Categories: LATEST UPDATES

రెరాపై గవర్నర్ కు లేఖ

రెరా అథారిటీ ఏర్పాటై నాలుగేళ్లయినా కేవలం కాగితాలకే పరిమితం అయ్యిందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం పద్మనాభరెడ్డి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు బుధవారం లేఖ రాశారు. చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సర కాలంలోపు రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీని నియమించాలి. ఇందులో ఒక ఛైర్మన్, ఇద్దరికి తక్కువ కాకుండా సభ్యులుండాలి. అథారిటీ నియామకం జరిగే వరకూ కొంతకాలం రాష్ట్ర ప్రభుత్వం కార్యదర్శి ర్యాంకు కలిగిన అధికారిని రెగ్యులేటరీ అథారిటీగా నియమించవచ్చు. 2018లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీని రెరా ఛైర్మన్గా నియమించింది.

ఆ తర్వాత ఆయన పదవీకాలం ముగిసింది. దీంతో తాత్కాలిక బాధ్యతల్ని సోమేష్ కుమార్ కి అప్పగించారు. అయితే, ఆ తర్వాతి క్రమంలో ఆయన సీఎస్ అయ్యారు. రెరా అథారిటీ ఏర్పాటైనప్పటికీ, కొందరు బిల్డర్లు, ఏజెంట్లు అథారిటీ వద్ద నమోదు చేసుకోకుండానే పెద్ద ఎత్తున అమ్మకాలు చేపడుతున్నారు. సామాన్యుల్ని మోసం చేస్తున్నారు. అక్రమాల్ని అరికట్టేందుకు పూర్తి స్థాయి అథారిటీని, అప్పీలేట్ ట్రిబ్యునల్ ను త్వరగా నియమించేలా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్ కు రాసిన లేఖలో ఎం పద్మనాభరెడ్డి కోరారు.

This website uses cookies.