హైదరాబాద్ నిర్మాణ రంగం ఏమాత్రం తగ్గేదేలే అంటోంది. అవును గ్రేటర్ సిటీ ప్రతి సంవత్సరం ఇళ్ల అమ్మకాల్లో స్పష్టమైన పెరుగుదల కనబడుతోంది. భాగ్యనగర రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాల్లో ఏకంగా 29 శాతం వార్షిక వృద్ధి నమోదైంది. గడిచిన ఐదేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పటి హైదరాబాద్ రియల్ మార్కెట్ బాగా పుంజుకుంది. 2019 యేడాదితో పోలిస్తే తాజా సంవత్సరం 2024లో గృహాల విక్రయాల్లో 148 శాతం వృద్ధి నమోదైంది. 2019 నుంచి 2024 వరకు హైదరాబాద్ గృహ విక్రయాలపై క్రెడాయ్ హైదరాబాద్, సీబీఆర్ఈ రూపొందించిన నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. 5 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువ కలిగిన ఇళ్ల విక్రయాల్లో ఏకంగా 760 శాతం వృద్ధి నమోదైందని నివేదిక స్పష్టం చేసింది.
హైదరాబాద్ నిర్మాణ రంగంలో గడిచిన ఐదేళ్లలో ఘననీయమైమ మార్పులు వచ్చాయి. ఇళ్ల అమ్మకాలు, ఇళ్ల ధరల్లో స్పష్టమైన వృద్ది కనిపిస్తోంది. ఐదేళ్ల క్రితం గ్రేటర్ సిటీలో గృహ అమ్మకాల విలువ 34,044 కోట్లుగా నమోదవ్వగా, గత ఏడాది 2023 లో ఇళ్ల విక్రయాల విలువ 1,15,759 కోట్లకు చేరడం విశేషం. ప్రస్తుత సంవత్సరం 2024 మొదటి ఆరు నెలల్లో జనవరి నుంచి జూన్ వరకు హైదరాబాద్ లో ఐదేళ్ల గరిష్టానికి ఇళ్ల అమ్మకాలు చేరాయి. అయితే ప్రస్తుతం హైదరాబాద్ లో నిర్మాణం పూర్తి చేసుకుని అమ్మకానికి రెడీగా లక్షకు పైగా ఇళ్లు ఉన్నాయని విక్రయాలపై క్రెడాయ్ హైదరాబాద్, సీబీఆర్ఈ నివేదిక పేర్కొంది.
ఈ సంవత్సరం 2024 ప్రథమార్ధంలో జనవరి నుంచి జూన్ వరకు 21,936 యూనిట్ల నిర్మాణాలు మొదలయ్యాయి. అయినప్పటికీ హైదరాబాద్ లో అమ్ముడుపోని గృహాలు 1,03,316 యూనిట్లు ఉన్నాయని క్రెడాయ్ హైదరాబాద్, సీబీఆర్ఈ నివేదిక తెలిపింది. అందుకే ఈ యేడాది కొత్త నిర్మాణ ప్రాజెక్టులపై నిర్మాణ సంస్థలు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అయితే ఇన్వెంటరీ గృహాల అమ్మకాలకు 2020లో 1.68 సంవత్సరాలు పడితే, ప్రస్తుతం 1.33 సంవత్సరాలకు తగ్గడం సానుకూలమైన అంశమని బిల్డర్లు చెబుతున్నారు. ఈ యేడాది చివరి వరకు సగానికి పైగా ఇన్వెంటరీ ఇళ్ల అమ్మకాలు జరిగే అవకాశం ఉందని నిర్మాణ సంస్థలు అంచనా వేస్తున్నాయి.
ఇక హైదరాబాద్ లో నార్త్ వెస్ట్ లోనే ఎక్కువగా గృహ అమ్మకాలు నమోదవుతున్నాయి. ఈ యేడాది 2024లో మొదటి ఆరు నెలలు జనవరి నుంచి జూన్ వరకు జరిగిన విక్రయాల్లో 62 శాతం నార్త్-వెస్ట్ లోనే జరిగాయి. వీటి విలువ 36,276 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఇక నార్త్ ఈస్ట్లో ఈ ఆరు నెలల కాలంలో 4796 ఇళ్ల విక్రయాలు జరిగాయి. సౌత్ వెస్ట్లో 4957 ఇళ్లు, సౌత్ ఈస్ట్లో 2998 గృహాల అమ్మాకాలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ రియల్ మార్కెట్ లో ఇళ్ల ధరల్లోను భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. 2019 లో సగటు ఇంటి విలువ 1.1 కోట్ల రూపాయలు ఉండగా, ఇప్పుడు 44 శాతం పెరిగి సగటు ఇంటి ధర 1.5 కోట్లకు పెరిగింది.
ప్రస్తుతం సంవత్సరం 2024 లో 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయల ధరల శ్రేణిలోని గృహాలు అధికంగా సేల్ అయ్యాయి. ఇక 5 కోట్ల నుంచి 10 కోట్ల విలువైన ఇళ్ల అమ్మకాల్లో ఐదేళ్ల క్రితంతో పోలిస్తే ఏకంగా 449 శాతం వృద్ది నమోదైంది. మరోవైపు 10 కోట్ల కంటే ఎక్కువ విలువ కలిగిన గృహాల అమ్మకాలు 63 రెట్లు పెరిగడం విశేషం.
2019 లో 34,044 కోట్ల విలువైన 30,316 ఇళ్ల విక్రయాలు జరిగాయి
2020 లో 33,084 కోట్ల విలువైన 29,611 గృహ విక్రయాలు జరిగాయి. కరోనా కారణంగా ఈ యేడాది అమ్మకాలు తగ్గాయి.
2021 లో 58,818 కోట్ల విలువైన 50,884 ఇళ్ల విక్రయాలు జరిగాయి.
2022 లో 67,276 గృహాల అమ్మకాలు జరగ్గా వాటి విలువ 92,359 కోట్లు.
ఇక గత యేడాది 2023లో 74,991 ఇళ్ల విక్రయాలు జరిగాయి, వాటి విలువ ఏకంగా 1,15,759 కోట్ల రూపాయలు.
ప్రస్తుత సంవత్సరం 2024 జనవరి నుంచి జూన్ వరకు మొదటి ఆరు నెలల్లో 38,660 ఇళ్లను విక్రయించగా వాటి విలువ 58,841 కోట్లు.
This website uses cookies.