వర్షాకాలంలో ఇసుక కొరత తలెత్తకుండా చూసేందుకు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా 7.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను నిల్వ చేసి ఉంచింది. వర్షాకాలంలో ఇసుక దొరకపోవడం బిల్డర్లకు పెద్ద సమస్యగా మారుతుంది. గతేడాది ఆగస్టులో వచ్చిన వరదలల కారణంగా చెవిటికట్లు ఇసుక రీచ్ లో 132 ట్రక్కులు, ఓ క్రేన్ కొట్టుకుపోయాయి. ఫలితంగా ఆ ఇసుక రీచ్ దాదాపు మూడు నెలలపాటు మూసివేయాల్సి వచ్చింది. దీంతో బ్లాక్ మార్కెటింగ్ మాఫియా రెచ్చిపోయింది. క్యూబిక్ మీటర్ ఇసుకను ఏకంగా రూ.1200కి విక్రయించింది.
దీంతో చాలామంది బిల్డర్లు పనులు నిలిపివేయడంతో దాదాపు 25వేల మంది కార్మికులకు పనిలేకుండా పోయింది. ప్రస్తుతం మళ్లీ వరదలు రావడంతో మళ్లీ బ్లాక్ మార్కెటింగ్ మాఫియా విజృంభించకుండా అధికారులు చర్యలు చేపట్టారు. పలు చోట్ల ఇసుక స్టాక్ పాయింట్లు తెరిచారు. అంతేకాకుండా మైనింగ్ విభాగం ఇసుక సరఫరాను జేపీ మైనింగ్ కంపెనీతో కలిసి పర్యవేక్షిస్తోంది.
జిల్లాలో ఇసుక కొరత లేదని.. భారీ పరిమాణంలో దానిని నిల్వ చేశామని, ప్రభుత్వమే ఇసుక ధర నిర్ణయించి విక్రయిస్తున్నందున ఆందోళన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. కృత్రిమంగా ఇసుక కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
This website uses cookies.