రియాల్టీలో జోరుగా ప్రచారం..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇళ్ల అనుమతుల్ని తెచ్చుకోవాలంటే.. ప్రత్యక్ష నరకం కనిపిస్తోందని నగరానికి చెందిన పలువురు బిల్డర్లు వాపోతున్నారు. అందుకే, కొత్త ప్రాజెక్టుల్ని హైదరాబాద్‌లో ఆరంభించట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు డెవలపర్లు ముంబై, చెన్నై, బెంగళూరు వంటి మెట్రో నగరాలకు తరలి వెళ్లిపోతున్నారు.
ఇక్కడ మార్కెట్ మెరుగ్గా లేకపోవడం.. భవిష్యత్తులో అభివృద్ధి చెందుతుందనే నమ్మకం సన్నగిల్లడం వంటివి ప్రధాన కారణాలుగా విశ్లేషించొచ్చు. అంతేకాకుండా, కోట్ల రూపాయల్ని ముట్టచెబితేనే అనుమతులు మంజూరు చేస్తున్నారనే ఊహాగానాలు నిర్మాణ రంగంలో ఊపందుకున్నాయి. ఈ దెబ్బతో అధిక శాతం బిల్డర్లు పొరుగు రాష్ట్రాల్లోకి అడుగుపెట్టాలని కంకణం కట్టుకున్నారు.
2023 వరకూ దేశవ్యాప్తంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి చర్చలు జరిగేవి. దేదీప్యమానంగా వెలిగిపోతున్న మన మార్కెట్ ను చూసి దేశంలోని డెవలపర్లంతా ఆశ్చర్యపోయేవారు. అందుకే, ఇతర మెట్రో నగరాలకు చెందిన నిర్మాణ సంస్థలు హైదరాబాద్లోకి అడుగు పెట్టడానికి తహతహలాడేవి. మంచి స్థలాన్ని ఎంచుకుని కొత్త ప్రాజెక్టుల్ని ఆరంభించేవి.
కానీ, ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పట్నుంచి నగర రియాల్టీలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆరంభం నుంచి ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల రియల్ రంగం కోలుకోకుండా చతికిలపడిందని రియల్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోకాపేట్‌ను కాదని మహేశ్వరాన్ని న్యూయార్క్ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన పట్ల కూడా రియాల్టీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.
గత మూడు నాలుగేళ్లలో హైదరాబాద్‌లో అధిక ఆకాశహర్మ్యాలు ఆరంభమయ్యాయి. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనుమతి కోసం అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అనుమతి రావాలంటే ముందుగా ప్రభుత్వంలోని పెద్దలకు కొంత దక్షిణ ముట్టచెప్పాలని రియాల్టీ వర్గాలు చెప్పుకుంటున్నారు. ఆతర్వాతే జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలో దరఖాస్తు చేసుకోవాలట. అయితే, పైన ఆమ్యామ్యాలు అప్పచెప్పినా.. కిందికొచ్చే సరికి ఏదో వంక చూపెట్టి అధికారులు, సిబ్బంది ఫైలును ముందుకు కదలనివ్వడం లేదని సమాచారం.
అది లేదు.. ఇది లేదంటూ.. ఫైళ్లను తిరస్కరిస్తున్నారట. అంటే, పైనే కాదు.. కింద కూడా ఎంతో కొంత ముట్టచెబితేనే అనుమతినిస్తామనే రీతిలో.. ప్రవర్తిస్తున్నారని తెలిసింది. ఈ దెబ్బకు తట్టుకోలేక.. కొందరు డెవలపర్లు నగరాన్ని వదిలేసి.. ఇతర సిటీల్లోకి అడుగు పెడుతున్నారని సమాచారం. ఇప్పటికే కొందరు బిల్డర్లు ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో స్థలాల్ని కూడా తీసుకున్నారని తెలిసింది.
కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతుల్ని త్వరగా మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏకు ఆదేశాలు జారీ చేయాలి. గతంలో మంత్రి కేటీఆర్ పలు సభలు, సమావేశాల్లో.. అనుమతుల గురించి స్పష్టమైన విధానాన్ని ప్రకటించేవారు. అధికారుల వల్ల అనుమతి ఆలస్యమైతే.. వారి మీద జరిమానా కూడా విధిస్తామని ప్రకటించేవారు. అలా బహిరంగంగా మంత్రి కేటీఆర్ మాట్లాడటం వల్ల బిల్డర్లకు అనుమతులు సులువుగా లభించేవి. ఇప్పుడేమో పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. అనుమతుల విషయంలో ఇలాగే వ్యవహరిస్తే..
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు దేశవిదేశీ సంస్థలు ముందుకు రావనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాలని రియల్టర్లు అంటున్నారు. పైగా, పురపాలక శాఖకు ప్రత్యేకంగా మంత్రి లేకపోవడం.. సీఎం వద్ద ఈ శాఖ ఉండటంతో.. నిర్మాణ రంగంపై ప్రత్యేక దృష్టి సారించడానికి సీఎంకు వీలు కలగడం లేదని పలువురు బిల్డర్లు భావిస్తున్నారు. అందుకే, పురపాలక శాఖకు ప్రత్యేకంగా ఒక మంత్రిని కేటాయిస్తే.. ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభించినట్లు అవుతుందని అనుకుంటున్నారు. ఏదీఏమైనా, ప్రతికూల పరిస్థితుల నుంచి హైదరాబాద్ నిర్మాణ రంగం త్వరగా కోలుకోవాలని డెవలపర్లు కోరుకుంటున్నారు.
This website uses cookies.