Categories: LATEST UPDATES

ఆఫీస్‌ స్పేస్‌లో మనోళ్ల దూకుడు

47 శాతానికి చేరిన దేశీయ కంపెనీల వాటా

సీబీఆర్ఈ నివేదిక వెల్లడి

ఆఫీస్ స్పేస్ వినియోగంలో మనోళ్లు దూకుడుగా వెళ్తున్నారు. ఈ విషయంలో మన దేశ కంపెనీల వాటా బాగా పెరిగింది. 2022కు ముందు దేశంలోని 9 ప్రధాన నగరాల్లో మొత్తం ఆఫీస్‌ వసతుల్లో దేశీయ కంపెనీల వాటా మూడింట ఒక వంతు ఉండగా.. ప్రస్తుతం అది 47 శాతానికి చేరుకుంది. 2022 నుంచి 2024 మొదటి ఆరునెలల్లో జరిగిన 154 మిలియన్‌ చదరపు అడుగుల లీజు లావాదేవీల్లో దేశీయ కంపెనీల 72 మిలియన్‌ చదరపు అడుగులకు (47 శాతం) చేరిందని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ సీబీఆర్‌ఈ పేర్కొంది. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, పుణె, ముంబై, ఢిల్లీ ఎన్‌సీఆర్‌, కోల్‌కతా, కోచి, అహ్మదాబాద్‌కు సంబంధించి గణాంకాలను ఈ నివేదికలో వెల్లడించింది.

వృద్ధి, వ్యాపార కార్యకలాపాల విస్తరణ పట్ల దేశీయ కంపెనీల అంకిత భావాన్ని ఈ గణంకాలు తెలియజేస్తున్నాయని.. రానున్న సంవత్సరాల్లో ఆఫీస్‌ వసతుల్లో దేశీయ కంపెనీల వాటా మరింత పెరుగుతుందని సీబీఆర్‌ఈ ఇండియా చైర్మన్‌, సీఈవో అన్షుమన్‌ మ్యాగజిన్‌ పేర్కొన్నారు. వ్యాపారంలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా అధిక నాణ్యత, సౌకర్యవంతమైన పని వాతావరణానికి భారత కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయని వివరించారు. టాప్‌-9 నగరాల్లో 2026 నాటికి అదనంగా 189 మిలియన్‌ చదరపు అడుగుల ప్రీమియం ఆఫీస్‌ వసతి అందుబాటులోకి వస్తుందని ఆయన వెల్లడించారు.

This website uses cookies.