-
-
జైపూర్ బిల్డర్.. ఏడేళ్ల టెర్రర్
-
2017లో ప్రీలాంచ్లో అమ్మకాలు
-
ప్లాన్ రివైజ్.. 2018లో
-
2021లో రెరా అనుమతి
-
పనులింకా పూర్తి కాని దుస్థితి
-
పదేళ్లయినా పూర్తవుతుందన్న
గ్యారెంటీ లేదు
-
ఏమిటీ నరకం అంటున్న బయ్యర్లు
-
నరేంద్ర మోడీ కొనుగోలుదారులకు నరకం చూపిస్తున్నాడు. 2017లో ఒక ప్రాజెక్టును ఆరంభించి నేటికీ పూర్తి చేయలేదు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి చూస్తే.. ఆ నిర్మాణం పూర్తవ్వడానికి మరో పదేళ్లయినా పట్టే అవకాశముంది. ఫలితంగా, అందులో ఫ్లాట్లు కొన్నవారంతా గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర రెరా అథారిటీ స్పందించి.. నరేంద్ర మోడీ పై కఠిన చర్యల తీసుకోవాలని బయ్యర్లు కోరుతున్నారు.
భారతదేశంపై గజనీ మహమ్మద్ వరుస దండయాత్రలు చేసినట్లుగా.. ఇతర రాష్ట్రాల బిల్డర్లు హైదరాబాద్‌పై దాడులు చేస్తూనే ఉన్నారు. మన ప్రజల కష్టార్జితాన్ని దోచుకుంటున్నారు. అయినా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ రెరా అధికారులు కానీ పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే, ఈ దోపిడిదారులకు.. రాజకీయపరమైన అండదండలు లభించడమే ఇందుకు ప్రధాన కారణం. దోచుకున్న సొమ్ములో కొంత వాటా ఇస్తే చాలు.. బాధితులు ఎవరనే విషయాన్ని పట్టించుకోరు. తాజాగా, జైపూర్‌కు చెందిన ఈ బిల్డర్ నగర వాసులను ఏడేళ్ల నుంచి ముప్పుతిప్పలు పెడుతున్నాడు. అయినా, ఎప్పటిలాగే అందరూ గప్ చుప్..!
చెన్నై ప్రమోటర్లు వచ్చారు.. కోట్ల రూపాయలు వసూలు చేసి.. ఫ్లాట్లు కడుతున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు. అహ్మదాబాద్ డెవలపర్ అడుగుపెట్టాడు. ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియదు. బెంగళూరు బిల్డరూ వచ్చేశాడు.. అన్నీ నగరాల్లో రెరా ప్రకారం నిర్మాణాలు కడితే.. ఇక్కడ మాత్రం ప్రీలాంచుల్లో ప్లాట్లు, ఫ్లాట్లను అమ్మేశాడు. పొరుగు నగరాల బిల్డర్లకు హైదరాబాద్ అంటే ఎక్కడ్లేని మక్కువ. ఎందుకంటే, ఇక్కడేం చేసినా అడిగే నాధుడే ఉండడు. స్థానిక సంస్థల అనుమతి లేకున్నా.. రెరా పర్మిషన్ తీసుకోకున్నా.. ప్లాట్లు, ఫ్లాట్లను అమ్ముకోవచ్చు. కోట్ల రూపాయల్ని వసూలు చేయవచ్చు. సకాలంలో నిర్మించకపోయినా ఎవరూ పట్టించుకోరు. ఎవరైనా పొరపాటున ఫిర్యాదు చేసినా.. పైనుంచి ఆదేశాలు రావడంతో.. ఎక్కడి అధికారులు అక్కడే గప్ చుప్..!!
