Categories: TOP STORIES

సొంతింటికి.. పెట్టుబడికి.. మెరుగైంది మేడ్చల్

నిన్నటివరకూ మేడ్చల్ ఓ చిన్న పట్టణం.. రహదారికి ఇరువైపులా దాబాలు.. ఫాం హౌసులు.. పరిశ్రమలు.. ఇంతకుమించి ఏమీ ఉండేది కాదు. కానీ, ఇప్పుడు మీ అభిప్రాయం మార్చుకోవాల్సిందే. ఓఆర్ఆర్ రాకతో ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోయాయి. ఇక్కడ్నుంచి ఇరవై నిమిషాల్లో ట్రిపుల్ ఆర్ కూడా చేరుకోవచ్చు. పారిశ్రామికంగా.. సాంకేతికంగా.. రియల్ రంగం పరంగా గణనీయంగా అభివృద్ధి చెందింది.ఇటీవ‌ల కాలంలో జిల్లా క‌లెక్ట‌రేట్ కార్యాల‌యం కూడా ప్ర‌త్యేకంగా ఏర్పాటు కావ‌డంతో ప్ర‌జ‌ల‌కు ప‌రిపాల‌న మ‌రింత చేరువైంది.

  • రాత్రికి రాత్రే ధరలు పెరగవు
  • మౌలిక సదుపాయాలు మెరుగు
  • ఓఆర్ఆర్ రాకతో కొత్త కళ
  • కొంచెం దూరం వెళితే ట్రిపుల్ ఆర్
  • విద్యాలయాలు, ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు
మేడ్చల్
దాదాపు ముప్పయ్యేళ్ల నుంచి ఇదో పారిశ్రామిక ప్రాంతం. నాలుగు వందల దాకా పరిశ్రమలూ ఉన్నాయి. విత్తన సంస్థలూ భారీగానే ఉన్నాయి. నాగపూర్ వెళ్లే జాతీయ రహదారి కావడం.. కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గం కావడంతో అధిక శాతం మంది మేడ్చల్ లో స్థిరపడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో, స్థలాల్ని విక్రయించే వెంచర్లు, వ్యక్తిగత ఇళ్లను నిర్మించే కంపెనీలు పెరిగిపోయాయి.
మేడ్చల్ ప్రధాన ఆకర్షణ ఏమిటంటే.. ఇక్కడ ఔఆర్ఆర్ ఎక్కితే గచ్చిబౌలి అయినా శంషాబాద్ విమానాశ్రం అయినా సులువుగా చేరుకోవచ్చు. అటు వరంగల్ కానీ విజయవాడ, బెంగళూరు, ముంబై.. ఇలా ఓఆర్ఆర్ మీదుగా ఎటైనా సులభంగా వెళ్లవచ్చు. మేడ్చల్ బస్ డిపో ఉండటం వల్ల రాకపోకలకు సమస్యే ఉండదు. పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రులు, బ్యాంకులు వంటివి ఉండనే ఉన్నాయి. కంట్రీ క్లబ్, ధోలా-రి-ధని, రన్ వే 9 వంటి రిసార్టులున్నాయి.
అపార్టుమెంట్లు, రో హౌసెస్, డ్యూప్లేలు, విల్లాలు వంటివి ఇక్కడ నిర్మించే సంస్థలకు కొదవే లేదు. అపర్ణా వంటి సంస్థ మేడ్చల్ సమీపంలోనే బడా గేటెడ్ కమ్యూనిటీల్ని నిర్మించింది. నిబంధనల ప్రకారం ఇక్కడ ఆకాశహర్మ్యాల్ని కూడా నిర్మించుకోవచ్చు. కాకపోతే, పలు సంస్థలు విల్లాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. మేడ్చల్ రహదారికి ఇరువైపులా కొన్ని కంపెనీలు వెంచర్లను డెవలప్ చేస్తున్నాయి. ఇటీవల ఇక్కడ ప్లాట్లు, ఫ్లాట్ల ధరలూ గణనీయంగా పెరిగాయి. స్థలాల లభ్యత ఎక్కువ. ఖాళీ స్థలాలెక్కువ. ప్రభుత్వ స్థలాలూ ఇక్కడే ఉన్నాయి. హైవే చేరువలో ప్లాటు కనీస ధర గజానికి రూ.20 నుంచి 35 వేల దాకా ఉంటాయి. ఫామ్ హౌజు, రిసార్టులు, గెస్ట్ హౌజులు ఎక్కువగా ఉన్నాయి. పూడురులో గజం రూ.30 నుంచి 40 వేల దాకా ఉంటుంది. ఇక్కడే లియోనియా వంటి రిసార్టులూ ఉన్నాయి.
మేడ్చల్ నుంచి
సికింద్రాబాద్ : 23 కిలోమీటర్లు
శామీర్ పేట్: 15 కిలోమీటర్లు
కొంపల్లి: 8 కిలోమీటర్లు

This website uses cookies.