Categories: TOP STORIES

సౌతిండియాలోనే టాలెస్ట్ స్కై స్క్రేప‌ర్.. నిర్మించేది మంత్రి పొంగులేటి సంస్థ‌?

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘ‌వ సంస్థ‌.. హైదరాబాద్‌లోని ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్‌లో 61 అంత‌స్తుల ఎత్తులో సింక్ అనే కొత్త ఆకాశ‌హ‌ర్మ్యాన్ని ఆరంభిస్తోంద‌ని స‌మాచారం. వ‌చ్చే నెల అధికారికంగా ఆరంభం కానున్న ఈ ప్రాజెక్టును సుమారు 7.19 ఎక‌రాల్లో నిర్మిస్తున్నార‌ట‌. ఇందులో వ‌చ్చే ఐదు ట‌వ‌ర్ల‌లో అన్నీ ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్లే ఉంటాయ‌ట‌. ఒక్కో ఫ్లాట్‌ను 3600 చ‌ద‌ర‌పు అడుగుల్లో సైజులో నిర్మిస్తార‌ని.. వాక్ టు వ‌ర్క్ కాన్సెప్టు త‌ర‌హాలో ఈ సింక్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తార‌ని స‌మాచారం. ఈ నిర్మాణానికి సంబంధించిన వివ‌రాలు సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ 59 అంత‌స్తుల ఎత్త‌యిన నిర్మాణాన్ని బెంగ‌ళూరుకు చెందిన క్యాండియ‌ర్ సంస్థ నిర్మిస్తోంది. క్యాండియ‌ర్ స్కైలైన్ పేరిట క‌డుతున్నారు. తాజాగా రాఘ‌వ సంస్థ ఆరంభించింది 61 అంత‌స్తుల ఎత్త‌యిన ట‌వ‌ర్‌. అంటే, అంతస్తుల ప‌రంగా చూస్తే.. ఇదే హైద‌రాబాద్‌లో అత్యంత ఎత్త‌యిన ఆకాశ‌హ‌ర్మ్యం అన్న‌మాట‌. మ‌రి, న‌గ‌రంలో కొత్త ఆకాశ‌హ‌ర్మ్యాల‌కు అనుమ‌తిని మంజూరు చేయ‌ని ప్ర‌స్తుత ప‌రిస్థితిలో.. ఈ 61 అంత‌స్తుల ఆకాశ‌హ‌ర్మ్యానికి అనుమ‌తి ల‌భించ‌డం విశేషం.

This website uses cookies.