Categories: TOP STORIES

వీకెండ్ హోమ్స్‌కు ఆద‌ర‌ణ‌

నగరానికి 50ల కిలోమీటర్ల పరిధిలో వీకెండ్ హోమ్స్

వీకెండ్స్‌లో ప్రకృతి మధ్యలో గడిపేలా ప్ర‌ణాళిక‌లు

200 గజాల నుంచి ఎకరం విస్తీర్ణంలో నిర్మాణం

ట్రిపుల్ ఆర్ స‌మీపంలో వీటికి డిమాండ్

హైదరాబాద్ అంటేనే బిజీ లైఫ్. అందులో ఐటీ ఉద్యోగుల నుంచి మొదలు వ్యాపార తదితర రంగాల వారు నగర జీవితంతో విసిగిపోతున్నారు. వృత్తి, ఉద్యోగరీత్యా కాంక్రీట్‌ జంగిల్‌ లాంటి నగరంలో ఉంటున్నవారు.. వారాంతంలో కుటుంబంతో సరదాగా గడపాలని కోరుకుంటున్నారు. సొంతూర్లలో ఇళ్లు, పొలాలు ఉన్నవారు అప్పుడప్పుడు అక్కడికి వెళ్లి వస్తుంటే, అలా లేనివారు హైదరాబాద్ కు దగ్గరలో ఫామ్‌ ల్యాండ్స్‌, రిసార్ట్స్‌, వీకెండ్‌హోమ్స్‌ వెంచర్లలో స్థలాలు కొని ఇళ్లు కట్టుకుని ఉండేందుకు ఇష్టపడుతున్నారు.

హైదరాబాద్ పరిసరాల్లో ఫామ్‌ ల్యాండ్‌ ప్రాజెక్ట్‌లు చాలా కాలంగా ఉన్నాయి. ఫామ్‌ హౌస్‌ కట్టుకోవాలన్న ఉద్దేశ్యంతో ఇలాంటి ప్రాజెక్టుల్లో చాలా మంది కొంటున్నా, అవి నివాసయోగ్యంగా ఉండటం లేదు. ఇలా ఫామ్ హౌజ్ కోసం స్థలాలు కొన్నవారు అప్పుడప్పుడు వెళ్లి చూసుకుని రావడం తప్ప పెద్దగా ఉపయోగించుకోవడం లేదు. మరి కొంతమంది ఫామ్ హౌజ్ స్థలాల్లో పూలు, పండ్ల మొక్కలను పెంచుతున్నారు. కొన్నిచోట్ల సామూహిక వ్యవసాయం చేపట్టి వచ్చిన ఫలాలను యాజమానులకు పంచుతున్నారు.

వీకెండ్ హోమ్స్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిర్మాణ సంస్థలు డిజైన్‌ చేయిస్తున్నాయి. కొనుగోలుదారుల్ని ఆకట్టుకోవడానికి పల్లెల్లో పాత రోజుల్లో ఉండే మండువ ఇళ్లు, కేరళలో మాదిరి ఇళ్లను నిర్మిస్తున్నారు. మరికొన్ని రియాల్టీ కంపెనీలు వుడెన్ హౌజెస్ ను నిర్మిస్తున్నాయి.

సిటీలో అపార్ట్‌మెంట్లలో నాలుగు గోడల మధ్య ఫ్లాట్‌ల‌లో ఉంటున్నవారిని ఈ తరహా ఇళ్లు బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక విస్తీర్ణం వరకు వస్తే కనీసం రెండు వందల గజాల నుంచి మొదవు వెయ్యి గజాలు, పావు, అర్ధ, ఎకరం విస్తీర్ణంలో వీకెండ్‌ హోమ్స్‌ ను డిజైన్ చేస్తున్నారు. చాలా వీకెండ్ హోమ్ ప్రాజెక్టుల్లో వంద నుంచి రెండు వందల గజాల విస్తీర్ణం వరకే ఇంటిని పరిమితం చేసి.. మిగతా స్థలంలో పచ్చదనానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మన సంస్కృతిని ప్రతిబింబించేలా కొన్నిచోట్ల వీకెండ్ హోమ్స్ కడుతుంటే.. మరికొన్నిచోట్ల విదేశాల్లో మాదిరి వీకెండ్‌ హోమ్స్‌ను నిర్మిస్తున్నారు. వీకెండ్ లో ఇంటికి వచ్చిన వారికి సకల సౌకర్యాలు కమ్యూనిటీలో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్కులతో పాటు స్విమ్మింగ్ ఫూల్, క్లబ్‌ హౌస్‌, ఇండోర్‌, అవుట్‌ డోర్‌ స్పోర్ట్స్ ఏరియా, రెస్టారెంట్‌, కామన్‌ కిచెన్‌ వంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. మరికొన్ని ప్రాజెక్టుల్లో అక్కడే పెళ్లి వేడుకలు, పార్టీలు చేసుకునే విధంగా కన్వెన్షన్స్ సైతం కడుతున్నారు. ఇక ప్రాంతం, ప్రాజెక్టు, విస్తీర్ణాన్ని బట్టి 30 లక్షల నుంచి మొదలు 8 కోట్ల రూపాయల వరకు వీకెండ్ హోమ్ ధరలున్నాయి.

This website uses cookies.