బెంగళూరులో కొందరు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, ఛానల్ పార్ట్‌నర్లు, చిన్నచితకా రియల్టర్లు బిల్డర్లుగా అవతరించారు. అధిక రేషియోకి భూముల్ని తీసుకుని.. తక్కువ రేటుకే ఫ్లాట్లంటూ అమ్మకాల్ని ఆరంభించారు. కొంతకాలం వరకూ అంతా మెరుగ్గానే ఉన్నట్లు అనిపించింది. తర్వాత సిసలైన సమస్యలు ఆరంభమయ్యాయి. ఒకవైపు కొనుగోలుదారుల నుంచి ఒత్తిడి.. మరోవైపు బ్యాంకుల ప్రెషర్.. మార్కెట్లో అమ్మకాలు జరగని పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో, ఈ చిన్నాచితకా బిల్డర్లంతా కలిసి.. బడా బిల్డర్లకు తమ ఆవేదన చెప్పుకున్నారు. ఫలితంగా బడా సంస్థలు.. చిన్నాచితకా ప్రాజెక్టుల్ని టేకోవర్ చేస్తున్నాయి. ఈ పోకడ హైదరాబాద్‌లోనూ ఆరంభమైందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ప్రీలాంచ్, యూడీఎస్ సేల్స్‌లో ఫ్లాట్లను విక్రయించిన కొత్త బిల్డర్లు సరికొత్త ప్రణాళికల్ని రచిస్తున్నారు. ఇంతవరకూ జరిగిన ప్రీలాంచ్ అమ్మకాలు, యూడీఎస్ సేల్స్ సొమ్మును తీసేసుకుని.. ఆయా ప్రాజెక్టులను బడా సంస్థలకు అప్పగిస్తున్నారు. అంటే ఆయా ప్రాజెక్టులను బడా సంస్థలు టేకోవర్ చేస్తున్నాయన్నమాట.
దీని వల్ల అంతిమంగా కొనుగోలుదారులకు ప్రయోజనం కలుగుతుందే తప్ప నష్టమేం ఉండదు. కాకపోతే, ప్రతి విషయం పక్కాగా ఉంటేనే బడా సంస్థలు టేకోవర్‌కు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే ప్రీలాంచ్ చేసిన పలు సంస్థలు.. ఈ రకమైన ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు పలు పెద్ద కంపెనీలను సంప్రదిస్తున్నాయి. మొత్తానికి, రానున్న రోజుల్లో టేకోవర్ ట్రెండ్ హైదరాబాద్ రంగంలోనూ ఎక్కువగా కనిపించే అవకాశముంది.
This website uses cookies.