Categories: TOP STORIES

య‌మ జోరుగా యాచారం గ్రోత్‌!

  • యాచారం దగ్గర ట్రిపుల్ ఆర్ జంక్షన్
  • ట్రిపుల్ ఆర్ యాచారం
    జంక్షన్ గేమ్ చేంజర్
  • యాచారం పరిసరాల్లో
    భారీగా రియల్ వెంచర్లు
  • ధ‌ర‌లు పెంచితే కొన‌డానికి
    ఎవ‌రు ముందుకు రారు!

తెలంగాణకు మరో మణిహారం కానున్న రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేయాల‌నే ల‌క్ష్యాన్ని నిర్దేశించుకుంది రాష్ట్ర ప్ర‌భుత్వం. ఈ క్ర‌మంలో.. జాతీయ, రాష్ట్ర రహదారులతో కనెక్ట్ అయ్యేలా ప‌న్నెండు ప్రాంతాల్లో భారీ జంక్ష‌న్ల‌ను ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగా యాచారం ద‌గ్గ‌ర ఒక ఇంట‌ర్ చేంజ‌ర్‌ను నిర్మిస్తున్నారు. నాగార్జున సాగ‌ర్ హైవేను క‌నెక్ట్ చేస్తూ డిజైన్ చేయ‌డ‌మే కాకుండా అక్క‌డే ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌ను కూడా డెవ‌ల‌ప్ చేసేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు.

ఇప్ప‌టికే ఔట‌ర్ రింగ్ రోడ్డు నుంచి సాగ‌ర్ రోడ్డు మీదుగా వెళితే.. ఇబ్ర‌హీంప‌ట్నం వ‌ర‌కూ కొంత‌మేర‌కు డెవ‌ల‌ప్ అయిన విష‌యం తెలిసిందే. ఇక నుంచి రీజిన‌ల్ రింగ్ రోడ్డు, దాని ప‌క్క‌నే ఫ్యూచ‌ర్ సిటీ, యాచారం వ‌ద్ద వ‌చ్చే భారీ జంక్ష‌న్‌తో ఈ ప్రాంతం మ‌రింత డెవ‌ల‌ప్ అవుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే, ట్రిపుల్ ఆర్ మార్కింగ్‌తో కొంద‌రు అడ్డ‌గోలుగా భూముల ధ‌ర‌ల్ని పెంచేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇలా ఇష్టం వ‌చ్చిన‌ట్లు ధ‌ర‌ల్ని పెంచ‌డం వ‌ల్లే.. ట్రిపుల్ ఆర్ ప్ర‌క‌ట‌న వెలువడ్డాక కూడా ఇన్వెస్ట‌ర్లు ట్రిపుల్ ఆర్ చుట్టుప‌క్క‌ల భూములు, ప్లాట్ల‌ను కొనుక్కోవ‌డానికి ఆస‌క్తి చూపించ‌ట్లేదు. డెవ‌ల‌ప్‌మెంట్ అంటే కేవ‌లం ప్లాట్లు, ఫ్లాట్ల ధ‌ర‌లు పెర‌గ‌డం కాద‌నే విష‌యాన్ని ప్ర‌తిఒక్క‌రూ గుర్తించాలి.

ట్రిపుల్ ఆర్ జంక్షన్ ఏర్పాటయ్యే యాచారం సమీపంలోని అఘపల్లి, గడ్డ మల్లయ్య గూడ, చౌదర్ పల్లి నుంచి మాల్ వరకు ఇప్పటికే భారీ స్థాయిలో రియల్ వెంచర్లు వెలిశాయి. రీజినల్ రింగ్ రోడ్డు ఇంటర్ చేంజర్ ఏర్పాటవుతుండటంతో భారీగా వెంచర్లు వేసేందుకు రియాల్ ఎస్టేట్ సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రస్తుతం ఇబ్బహీంపట్నం లో డీటీసీపీ లేఅవుట్ లో రియాల్టీ ప్రాజెక్టు, ప్రాంతాన్ని బట్టి చదరపు గజం 10 వేల రూపాయల నుంచి 28 వేల రూపాయల వరకు ధరలున్నాయి.

యాచారం సమీప పరిసర ప్రాంతాల్లో చదరపు గజం 6 వేల నుంచి దొరుకుతాయి. యాచారం సమీపంలోని గుంగల్ లో ఇప్పటికే ఓపెన్ ప్లాటు వెంచర్లున్నాయి. మాల్ లో డీటీసీపీ లేఆవుట్లలో చదరపు గజం 8 వేల రూపాయల నుంచి ఆరంభం. సాగర్ హైవేపై ఇబ్రహీం పట్నం పరిసరప్రాంతాల్లో కొన్ని నిర్మాణ సంస్థలు విల్లాల్ని నిర్మిస్తున్నాయి.

యాచారం కు రెండు వైపులా ఇటు ఇబ్రహీం పట్నం, అటు మాల్ వరకు భారీ ఎత్తున విద్యా సంస్థలు ఉన్నాయి. ఇక ఇప్పుడు రెండు లెన్లుగా ఉన్న సాగర్ హైవే రోడ్డు నాలుగు లేన్లుగా అభివృద్ది చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ క్రమంలో ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్డు చుట్టూ శాటిలైట్ టౌన్ షిప్ లను ఏర్పాటు చేసేలా రేవంత్ సర్కార్ ప్రణాళికలు సిద్దం చేసింది.

అంతే కాకుండా ఇక్కడ ఇండస్ట్రియల్ క్లస్టర్లు, లాజిస్టిక్స్ పార్కులు ఏర్పాటు కానున్నాయి. రీజినల్ రింగ్ రోడ్డుతో ఇటు హైదరాబాద్ కు, అటు ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ పెరగనుండటంతో సామాన్య, మధ్య తరగతి వాళ్లు యాచారం పరిసర ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు మొగ్గు చూపే వీలుంది. అందుకే, యాచారం నుంచి మాల్ వరకు నిర్మాణ ప్రాజెక్టులతో పాటు భారీ స్థాయిలో వెంచర్లకు డిమాండ్ పెర‌గొచ్చు.

This website uses cookies.