ఇళ్ల కొనుగోలుదారుల్లో సరికొత్త విశ్వాసాన్ని నెలకొల్పడానికి.. నరెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో పన్నెండోసారి ముచ్చటగా ముస్తాబైంది. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో సెప్టెంబరు 23 నుంచి జరిగే మూడు రోజుల అమ్మకాల పండుగలో సుమారు 110 స్టాళ్లను ఏర్పాటు చేస్తారు. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ఈ స్థిరాస్తి ప్రదర్శనలో డెవలపర్లతో పాటు బ్యాంకులు, నిర్మాణ సామగ్రి సంస్థలు పాల్గొంటాయి. కొనుగోలుదారులకు అవసరమయ్యే ప్లాట్లు, ఫ్లాట్లు, లగ్జరీ విల్లాలు, నిర్మాణ సామగ్రి, గృహరుణాలకు సంబంధించిన సమస్త సమాచారం ఈ ప్రాపర్టీ షోలో లభిస్తుంది. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రాపర్టీ షో అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పండగ సీజన్ కావడంతో స్థిరాస్తి కొనుక్కోవడానికి ఇంతకు మించిన తరుణం లేదని చెప్పొచ్చు.
రెరా ముద్దు..
గత ఏడేళ్లలో హైదరాబాద్ అతివేగంగా అభివృద్ధి చెందింది. రాజకీయ సుస్థిరత, మౌలికాభివృద్ధికి పెద్దపీట, ఐటీ మరియు ఇన్నోవేషన్ రంగాలకు ప్రోత్సాహం వంటి అంశాలే ఇందుకు ప్రధాన కారణమని చెప్పొచ్చు. 2035 నాటికల్లా హైదరాబాద్ ప్రపంచంలోనే అతిపెద్ద నగరంగా ఖ్యాతినార్జిస్తుంది. అతివేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలుస్తుంది. కొవిడ్ తర్వాత నగరంలో సుమారు 12 మిలియన్ చదరపు అడుగుల వాణిజ్య సముదాయాన్ని వివిధ సంస్థలు తీసుకున్నాయి. కేవలం రెరా ఆమోదిత ప్రాజెక్టుల్లోనే స్థిరాస్తిని కొనుగోలు చేయాలి. – సునీల్ చంద్రారెడ్డి, అధ్యక్షుడు, నరెడ్కో తెలంగాణ
ప్రతికూల ప్రభావం లేదు!
ట్రిపుల్ వన్ జీవోను తొలగించడం వల్ల రియల్ రంగంపై ప్రతికూల ప్రభావం పడలేదు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పరివాహక ప్రాంతాలకు సంబంధించి కొత్త నిబంధనల్ని ఏర్పాటు చేయనంత కాలం.. అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగదు. జీఎస్టీ రేటు పెరగడం వల్ల అటు కొనుగోలుదారులు ఇటు డెవలపర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫ్లాట్ విలువలో సుమారు 18 నుంచి 20 శాతం వివిధ పన్నుల రూపంలో కట్టాల్సి వస్తుంది. అందుకే, అందుబాటు గృహాలపై పన్నులను తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వల్ల నిర్మాణ సామగ్రి సరఫరాపై ప్రభావం పడింది. ఫలితంగా, వాటి ధరలు పెరిగాయి. అల్యూమినియం, కిటికీలు.. ఇలా ఏవీ చూసినా 25 నుంచి 30 శాతం ధర పెరిగింది.- మేకా విజయ సాయి, ప్రధాన కార్యదర్శి, నరెడ్కో తెలంగాణ