మంత్రి వేములకు వినతి పత్రం అందజేసిన నరెడ్కో వెస్ట్ జోన్ సంఘం
ఓసీ రాకపోవడంతో బిల్డర్లకు సరికొత్త సమస్యలు
రెజ్ న్యూస్, హైదరాబాద్: నాలా ఛార్జీలతో సరికొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయని నరెడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ అంటోంది. ధరణి వల్ల నిర్మాణ రంగంలో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ సంఘ సభ్యులందరూ కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కలిశారు. ఆయనకు అందజేసిన వినతి పత్రంలో పలు సమస్యల్ని వివరించారు. దీంతో, ఆయన సానుకూలంగా స్పందించారు.
పంచాయతీ లేఅవుట్లలో కొన్ని ప్లాట్లు తీసుకుని వెయ్యి నుంచి రెండు వేల గజాల్లో కొందరు బిల్డర్లు అపార్టుమెంట్లను నిర్మించారు. హెచ్ఎండీఏ నుంచి అనుమతి తీసుకునేటప్పుడే 5 శాతం తనఖా పెట్టిన తర్వాత కూడా మరో మూడు శాతం అదనంగా నాలా ఛార్జీల కోసం తనఖా పెట్టారు. ఈ నిర్మాణాలు పూర్తయ్యాక నాలా ఛార్జీలను కడతామంటే సాధ్యం కావట్లేదు. ఈ రుసుమును కడతామని చెబుతున్నా అటు హెచ్ఎండీఏ కానీ ఇటు రెవెన్యూ శాఖ కానీ పట్టించుకోవడం లేదు. ధరణీలో ఆప్షన్ లేదని అంటున్నారు. దీని వల్ల ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ రావడం లేదని డెవలపర్లు చెబుతున్నారు. ధరణిలో ప్లాట్లు అని రాసి ఉండటం వల్ల నాలా ఛార్జీల్ని కట్టించుకునే అవకాశం లేదని అధికారులు అంటున్నారు. ఇలాంటి సమస్యల్ని పరిష్కరించేందుకు.. ధరణి మీద ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీ వేయడంతో ఆయనకు నరెడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రత్యేకంగా వినతి పత్రాన్ని అందజేసింది. అతిత్వరలో ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని ఆయన బిల్డర్లకు హామీ ఇచ్చారు. మొత్తానికి, అనేక మంది చిన్న బిల్డర్లను ఇబ్బంది పెడుతున్న ఈ సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపెడుతుందనే ఆశాభావాన్ని నరెడ్కో వెస్ట్ జోన్ సంఘం వ్యక్తం చేస్తోంది.