Categories: LATEST UPDATES

ధరల పెరుగుదలపై జోక్యం చేసుకోండి

  • కేంద్ర గృహ నిర్మాణ శాఖకు నరెడ్కో వినతి

ఓవైపు ఇప్పటికే నిర్మాణ వ్యయం పెరగ్గా.. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రియల్ రంగాన్ని మరింత ప్రభావితం చేస్తోంది. స్టీల్, సిమెంట్ సహా పలు నిర్మాణరంగ మెటీరియల్ ధరలు చుక్కలను తాకుతున్నాయి. దీంతో అధిక ధరాఘాతంతో రియల్ ఎస్టేట్ రంగం విలవిలలాడుతోంది. ఈ నేపథ్యంలో ధరల పెరుగుదలను నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖకు రియల్టర్ల పాన్ ఇండియా బాడీ.. జాతీయ రియల్ ఎస్టేట్ అభివృద్ధి మండలి (నరెడ్కో) విన్నవించింది. భవనాల నిర్మాణ వ్యయాన్ని తగ్గించేందుకు స్టీల్, సిమెంట్ ధధల విషయంలో జోక్యం చేసుకోవాలని కోరింది. ‘నిన్న కరోనా మహమ్మారి, నేడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రా మెటీరియల్ ధరలు విపరీతంగా పెరిగాయి.

ఫలితంగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల ధరలు కూడా పైపైకి వెళ్తున్నాయి. కానీ అమ్మకపు ధరల్లో ఎలాంటి మార్పులూ లేకపోవడంతో డెవలపర్లపై తీవ్ర భారం పడుతోంది’ అని కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పూరికి రాసిన లేఖలో నరెడ్కో పేర్కొంది. ఈ నేపథ్యంలో స్టీల్ పై ప్రస్తుతం విధిస్తున్న 7.5 శాతం దిగుమతి సుంకాన్ని రెండేళ్లపాటు సున్నా చేయాలని, అలాగే రెండేళ్లపాటు స్టీల్ ఎగుమతులపై నిషేధం విధించాలని కోరింది. దేశీయ మార్కెట్లలో సరఫరా సాధారణ స్థాయికి వచ్చేవరకు స్టీల్, సిమెంట్ ధరలను నియంత్రించాలని సూచించింది.

ఇందుకోసం వీటిని జీఎస్టీలోని దిగువ శ్లాబ్ లో పెట్టాలని అభ్యర్థించింది. కరోనా మహమ్మారి తర్వాత ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న రియల్ రంగం.. మళ్లీ ధరల పెరుగుదల కారణంగా ఒడుదొడుకులకు లోనవుతోందని పేర్కొంది. 2020 జనవరిలో రూ.250 ఉన్న సిమెంట్ బస్తా.. ఇప్పుడు 45 శాతం మేర పెరిగి రూ.360కి చేరిందని తెలిపింది. రెండేళ్ల క్రితం టన్ను స్టీల్ ధర రూ.39000 ఉండగా.. ఏకంగా 131 శాతం మేర పెరిగి రూ.90వేలకు ఎగబాకిందని ఆవేదన వ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలో ఈ ధరల నియంత్రణకు జోక్యం చేసుకోవాలని కోరింది.

This website uses cookies.