Categories: TOP STORIES

మూసీ శుద్ధీక‌ర‌ణ ఫ‌స్ట్ ఫేజ్ షురూ!

తెలంగాణ ప్ర‌భుత్వం మూసీని సుంద‌రీక‌ర‌ణ‌ చేయ‌డానికి అతివేగంగా అడుగులు ముందుకేస్తోంది. మొదటి దశలో బాపూఘాట్‌ నుంచి ఎగువ భాగంలో పనులు చేపట్టేలా ప్రణాళికల్ని సిద్దం చేస్తోంది. ఉస్మాన్‌సాగర్‌ నుంచి 11.5 కి.మీ. దూరం, హిమాయత్‌సాగర్‌ నుంచి 9.5 కి.మీ. దూరం జలాలు ప్రవహించి బాపూఘాట్‌ వద్ద కలుస్తాయ‌నే విష‌యం తెలిసిందే. అక్కడే ప్రపంచంలోనే ఎత్తయిన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు.

ఉస్మాన్ సాగర్ నుంచి ఎగువకు బాపూఘాట్ వరకు మొత్తం 21 కి.మీ. మేర మొదటి దశలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. గోదావరి నీటిని మల్లన్నసాగర్‌ నుంచి హిమాయత్‌సాగర్‌కు, అక్కడి నుంచి ఉస్మాన్‌సాగర్‌కు మళ్లించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు జలాశయాల నుంచి అవసరానికి తగ్గట్లుగా మూసీకి నీటిని విడుదల చేస్తారు. గోదావరి నీటి మళ్లింపు, శుద్ధీకరణ పనులకు నవంబరు మొదటి వారంలో టెండర్లు పిలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

మూసీ ప్రక్షాళన, సుందరీకరణలో భాగంగా మొత్తం మీద 30 కి.మీ. పరిధిలో రింగ్‌ అభివృద్ధి చెందుతుంది. ఐటీ కారిడార్ లోని ఉద్యోగులు ఈ ప్రాంతానికి హాయిగా నడుచుకుంటూ వచ్చేయ‌వ‌చ్చని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక్కడ కొన్ని ఆర్మీ భూములుండగా.. వాటిని తీసుకుని ప్రత్యామ్నాయ భూములిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. మూసీ సరిహద్దులు ఎక్కడి వరకు అన్నది నిర్ణయించాక.. డిజైన్, డ్రాయింగ్, డీపీఆర్‌ తయారవుతుందని మఖ్యమంత్రి స్పష్టం చేశారు.

మూసీ సమగ్ర సర్వే పూర్తయ్యాక ఎంత స్థలం ఉందో క్లారిటీ వచ్చాక.. ఎక్కడ ఎలాంటి భవనం కట్టాలో, ఎంత విస్తీర్ణంలో కట్టాలో డిజైన్ చేస్తారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఐదు కన్సల్టెన్సీ సంస్థల కన్సార్షియం మూసీ పునరుజ్జీవం డీపీఆర్‌ను రూపొందిస్తున్నాయి. దీనికి కేటాయించిన మొత్తం బ‌డ్జెట్‌.. రూ.141 కోట్లు.

మూసీ సుంద‌రీక‌ర‌ణలో భాగంగా ఏర్పాటు చేసే నైట్ బ‌జార్లు ఆర్థిక కేంద్రాలుగా మారతాయ‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్త‌యితే ఇంకో నగరాన్ని సృష్టించినట్లు అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలోనా, హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌లోనా అన్నది కన్సార్షియం సిఫార్సు చేస్తుంది. కాన్సెప్ట్‌ పూర్తయ్యి, పని ప్రారంభించడానికి 18 నెలలు పడుతుందని తెలంగాణ ప్రభుత్వం భావించింది. కానీ నిర్విరామంగా పని చేస్తున్నందున మూడు నెలల్లో సమగ్రమైన డీపీఆర్ సిద్ధమవుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

This website uses cookies.