపారు. 8.5-9 శాతం మధ్య రేట్లు కొనసాగితే తమ నిర్ణయాలపై ఓ మోస్తరు ప్రభావమే ఉంటుందని 54 శాతం మంది చెప్పారు.
గతంలో వడ్డీ రేట్లు అత్యంత తక్కువగా దాదాపు 6.35 శాతం మాత్రమే ఉండేది. రానురానూ ఆర్బీఐ వడ్డీ రేట్లను సవరించడంతో ప్రస్తుతం దాదాపు 10 శాతానికి చేరింది. దీంతో వడ్డీ భారం బాగా ఎక్కువైంది. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లు తగ్గితే ఇల్లు కొంటే బాగుంటుందని ఎక్కువమంది ఆలోచిస్తున్నారు. కానీ ఇప్పటికిప్పుడు వడ్డీ రేట్లు తగ్గే పరిస్థితి కూడా లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘భారత రియల్ ఎస్టేట్ రంగం చెప్పుకోతగ్గ పరిణామక్రమాన్ని చూసింది. ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్ల కంటే నిర్మాణంలోని ప్రాపర్టీల వైపు వినియోగదారులు మొగ్గు చూపిస్తుండడం డెవలపర్ల పట్ల, నియంత్రణ వాతావరణం పట్ల పెరిగిన విశ్వాసాన్ని తెలియజేస్తోంది’’ అని ఫిక్కీ ప్రెసిడెంట్ సందీప్ సోమాని తెలిపారు.
ఈ కన్జ్యూమర్ సర్వేకు ఎంతో ప్రాముఖ్యత ఉందని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి పేర్కొన్నారు. ప్రస్తుత మార్కెట్ వాతావరణంలో వినియోగదారుల ప్రాధాన్యతలకు ఇది అద్దం పడుతుందన్నారు.
This website uses cookies.