అంతర్జాతీయ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ హైదరాబాద్‌లో తమ వ్యాపార విస్తరణకు రంగం సిద్దం చేసింది. ఇందులో భాగంగా గ్రేటర్ సిటీలో 25 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. రంగారెడ్డి జిల్లా నందిగామ గ్రామంలో 25 ఎకరాల భూమిని ప్రముఖ ఫార్మా సంస్థలైన నాట్కో ఫార్మా, టైమ్ క్యాప్ ఫార్మా ల్యాబ్ నుంచి కొన్నట్లు ప్రాప్ స్టాక్ నివేదిక తెలిపింది.
ఈ భూమి కొనుగోలు కోసం మైక్రోసాఫ్ట్ సంస్థ రూ.181.25 కోట్ల రూపాయలు చెల్లించినట్లు వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఈ భూమిని కొనుగోలు చేసింది సంస్థ.
హైదరాబాద్ సమీపంలోని నందిగామలో మైక్రోసాఫ్ట్ సంస్థ 25 ఎకరాల భూమి కొనుగోలుకు సంబంధించిన లావాదేవీలు ఈ ఏడాది సెప్టెంబర్ లోనే జరిగ్గా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మైక్రోసాఫ్ట్ సంస్థ భూమి ధరతో పాటు స్టాంప్ డ్యూటీ కింద రూ.9.96 కోట్లు, రిజిస్ట్రేషన్ ఛార్జీల కింద రూ.3.62 కోట్ల, ఇతర ఛార్జీలు రూ.18 లక్షలు చెల్లించినట్లు తెలిసింది.
హైదరాబాద్లో తమ డేటా సెంటర్ వ్యాపారాన్ని విస్తరించడంలో భాగంగానే మైక్రోసాఫ్ట్ ఈ భూమిని కొన్నట్టు సమాచారం. ఇటీవల మైక్రోసాఫ్ట్ ఇండియాలో తమ కార్యకలాపాల్ని విస్తరిస్తోంది. ఈ ఏడాది మేలో హైదరాబాద్‌లో రూ.267 కోట్లు పెట్టి 48 ఎకరాలు కొనుగోలు చేసింది. అంతకు ముందు 328 కోట్లు పెట్టి మహారాష్ట్రలోని పిమ్రి చించ్వాడ ప్రాంతంలో 25 ఎకరాల ప్లాట్ కొనుగోలు చేసింది.
భారత్‌లోని పుణె, ముంబై, చెన్నై తర్వాత తమ డేటా సెంటర్ కోసం మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ నగరాన్ని ఎంచుకుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే నందిగామలో భూముల కొనుగోలు విషయంపై మైక్రోసాఫ్ట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇదే సమయంలో భూమి, భవనం విక్రయాలు అనేవి తమ ఆపరేషనల్ ఆస్తుల్లో భాగం కాదని, ఈ ట్రాన్సాక్షన్ వల్ల తమ వ్యాపార కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపవని నాట్కో ఫార్మా తెలిపింది. కంపెనీ నిబంధనల ప్రకారం ఈ ఒప్పందం అండర్ టేకింగ్ లేదా దాని కార్యకలాపాలలో గణనీయమైన భాగాన్ని బదిలీ చేయడం లేదని పేర్కొంది. ఇక టైమ్ క్యాప్ ఫార్మా ల్యాబ్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
This website uses cookies.