ప్రతి ఒక్కరికీ వేలాది కోరికలు ఉంటాయి.. కానీ కొందరికి ఆ కోరికతో ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అలాంటి సంగతే. మలయాళం, తెలుగు నటి మిర్నా మీనన్ కు ప్రకృతితో లోతుగా పెనవేసుకున్న ఇల్లు ఉంది. ఆమె తన గురించి, తన ఇంటి గురించి రియల్ ఎస్టేట్ గురుతో బోలెడు సంగతులు పంచుకున్నారు. ‘లియోనార్డో డికాప్రియో 2002లో కేరళలోని ఓ ప్రదేశాన్ని సందర్శించారు. భూమిపై స్వర్గం అంటూ అంటే అది ఇదే అని సందర్శకులు డైరీలో రాశారు. అలాంటి స్వర్గంలో నేను పుట్టి పెరగడం నా అదృష్టం. మా ఇంటి చుట్టూ పచ్చని తోటలు, చెట్లు ఉంటాయి. నా చిన్నప్పటి నుంచీ కూడా ప్రకృతితో నేను మమేకం కావడానికి మా ఇల్లు ఎంతగానో దోహదం చేసింది. అన్నింటి కంటే దేవుడి సొంత దేశానికి చెందిన వ్యక్తిని నేను’ అని పేర్కొన్నారు.
కేరళ సంప్రదాయశైలి ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తుంది. నలుకెట్టు అనేది కేరళలోని అత్యంత ప్రసిద్ధ శైలిలో ఒకటి. ఆధునిక ఇంటి పైకప్పులు అద్భుతంగా కనిపిస్తాయి. పిచ్డ్ రూఫ్, ఫ్లాట్ రూఫ్ శైలిలతో వినూత్నంగా అనిపిస్తాయి. అయితే, కేరళ డిజైన్లు అన్ని శైలిలకు భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే కేరళ ఇళ్లు ప్రత్యేక ఆకర్షణ, సంప్రదాయంతో సమ్మిళితమై ఉంటాయి. ‘నేను ఎల్లప్పుడూ మినమాలిస్టిక్ డిజైన్లనే ఇష్టపడతాను. మా అన్ని ఇళ్లలో చాలా స్థలం ఉంటుంది. ఇక ఫర్నిచర్ కు సంబంధించి నేను ప్రాథమిక వస్తువులను మాత్రమే ఇష్టపడతాను. మా ఇంటిని మొక్కలతో నింపేస్తాను. నా దృష్టిలో ఇల్లంటే మనకు, మన కుటుంబానికి సౌకర్యవంతమైన వసతి అందించే ఆదర్శవంతమైన నివాసంగా ఉండాలి’ అని వెల్లడించారు.
తన విశాలమైన ఇల్లు మానసికంగా, శారీరకంగా కూడా తన ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపిస్తుందని మర్నా పేర్కొన్నారు. ‘ఫ్లాట్, విల్లా లేదా బంగ్లా.. వీటిలో ఏదైనా నాకు ఒకటే. కానీ ఇంటీరియర్ మాత్రమే నాకు ముఖ్యం. నా ఇంటీరియర్స్ విషయంలో చాలా కచ్చితంగా ఉంటాను. వాటితో ప్రశాంతత చేకూరాలని కోరుకుంటాను. ఇక పనులు లేనప్పుడు ఎక్కువ సమయం ఇంట్లోనే ఉంటాం. మేం సంతోషంగా ఉండటానికి అనువుగా మా ఇల్లు ఉండాలని కోరుకుంటాం.
ఇల్లు అనేది మనకు గోప్యత, వ్యక్తిగత స్థలాన్ని ఇస్తుంది. అలాగే శాంతి, సామరస్యం అనే రెండు ప్రధాన అంశాలు మన ఇంట్లో ప్రతిబింబించాలి’ అని మిర్నా అభిప్రాయపడ్డారు. కరోనా కారణంగా ప్రస్తుతం ప్రజలు ఇళ్లనే కార్యాలయాలుగా చేసుకోవడంతో ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతున్నారని, అందువల్ల ఇల్లు పెద్దగా ఉండాలని భావిస్తున్నారని తెలిపారు. ‘నా తల్లి నాకు జన్మనిచ్చిన ఇల్లు ఎప్పటికీ నా కలల సౌథంగా మిగిలిపోతుంది. అయితే, ఆరోగ్యకరమైన జీవనానికి, మానసిక శ్రేయస్సును పెంపొందించుకోవడానికి విశాలమైన గృహాల కోసం నేను ఎక్కువ దూరం వెళ్లడానికి కూడా సిద్ధమే’ అని స్పష్టంచేశారు.
