స్థిరమైన అద్దె ఆదాయం ఉంటే రుణం పొందే చాన్స్
కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాపర్టీలపైనా లోన్లు
అద్దె ఆదాయం ద్వారా రుణం తీసుకోవడం ప్రాపర్టీ యజమానులకు ఓ వ్యూహాత్మకమైన ఆర్థిక మార్గం. అద్దెల ద్వారా స్థిరమైన ఆదాయం పొందుతున్న వ్యక్తులు ఇంటి మరమ్మతులు లేదా పునరుద్ధరణ, పెట్టుబడులు, వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాల కోసం అవసరమైన నిధులను రుణం రూపంలో పొందే అవకాశం ఉంది. రుణానికి గ్యారెంటీగా ఇక్కడ అద్దె ఆదాయాన్ని పెడతారన్నమాట. ప్రస్తుతం ఆ రుణాన్ని బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు అందిస్తున్నాయి. అద్దె ఆదాయం ఎంత వస్తుందో దానికి అనుగుణంగా రుణాలు మంజూరు చేస్తాయి. ఆయా ప్రాపర్టీలను ఏవైనా ప్రముఖ సంస్థలు, కంపెనీలకు ఇవ్వడం కూడా రుణ మంజూరుకు ప్రామాణికంగా తీసుకుంటాయి. అయితే, ఆయా అంశాలు బ్యాంకులను బట్టి మారుతూ ఉండొచ్చు.
అద్దె ఆదాయం పొందుతున్న ప్రాపర్టీ కచ్చితంగా మీ సొంతమై ఉండాలి. క్రమం తప్పకుండా అద్దె ఆదాయం వచ్చే వాణిజ్యపరమైన ప్రాపర్టీ అయి ఉండాలి. కొన్ని బ్యాంకులు, సంస్థలు రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు కూడా ఈ రుణం ఇస్తున్నాయి. స్థిరమైన అద్దె ఆదాయం వచ్చే ప్రాపర్టీలకు ఇవి ప్రాధాన్యత ఇస్తాయి. అలాగే మీ క్రెడిట్ స్కోర్, ఆర్థిక చరిత్ర కూడా రుణ మంజూరు, వడ్డీ రేటులో కీలకం అవుతాయి. రుణదాతలు మీ ప్రాపర్టీ విలువను కోరే అవకాశం ఉంది.
ప్రాపర్టీ యాజమాన్యం, స్థిరమైన అద్దె ఆదాయం, మీ క్రెడిట్ స్కోర్, ప్రాపర్టీ విలువ వంటి రుణదాతలు నిర్దేశించిన అర్హతలన్నీ మీరు కలిగి ఉన్నారో లేదో చెక్ చేసుకోండి. అనంతరం వీటికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు తీసుకోవాలి. ప్రాపర్టీ యాజమాన్యాన్ని ధ్రువీకరించే పత్రాలు, అద్దె ఒప్పందాలు, బ్యాంకు స్టేట్ మెంట్లు, ఆదాయపన్ను రిటర్నులు, ఐడీ ప్రూఫ్, చిరునామా ధ్రువీకరణ, ప్రాపర్టీ ఫొటోలు అవసరమవుతాయి. అనంతరం మీరు ఎంచుకున్న బ్యాంకు లేదా ఆర్థిక సంస్థలో రుణం కోసం దరఖాస్తు చేయాలి. అన్న పత్రాలనూ దరఖాస్తుతోపాటు సమర్పించాలి. తర్వాత బ్యాంకు లేదా ఆ ఆర్థిక సంస్థ ప్రాపర్టీ మార్కెట్ విలువ, అద్దె ఆదాయం ఎంత వస్తుంది వంటి వివరాలతోపాటు మీ డాక్యుమెంట్లను పరిశీలిస్తుంది. వాటన్నింటికీ సంతృప్తి చెందితే, మీకు ఎంత రుణం వస్తుంది? నియమ నిబంధనలు ఏమిటో తెలియజేస్తారు. అప్పపుడు రుణానికి అవసరమైన ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత రుణదాత మీ రుణాన్ని ఏకమొత్తం లేదా వాయిదాల్లో విడుదల చేస్తారు.
రుణ మంజూరు సమయంలో అద్దె ఆదాయం, ఖర్చులను రుణదాత పరిశీలిస్తారు. అందువల్ల వీటికి సంబంధించిన కచ్చితమైన వివరాలను దగ్గర ఉంచుకోవాలి.
రుణం పొందే విషయంలో పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థల ఆఫర్లను బేరీజు వేసుకోవాలి. తక్కువ వడ్డీ రేటు, అనుకూలమైన నియమ నిబంధనలు ఎక్కడు ఉన్నాయో పరిశీలించుకోవాలి.
వడ్డీ రేట్లు, కాలవ్యవధి, ముందుగా చెల్లిస్తే పడే జరిమానాలు, ముందుగానే రుణం ముగించుకునే అవకాశాలు సహా రుణ ఒప్పందంలోని అన్ని అంశాలను కచ్చితంగా చదివి అర్థం చేసుకోవాలి.
రుణ చెల్లింపు నిలిచిపోకుండా కచ్చితమైన రీపేమెంట్ ప్లాన్ ఉండాలి. లేకుంటే మీ క్రెడిట్ స్కోర్ ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
This website uses cookies.