దేశవ్యాప్తంగా 30 టైర్-2 నగరాల్లో ఇళ్ల అమ్మకాలు జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కాస్త తగ్గాయి. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్త.. 13 శాతం మేర తగ్గి 41,871 ఇళ్లు అమ్ముడయ్యాయి. ఈ మేరకు వివరాలను ప్రాప్ ఈక్విటీ వెల్లడించింది. గతేడాది ఇదే సమయంలో 47,985 ఇళ్లు అమ్ముడైనట్టు పేర్కొంది. గత సంవత్సరం రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదు కావడమే ప్రస్తుత క్షీణతకు కారణం అని వివరించింది. అలాగే కొత్త ఆవిష్కరణలు సైతం 34 శాతం తగ్గాయని తెలిపింది.
గతేడాది క్యూ3లో 43,748 కొత్త యూనిట్లు లాంచ్ కాగా, ఈ ఏడాది క్యూ3లో 28,980 యూనిట్లు మాత్రమే లాంచ్ అయినట్టు పేర్కొంది. ప్రస్తుతం జరిగిన మొత్త అమ్మకాల్లో అహ్మదాబాద్, వడోదర, గాంధీనగర్, సూరత్, గోవా, నాసిక్, నాగ్ పూర్ లతో కూడిన వెస్ట్ జోన్ ది 72 శాతం వాటా అని వివరించింది. ‘తక్కువ జీవన వ్యయం, నైపుణ్యం కలిగిన నిపుణుల లభ్యత, కంపెనీలకు అనుకూల కార్యాచరణ వ్యయంతో పాటు రాష్ట్ర రాజధానులలో మంచి కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు గృహాలకు డిమాండ్‌ను పెంచుతున్నాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో అమ్మకాలు పడిపోయినప్పటికీ హౌసింగ్ మార్కెట్ స్థితిస్థాపకంగా ఉంది. ప్రస్తుత పండుగ త్రైమాసికంలో బలమైన విక్రయాలు ఉంటాయని అంచనా. ద్వితీయ శ్రేణి నగరాల్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడి చాలా లాభదాయకం కాదు. కనెక్టివిటీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో వృద్ధి ఉన్నప్పటికీ ఈ నగరాలు పెట్టుబడిదారులను ఆకర్షించే స్థాయిలో రాబడిని అందించడంలో విఫలమయ్యాయి.
పేలవమైన అద్దె ఆదాయం, మూలధన విలువలో అంతగా లేని వృద్ధి, ఆస్తి నిర్వహణ ఖర్చు.. వెరశి ఈ నగరాల్లో పెట్టుబడిని అత్యంత ప్రమాదకరం చేస్తోంది’ అని నివేదిక వివరించింది. కొత్త సరఫరాలో భోపాల్ (268శాతం), డెహ్రాడూన్ (100 శాతం), కొయంబత్తూరు (77శాతం) మెరుగైన పనితీరు కనబరిచినట్టు నివేదిక వెల్లడించింది.
This website uses cookies.