‘‘వరంగల్‌లో హైదరాబాద్ కు వచ్చే రైల్ ఎక్కి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దిగు. బయటికొచ్చి 49వ నంబరు బస్ ఎక్కి, ప్యారడైజ్ సర్కిల్ దగ్గర దిగు! ఆ పక్క గల్లీలోనే మా ఇల్లు’’ ఇదీ రమణారావుకు శ్రీనివాస్ సమాధానం.
కానీ, శ్రీనివాస్ తర్వాతి జనరేషన్ మాత్రం ఇదే అడ్రస్‌ను మార్చి చెబుతోంది!
‘‘ఉప్పల్ రింగ్ రోడ్డులో మెట్రో స్టేషన్ ఎక్కి.. ప్యారడైజ్ స్టేషన్లో దిగు! అంతే.. ఆ పక్కన లైనులోనే మా ఫ్లాట్’’
.. అవును హైదరాబాద్‌లో ఇప్పుడు ల్యాండ్‌మార్క్స్ మారిపోయాయి. పాత అడ్డాల పేర్లు చెబితే నేటి యువతరం గుర్తించే స్థితిలో కూడా లేదు. అంతలా అభివృద్ధి చెందింది భాగ్యనగరం! కొత్తగా ఏర్పడిన ల్యాండ్‌మార్క్స్ ఆధారంగానే గూగుల్ లొకేషన్స్ చూపిస్తుందంటే హైదరాబాద్‌లో అడ్డాలు ఎంతలా మారిపోయాయో అర్థం చేసుకోవచ్చు!
భాగ్యనగరంలో కొత్త ల్యాండ్‌మార్క్స్ ఏర్పడటానికి ప్రధానంగా రెండు కారణాలు. 1. మెట్రో రైల్ 2. రియల్ ఎస్టేట్ అభివృద్ధి. గతంలో శివారు ప్రాంతాల్లో ఊరి పేర్లు కూడా సరిగా గుర్తుండేవి కావు. కానీ, ఇప్పుడు ఆయా ప్రాంతాల పేర్లు బాగా ప్రసిద్ధి చెందాయి. ఉదాహరణకు సిటీ నుంచి 50 కి.మీ. దూరంలో ఉన్న శామీర్‌పేట్. ఈ ప్రాంతం లియోనియా రిసార్ట్, సెలబ్రిటీ క్లబ్, అలంకృత రిసార్ట్, జీనోమ్ వ్యాలీ, నల్సార్, బిట్స్ పిలానీలతో పేరొందింది. రావిర్యాల ప్రాంతం వండర్‌లా, డైనోసార్ పార్క్‌తో ఫేమస్ అయింది. ఇక, ఇబ్రహీపట్నం మండలంలోని ఆదిభట్ల ప్రాంతం ఏరో స్పేస్ కంపెనీలకు ల్యాండ్‌మార్క్‌గా మారింది. ఇక్కడ టాటా అడ్వాన్డ్స్ సిస్టమ్స్ (టీఏఎస్‌ఎల్), స్కిరోస్కీ, లాక్‌హీడ్ మార్టీన్, టాటా బోయింగ్ వంటి ఏరోస్పేస్ కంపెనీల ఏర్పాటుతో ఇక్కడి స్థానికులు ఈ కంపెనీల పేర్లతోనే అడ్రస్‌లు చెబుతుండటం గమనార్హం.
నగరానికి చెందిన కొన్మి నిర్మాణ సంస్థలు వినూత్న ఆకారంలో భవనాలను నిర్మిస్తూ.. వాటినే ల్యాండ్‌మార్క్ లాగా క్రియేట్ చేస్తున్నారు. ఉదాహరణకు టీఎస్‌పీఏ (అప్పా జంక్షన్) దగ్గర్లోని బండ్లగూడ జాగీర్‌లో గిరిధారి హోమ్స్ ‘అవిఘ్న ప్రాజెక్ట్‌ను నిర్మించింది. దీని ప్రత్యేకత ఏంటంటే? బిల్డింగ్ డిజైన్ పడవ ఆకారంలో ఉంటుంది. షిప్ ఎలివేషన్ ను ఏర్పాటు చేసి.. దాని మీద స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌజ్ వసతులను కల్పించింది. కిస్మత్‌పూర్ ప్రజలు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌నే ల్యాండ్‌మార్క్‌గా చెబుతున్నారంటే అతిశయోక్తి కాదు.