2017వ సంవత్సరం ఫిబ్రవరి నెల.. నిజాంపేట్‌లో శ్రీరాఠ్ అపార్టుమెంట్స్ నిర్మిస్తున్నామని జైపూర్‌కి చెందిన ఉన్నతి బిల్డ్‌టెక్ ప్రకటనల వర్షం కురిపించింది. దీంతో, గొర్రెల్లాంటి ప్రజలు విషయాన్ని కనుక్కోగా.. మూడు నెలల్లో అనుమతులొస్తాయి కాబట్టి.. నిర్మాణ పనుల్ని వెంటనే ఆరంభిస్తామని తెలిపారు. అప్పటికే పునాదులు తవ్వేశారు కాబట్టి.. ఓపెన్ ఇంట్రెస్ట్ కింద.. కేవలం లక్ష రూపాయలు టోకెన్ అమౌంట్ కట్టి.. ప్రైస్ లాక్ చేసుకోవచ్చని చెప్పారు. అప్పట్లో ఫ్లాట్ ధర చదరపు అడుక్కీ రూ.2800 నుంచి రూ.3,500 మధ్యలో ధర ఉంటుంది కాబట్టి.. వారు చెప్పిన విధానాన్ని బట్టి దాదాపు 150 మంది లక్ష రూపాయలు సంస్థకు చెల్లించారు. ఏడాది తర్వాత, అంటే 2018లో ప్లాన్ రివైజ్ అయ్యిందన్నారు. ఒక వైపు వంద అడుగుల రోడ్డు ఉండటంతో అటు వైపు రోడ్డు వదిలేసి నిర్మాణ పనులు చేసుకోమన్నారని.. రివైజ్ చేసిన ప్లాన్ కాపీని పంపి… ఫ్లాట్ నెంబరును ఎంచుకోమని సూచించారు.
* 2018లో దసరాకి ప్రాజెక్టును లాంచ్ చేస్తున్నామని చెప్పి.. మొత్తం సొమ్ములో పది శాతం సొమ్మును జమ చేయమన్నారు. అక్టోబరు19న ప్రాజెక్టును ఆరంభించారు. దీంతో, కొందరు కొనుగోలుదారులు పది శాతం సొమ్మును కట్టేశారు. ఈలోపు నాలుగేళ్ల కాలం కాస్త గడిచిపోయింది. ఎట్టకేలకు 2021 డిసెంబరులో రెరా అనుమతి లభించింది.
చేతులెత్తిసిన మోడీ..
ఆ తర్వాత జైపూర్ బిల్డర్ ఏం చేశాడంటే… కొనుగోలుదారులను పిలిచి మొదట్లో అమ్మిన రేటుకు ఫ్లాట్లను అందించలేమని చేతులెత్తేశారు. చదరపు అడుక్కీ రూ.4500 చొప్పున కొనుక్కున్నవారికి ఫ్లాట్లను కేటాయిస్తామని తెలిపారు. దీంతో, కొనుగోలుదారులు ఒక్కసారిగా ఖంగు తిన్నారు. తొలుత లక్ష కట్టి.. ఏడాది తర్వాత ప్రాజెక్టు విలువలో పది శాతం చెల్లించిన నాలుగేళ్లయ్యాక.. పాత రేటుకు ఇవ్వమని.. కొత్త రేటు ప్రకారమైతే ఫ్లాట్లను విక్రయిస్తామని చెప్పడం ఎంత దారుణం? చెల్లించిన సొమ్ము మీద ఐదు శాతం వడ్డీకడతామని చెప్పారు. దీంతో, వంద మంది బయ్యర్లు కొత్త రేటు ప్రకారమే సొమ్మూ చెల్లించారు. మిగతావారు సొమ్ము తీసుకున్నారు.
* సొమ్ము చెల్లించి దాదాపు పద్నాలుగు నెలలు గడిచినా ఇప్పటివరకూ నిర్మాణ పనుల్లో పెద్దగా పురోగతి కనిపించట్లేదు. పదమూడు నెలలు గడిచినా, ఇప్పటివరకూ రెరా అనుమతి రాలేదు. బ్యాంకులు ప్రాజెక్టును అనుమతించలేదు. 13 నెలల్నుంచి ఎలాంటి పురోగతి లేకపోవడంతో.. బయ్యర్లు సంస్థను ప్రశ్నిస్తుంటే ఎలాంటి జవాబు రావట్లేదు. రెరా నిబంధనల ప్రకారం.. 2025లోపు పూర్తి చేస్తామని అంటున్నారు. కానీ, బయట్నుంచి చూస్తేనేమో.. 2025 కాదు కదా.. మరో ఐదేళ్ల వరకూ ఈ ప్రాజెక్టు పూర్తి కాదనే విషయం అర్థమవుతోందని కొనుగోలుదారులు అభిప్రాయడ్డారు. ఇలాంటి కంపెనీల నుంచి కొనుగోలుదారులను రక్షించాల్సిన బాధ్యత రెరాపై ఉందని అంటున్నారు. మరి, ఇలాంటి మోసపూరిత సంస్థలను రెరా ఎలా దారిలోకి తెస్తుంది?