కొంపల్లిలో అందుబాటు ధరల్లో ఇళ్లు
ఫ్లాట్లు 60 లక్షల నుంచి ఆరంభం
మెట్రో రైల్, ఎంఎంటీఎస్, ఔటర్ రింగ్ రోడ్డు కనెక్టివిటీతో పాటు సమీపంలో పేరున్న విద్యాసంస్థలు, ఆసుపత్రులు, వినోద కేంద్రాలు, పచ్చదనంతో నివాసాలకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో హైదరాబాద్ ఉత్తరం వైపున్న కోంపల్లి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సికింద్రాబాద్, కూకట్ పల్లి వంటి ప్రాంతాల్లో ఇంటి ధరలు అధికంగా ఉండటంతో మధ్యతరగతి ప్రజలు.. కొంపల్లి వైపు చూస్తున్నారు. కాస్త అందుబాటు ధరల్లో ఇక్కడ ఫ్లాట్లు దొరుకుతున్నాయి. నాగ్‌పూర్ జాతీయ రహదారి, కరీంనగర్ రహదారి చుట్టుపక్కల జోరుగా నిర్మాణ ప్రాజెక్టులు వెలుస్తున్నాయి. సుచిత్ర, కొంపల్లి, బొల్లారం ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ల నిర్మాణం జరుగుతుండగా, వ్యక్తిగత ఇళ్లు, విల్లాలు, ఓపెన్ ప్లాట్ వెంచర్లు మాత్రం ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల వెలుస్తున్నాయి.
కొంపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో.. ఫ్లాట్ల ధరలు చదరపు అడుగు 4 వేల నుంచి 6 వేల వరకు చెబుతున్నారు. అంటే కొంపల్లి, సుచిత్రా సమీప ప్రాంతాల్లో డబుల్ బెడ్రూం ఫ్లాట్ 60 లక్షల నుంచి మొదలు 80 లక్షల వరకు దొరుకుతుంది. విల్లాలైతే కోటి 80 లక్షల నుంచి మొదలవుతుండగా. నిర్మాణం, విస్తీర్ణాన్ని బట్టి 8 కోట్ల రూపాయల వరకు ధరలున్నాయి. సొంతంగా ఇల్లు కట్టుకోవాలని భావించేవారికి ఓపెన్ ప్లాట్లు లభిస్తాయి. కాకపోతే, కొంపల్లి దాటి మేడ్చల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో లభిస్తాయి. పలు ప్రాంతాల్లో చదరపు గజం 25 వేల రూపాయల నుంచి 45 వేల రూపాయల వరకు పలుకుతోంది.