Categories: LATEST UPDATES

ఇందులో ఉండాలంటే రూ.43 కోట్లు కావాలి

ప్రపంచంలోనే ఎవరికీ అందనంత ఎత్తులో నివసించాలని అనుకుంటున్నారా? అయితే, బ్రెజిల్ లోని Senna Tower సెన్నా టవర్లో ఓ ఫ్లాట్ కొనుక్కుంటే సరిపోతుంది. ఎందుకంటే, ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రెసిడెన్షియల్ టవర్. 1670 అడుగుల పొడవుతో ఈ టవర్ నిర్మాణం జరగనుంది. అత్యంత ఎత్తైన రెసిడెన్షియల్ టవర్లలో ఇప్పటివరకు న్యూయార్క్ సిటీ లోని Central Park Tower సెంట్రల్ పార్క్ టవర్ తొలి స్థానంలో ఉండేది. దీని ఎత్తు 1550 అడుగులు. బ్రెజిల్ లోని సెన్నా టవర్ నిర్మాణం పూర్తయితే అది ప్రపంచంలోనే ఎత్తైన రెసిడెన్షియల్ టవర్ గా నిలిచిపోతుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా టవర్. ఇది 2717 అడుగుల పొడవు ఉంటుంది.

దీనిని అటు వాణిజ్య కార్యకలాపాలు, ఇటు రెసిడెన్షియల్ అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అత్యంత ఎత్తైన రెసిడెన్షియల్ భవనం సెన్నా టవర్సే కానుంది. ఫార్ములా వన్ రేసింగ్ దిగ్గజం అయర్టన్ సెన్నా జీవితం ప్రేరణగా ఈ టవర్ ను ఆయన మేనకోడలు లాలల్లి సెన్నా డిజైన్ చేశారు. మూడుసార్లు ప్రపంచ రేసింగ్ ఛాంపియన్ అయిన సెన్నా, 1994 శాన్ మారినో గ్రాండ్ ప్రిక్స్ సమయంలో 34 ఏళ్ల వయసులో విషాదకరంగా మరణించారు. ఈ నేపథ్యంలో ఆయనకు గుర్తుగా ఈ టవర్ రూపకల్పన చేశారు. 154 అంతస్తులు ఉండే ఈ టవర్ లో టాప్ ఫ్లోర్ లో రెండు ట్రిప్లెక్స్ పెంట్ హౌస్ లు నిర్మిస్తారు.

9700 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటే ఈ పెంట్ హౌస్ కనీస ధర 53 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.453 కోట్లు) ఉంటుంది. వీటిని బ్రిటన్ కు చెందిన వేలం సంస్థ సోథెబీస్ విక్రయిస్తుంది. ఈ టవర్లో మొత్తం 228 యూనిట్లు ఉంటాయి. ఇందులో 204 అపార్ట్ మెంట్లు కాగా, 18 సస్పెండెడ్ మేన్షన్స్ ఉంటాయి. అయితే, ఇందులో ఏదీ కూడా చౌకగా రాదు. ఈ టవర్లోని చిన్న ఫ్లాట్ కొనాలన్నా 5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.43 కోట్లు) వెచ్చించాల్సిందే. ఈ ప్రాజెక్టును 525 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.4,514 కోట్లు) వ్యయంతో సెన్నా కుటుంబం, బ్రెజిలియన్ రిటైలర్ హవాన్ సహకారంతో నిర్మాణ సంస్థ ఎఫ్ జీ ఎంప్రెండిమెంటోస్ నిర్మిస్తోంది. 2033 నాటికి దీని నిర్మాణం పూర్తవుతుంది.

This website uses cookies.