* జోరు మీదున్న కాంగ్రెస్ సర్కార్
* బాపుఘాట్ దాకా ఫస్ట్ ఫేజ్ సుందరీకరణ
* ఐదేళ్లలో లక్షన్నర కోట్లతో అభివృద్ధి
హైదరాబాద్ అభివృద్ధికి ఐదేళ్లలో రూ1.50 లక్షల కోట్లు మూసీ పునరుజ్జీవనంతో మరో నగరం సృష్టి మొదటి దశలో బాపూఘాట్ వరకు 21 కి.మీ అభివృద్ది మూడు నెలల్లోనే మూసీ ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధం హైదరాబాద్ మహానగర అభివృద్ధికి ఐదేళ్లలో లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు చేయాలన్నది తమ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మెట్రోరైలు రెండోదశ అభివృద్ధికి రూ.25 వేల కోట్లు, ఫ్యూచర్ సిటీ మెట్రో రైలుకు రూ. 10 వేల కోట్లు, రీజినల్ రంగ్ రోడ్డుకు రూ. 35 వేల కోట్లు, రేడియల్ రోడ్లకు రూ. 10 వేల కోట్లు, ఫ్లైఓవర్లు, బ్రిడ్జిలు, మూసీ పరిహారం, ఎస్టీపీలకు కలిపి మరో రూ. 10-15 వేల కోట్లు ఖర్చు చేస్తామని అన్నారు. మూసీ ప్రక్షాళనలో భాగంగా గోదావరి నీటిని మళ్లించే పనికి రూ. 6 నుం రూ. 7 వేల కోట్లు ఇందులో భాగమేనన్నారు. కంటోన్మెంట్‌లో రెండు ఎలివేటెడ్ కారిడార్లకు రూ. 10 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు.
మూసీ పునరుజ్జీవం మొదటి దశలో బాపూఘాట్ నుంచి ఎగువ భాగంలో పనులు చేపట్టేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఉస్మాన్‌సాగర్ నుంచి 11.5 కి.మీ. దూరం, హిమాయత్‌సాగర్ నుంచి 9.5 కి.మీ. దూరం జలాలు ప్రవహించి బాపూఘాట్ వద్ద కలుస్తాయి. అక్కడ ప్రపంచంలోనే ఎత్తయిన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఉస్మాన్ సాగర్ నుంచి ఎగువకు బాపూఘాట్ వరకు మొత్తం 21 కి.మీ. మేర నూరు శాతం మొదటి దశలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. గోదావరి నీటిని మల్లన్నసాగర్ నుంచి హిమాయత్‌సాగర్‌కు, అక్కడి నుంచి ఉస్మాన్‌సాగర్‌కు మళ్లించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు జలాశయాల నుంచి అవసరానికి తగ్గట్లుగా మూసీకి నీటిని విడుదల చేస్తారు. గోదావరి నీటి మళ్లింపు, శుద్ధీకరణ పనులకు నవంబరు మొదటి వారంలో టెండర్లు పిలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
బాపూఘాట్ నుంచి వందశాతం శుభ్రమైన నీరు దిగువకు వచ్చేలా ప్రాజెక్టును డిజైన్ చేశారు. బాపూఘాట్ వద్ద బ్రిడ్జి కమ్ బ్యారేజీ, గాంధీ ఆశయాలను ప్రతిబింబించేలా కేంద్రం, లండన్ ఐ లో జెయింట్ వీల్ తరహా ఏర్పాటు, బెంగళూరులోని జిందాల్ తరహాలో ప్రకృతి వైద్య కేంద్రం, స్టాన్‌ఫర్డ్ సహా ఇతర అంతర్జాతీయ యూనివర్సిటీల ఉప కేంద్రాలు, రిక్రియేషన్‌కు థీమ్ పార్కుల వంటిని ఏర్పాటు చేస్తారు. పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా కుటుంబాలు ఆహ్లాదంగా గడపడానికి అనువుగా సకలం అభివృద్ది చేసేలా పక్కా ప్రణాళికలు రూపొందిస్తోంది. సామాన్యులకు అవసరమైన వినోదాలన్నీ ఇక్కడ ఉంటాయి.
మూసీ ప్రక్షాళన, సుందరీకరణలో భాగంగా మొత్తం మీద 30 కి.మీ. పరిధిలో రింగ్ అభివృద్ధి చెందుతుంది. ఐటీ కారిడార్ లోని ఉద్యోగులు ఈ ప్రాంతానికి హాయిగా నడుచుకుంటూ వచ్చేయొచ్చని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక్కడ కొన్ని ఆర్మీ భూములుండగా.. వీటిని తీసుకుని ప్రత్యామ్నాయ భూములిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం కేంద్రప్రభుత్వాని లేఖ రాసింది. మూసీ సరిహద్దులు ఎక్కడివరకు అన్నది నిర్ణయించాక డిజైన్, డ్రాయింగ్, డీపీఆర్ తయారవుతుందని మఖ్యమంత్రి స్పష్టం చేశారు. మూసీ సమగ్ర సర్వే పూర్తయ్యాక ఎంత స్థలం ఉందో క్లారిటీ వచ్చాక.. ఎక్కడ ఎలాంటి భవనం కట్టాలో, ఎంత విస్తీర్ణంలో కట్టాలో డిజైన్ చేసుకోనున్నారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఐదు కన్సల్టెన్సీ సంస్థల కన్సార్షియం మూసీ పునరుజ్జీవం డీపీఆర్‌ను రూపొందిస్తోంది. ఈ పనిని రూ.141 కోట్లతో అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం.
మూసీ ప్రక్షాళనకు సంబంధించిన డిజైన్, డ్రాయింగులు, నిర్మాణాలు, ఆర్థిక మోడల్ ఇలా అన్నీంటిపై సమగ్రమైన డీపీఆర్ తయారు చేస్తారు. మూసీ పునరుజ్జీవం ప్రాంతంలో ప్రస్తుతం ఓ రైతు బజార్ ఉంది. అందులో విక్రయించుకునేవారందరికీ ప్రత్యామ్నాయం చూపించేలా రేవంత్ సర్కార్ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే మూసీ పరివాహక ప్రాతంలో ఉన్న చిన్న ఉద్యోగులు, వ్యాపారులు ఇలా ఎవరి హక్కులకూ భంగం కలగనివ్వకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు.
మూసీ పునరుజ్జీవంలో భాగంగా నైట్ బజార్లు ఏర్పాటు చేయడం ద్వారా.. ఇవన్నీ ఆర్థిక కేంద్రాలుగా మారతాయని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. మూసి పునరుజ్జీవం ప్రాజెక్టు పూర్తయితే ఇంకో నగరాన్ని సృష్టించినట్లు అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంచనా వేస్తున్నారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలోనా, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్‌లోనా అన్నది కన్సార్షియం సిఫార్సు చేయనుంది. కాన్సెప్ట్ పూర్తయ్యి, పని ప్రారంభించడానికి 18 నెలలు పడుతుందని తెలంగాణ ప్రభుత్వం భావించింది. కానీ నిర్విరామంగా పని చేస్తున్నందున మూడు నెలల్లో సమగ్రమైన డీపీఆర్ సిద్ధమవుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.