హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగంలోనే కాదు ఇంజినీరింగ్ విభాగంలోనూ భారీ అవినీతి చోటు చేసుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో చేపట్టిన పలు నిర్మాణాలు, పార్కుల అభివృద్ధి, కొత్త పార్కుల నిర్మాణంలోనూ ఇంజనీరింగ్ అధికారులు భారీగా అవినీతికి పాల్పడ్డారని తెలుస్తోంది. అయితే హెచ్‌ఎండిఏలోని ఇంజనీరింగ్, ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటేషన్‌తో పాటు రిటైర్డ్ అధికారులు ఎక్కువ మంది ఇంత కాలం పని చేశారు. అయితే వారు అందినకాడికి దండుకున్నట్టుగా తెలిసింది. దీంతో ఇంజనీరింగ్ విభాగంలో చోటు చేసుకున్న అవినీతిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించినట్టుగా సమాచారం. ఇక ప్లానింగ్ విభాగంలోని కొందరు అధికారులైతే.. లేఅవుట్లలో ప్లాట్లు.. అపార్టుమెంట్లలో ఫ్లాట్లను ముడుపులుగా స్వీకరించారని సమాచారం.
గత ఐదేళ్లలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఎన్ని అనుమతుల్ని మంజూరు చేసింది? అందులో ఎవరెవరికి ఫ్లాట్లు ఉన్నాయనే విషయాన్ని ఆరా తీస్తే.. అక్రమంగా ఫ్లాట్లను సొంతం చేసుకున్న అధికారుల చిట్టా మొత్తం బయటికొస్తుంది. ఇక్కడ ఉద్యోగులు ఏం చేశారంటే.. వారి పేరు మీద కాకుండా.. బంధుమిత్రులు, ఏజెంట్లు, వారి బంధువుల పేరిట వాటిని రిజిస్టర్ చేసినట్లు సమాచారం. మరి, ప్రభుత్వం హెచ్ఎండీఏ అవినీతిని ప్రక్షాళన చేయాలంటే లోతుగా దర్యాప్తు చేస్తేనే సాధ్యమవుతుంది. అయితే, ఏసీబీ అధికారుల వద్ద అవినీతి హెచ్ఎండీఏ అధికారుల పూర్తి చిట్టా ఉన్నట్లు సమాచారం.
This website uses cookies.