Categories: LATEST UPDATES

Godrej Properties టాప్ గేర్ లో గోద్రేజ్ ప్రాపర్టీస్

రూ.26వేల కోట్ల ప్రాజెక్టుల నిర్మాణానికి 14 చోట్ల భూముల కొనుగోలు

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ గోద్రేజ్ ప్రాపర్టీస్ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.26వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల నిర్మాణం కోసం వివిధ నగరాల్ 14 చోట్ల భూములు కొనుగోలు చేసింది. ముంబైతోపాటు పుణె, ఢిల్లీ, బెంగళూరు, కోల్ కతా, అహ్మదాబాద్, ఇండోర్ లలో ఈ భూములు సేకరించింది. దేశంలో తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించడానికి భూమిని సేకరించడం కొనసాగిస్తామని సంస్థ చైర్ పర్సన్ పిరోజ్ షా గోద్రేజ్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.20వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు నిర్మించాలని నిర్దేశించుకోగా.. రూ.26,500 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించామని వివరించారు.

ఈ ఏడాది కూడా రూ.20వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. దీనిని కూడా అధిగమించే అవకాశం ఉందని చెప్పారు. గోద్రేజ్ ప్రాపర్టీస్ దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్లలో ఒకటి. ఇది ప్రధానంగా ఢిల్లీ, ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం, పూణే, బెంగళూరు, హైదరాబాద్‌లలో గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. ప్లాట్ డెవలప్‌మెంట్ కోసం కొన్ని చిన్న నగరాల్లో కూడా అడుగు పెట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా గురుగ్రామ్‌లో 3 చోట్ల, గ్రేటర్ నోయిడా, ముంబై, బెంగళూరు, ఇండోర్‌లలో రెండేసి చోట్ల స్థలాలు కొనుగోలు చేసింది. పూణే, అహ్మదాబాద్, కోల్‌కతాలో ఒక్కో చోట భూమిని కొనుగోలు చేసింది.

ఢిల్లీలో గోద్రేజ్ ప్రాపర్టీస్ జోరు కొనసాగిస్తోంది. అక్కడ గురుగ్రామ్, గ్రేటర్ నోయిడాల్లో ఐదు చోట్ల స్థలాలు కొనుగోలు చేసింది. దీని ద్వారా దాదాపు రూ.14వేల కోట్ల ఆదాయం వస్తుంది. కాగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో గోద్రేజ్ ప్రాపర్టీస్ అమ్మకాల బుకింగ్‌లు 31 శాతం పెరిగి రికార్డు స్థాయిలో రూ.29,444 కోట్లకు చేరుకున్నాయి. అంతకుముందు సంవత్సరం ఇది రూ.22,527 కోట్లు. సంస్థ నికర లాభం 2024-25లో 93 శాతం పెరిగి రూ.1,399.89 కోట్లకు చేరుకోగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.725.27 కోట్లుగా అది ఉంది.

This website uses cookies.