విశాలమైన కిటికీల ద్వారా ప్రకాశంవంతంగా వెలిగే బయటి ప్రదేశాలను చూడటం ఎంతో ఆహ్లాదకరమైన అనుభూతి ఇస్తుందని తెలిపారు. ఇరుకైన కారిడార్లతో కూడిన చిన్న గదుల్లోకి తాజా గాలి, కాంతి రావడం వీలుకాదని, అలా ఉండటం తనకు అసలు నచ్చదని స్పష్టంచేశారు. ‘సూర్యరశ్మి, స్వచ్ఛమైన గాలి గది లోపల ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తుంది. అలాగే నాకు బాల్కనీలో ఎక్కువ సమయం గడపడం చాలా ఇష్టం. అక్కడ కూర్చుని చల్లని గాలిని ఆస్వాదిస్తూ సేదతీరడం బావుంటుంది. ఏ ప్రాపంచిక ఆనందాల గురించీ ఆలోచించొద్దు. కేవలం మీ మూడ్ ను తక్షణమే రిఫ్రెష్ అయ్యే వరకు వేచి చూడండి. నా తలపై పైకప్పు కంటే ఇల్లు చాలా ఎక్కువగా ఉండాలి.
నా వ్యక్తిగత స్థలంలో ఎలాంటీ చీకూచింతా లేకుండా ఉండగలను. పెద్ద ఇంటితో అనుకూలమైన జీవన వాతావరణాన్ని, సౌందర్యాన్ని మిళితం చేసే కార్యాచరణ నాకు తెలుసు. తమ ఆలోచనలతో ఏకాంతంగా నివసించడానికి అనువైన సొంత స్థలాన్ని కలిగి ఉండటానికి ఎవరు ఇష్టపడరు చెప్పండి’ అని మిర్నా ప్రశ్నించారు. ఎండలు మండిపోతున్న ప్రస్తుత తరుణంలో వ్యాయామం కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదని.. ఇంట్లోనే అన్నీ అమర్చుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రకృతి ఒడిలో ఎలాంటి కాలుష్యం లేని ప్రదేశంలో తన కలల ఇంటిని నిర్మించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, అది తన మానసిక ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుస్తుందని చెప్పారు.
స్వర్గానికి, భూమికి మధ్య అటవీ పందిరిలో నివసించాలని.. లేదా చెట్టు ఇంట్లో నివసించాలనే మీ చిన్ననాటి ఫాంటసీని నెరవేర్చుకోవాలని మిర్నా సూచించారు. ‘నాకు ప్రకృతిలో విహరించడం చాలా ఇష్టం. కేరళ ఇప్పటికే నా సహజ స్వర్గం. ఇక్కడే నేను సేద తీరాలనుకుంటున్నాను. పూర్తిగా మొక్కలతో నిండిపోయి ఉన్న నా ఇంటిని అమితంగా ఇష్టపడతాను’ అని మిర్నా తెలిపారు. ఇక ఇంటి అలంకరణలో మిర్నా చాలా ప్రత్యేకమైన వ్యక్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు. తన ఇంట్లోని ప్రతి మూలనూ ఆమె అందంగా అలంకరించారు. తగిన ఫర్నిచర్ ఎంచుకోవడం నుంచి గోడలకు తన ఇష్టం వచ్చిన పెయింటింగ్ వేయించడం వరకు అంతా స్వయంగా చూసుకున్నారు.
‘మా ఇంటికి అలంకరణ వస్తువులు సేకరించడం నాకు చాలా ఇష్టం. సమయం దొరికితే హస్తకళలు తయారు చేయడంలో కూడా మునిగిపోతాను. నేను నిర్మించాలనకునే నా కలల సౌథంపై నాకున్న ప్రేమకు నిదర్శనం అది’ అని పేర్కొన్నారు. హైదరాబాద్ గురించి మాట్లాడుతూ.. ‘రియల్ ఎస్టేట్ విపరీతంగా అభివృద్ధి చెందుతున్న నగరం అని మన అందరికీ తెలుసు. హైదరాబాద్ మెరుగైన గృహావకాశాలు కలిగి ఉన్న నగరం. ఇది ప్రజల అభివృద్ధిలో సరైన దిశలోనే దూసుకెళ్తోంది. ఇది నన్ను బాగా ఆకట్టుకుంటోంది. ఎప్పుడైనా నేను నా తెలుగు సహనటుల ఇంటిని ఇష్టపడితే, ఆ ఇంటికి మిర్నా డెకరేషన్ జోడిస్తా’ అని చెప్పి ముగించారు.
This website uses cookies.