– మెహదీపట్నంలోని పీవీఆర్ ఎక్స్‌ప్రెస్ వేలోని నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్ఎఫ్‌డీబీ) భవనం ఓ ల్యాండ్‌మార్క్‌లా నిలిచింది. దీని ప్రత్యేకత ఏంటంటే.. చేప ఆకారంలో దీని నిర్మాణం ఉండటమే. 2012లో చేప ఆకారంలో కేంద్ర మత్య్స శాఖ కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. 1920 చదరపు మీటర్ల ఈ భవనంలో 3 అంతస్తులుంటాయి.
శివారు ప్రాంతాల్లో రిసార్ట్స్, ప్రభుత్వ, ప్రై వేట్ కంపెనీల ఏర్పాటుతో ల్యాండ్‌మార్క్స్ ఏర్పడితే.. హైదరాబాద్ ప్రధాన నగరంలో మాత్రం వినూత్న భవన డిజైన్స్ ల్యాండ్‌మార్క్‌గా మారిపోయాయి. ఉదాహరణకు కొండాపూర్ కొత్తగూడ క్రాస్ రోడ్‌లో శరత్ సిటీ క్యాపిటల్ మాల్, కేపీహెచ్‌బీ 6 ఫేజ్, మలేషియన్ టౌన్ షిప్‌లో ఫోరం సుజనా మాల్, జేఎన్టీయూలో మంజీరా మాల్, కొంపల్లిలో సినీ ప్లానెట్, నల్లగండ్లలో సిటిజెన్ ఆసుపత్రి, నానక్‌రాంగూడలో క్యూ సిటీ, విప్రో సర్కిల్, రాయదుర్గంలో బయోడైవర్సిటీ పార్క్, ఐకియా స్టోర్.. ఇలా సరికొత్త ల్యాండ్‌మార్క్‌లు ఏర్పడ్డాయి. నేటి యువతకు, నగరవాసులకు ఈ పేర్లతోనే అడ్రస్‌లు చెబుతుండటం గమనార్హం.
నగరంలోని కొన్ని ప్రాంతాలు ఐటీ, మీడియా కంపెనీల ఏర్పాటుతో ల్యాండ్‌మార్క్‌గా మారాయి. ఉదాహరణకు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1లో సాక్షి బిల్డింగ్, రోడ్ 3లో టీవీ 9 ఆఫీస్, హైటెక్ సిటీలో డీఎల్‌ఎఫ్ సైబర్ సిటి, మాదాపూర్‌లో రహేజా ఐటీ పార్క్, కొండాపూర్‌లో గూగుల్ ఆఫీస్, పోచారంలో ఇన్ఫోసిస్, హబ్సిగూడలో జెన్ ప్యాక్ట్, రామాంతాపూర్‌లో ఎఎన్ఎస్‌ఎల్ బిల్డింగ్‌లు ఏర్పడ్డాయి. దీంతో ఆయా కార్యాలయాల అడ్రస్‌లతోనే కొత్తగా ల్యాండ్‌మార్క్‌లు మారిపోయాయి.
హైదరాబాద్ మెట్రో రైల్ పరుగులు పెట్టడం ప్రారంభమయ్యాక.. కొత్త పేర్లు పుట్టుకొచ్చాయి. అప్పటివరకు స్థానికంగా ఫేమస్ అయిన పేర్లతో పిలిచిన ప్రాంతాలను ఇప్పుడు మెట్రో స్టేషన్స్సుపరిచితమయ్యాయి. వీటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, మియాపూర్, అమీర్‌పేట మెట్రో స్టేషన్స్ గురించే. అమీర్‌పేట స్టేషన్ ఇంటర్ ఛేంజ్‌తో ఫేమస్ అయితే.. మిగిలినవి మెట్రో పరుగులకు లాస్ట్ స్టేషన్స్ కావటంతో ప్రసిద్ధి చెందాయి. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రకాశ్ నగర్ ప్రాంతానికి ఇన్వెస్కో ప్రకాశ్‌నగర్ స్టేషన్ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. అమెరికాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ భారతీయ అనుబంధ సంస్థే ఈ ఇన్వెస్కో. కార్పొరేట్ గౌరవార్ధం ఈ పేరు పెట్టామని హెచ్‌ఎంఆర్‌ఎల్ తెలిపింది.
This website uses cookies.