దేశవ్యాప్తంగా దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. చాలా మంది కొత్త ఇంటి కొనుగోలుకు ఇది సరైన సమయం అని భావిస్తారు. అదే సమయంలో రియల్టర్లు సైతం మంచి మంచి ఆఫర్లతో కొనుగోలుదారులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తారు. మీరు కూడా కొత్త ఇంటి వేటలో ఉంటే ఈ కథనం మీ కోసమే..
1. తగ్గింపు ప్రాపర్టీ ధరలు: పండుగ సీజన్ లో డెవలపర్లు తరచుగా తమ ప్రాపర్టీలపై ధర తగ్గింపు ప్రకటిస్తుంటారు. ఇది అద్భుతమైన పెట్టుబడి అవకాశాన్ని అందిస్తుంది. ఇలా ప్రాపర్టీ ధరలు తగ్గించినప్పుడు ప్రత్యక్షంగా, గణనీయమైన పొదుపు కల్పిస్తాయి. తద్వారా మీ కలల ఇంటిని మునుపెన్నడూ లేనంత సరసమైనదిగా చేస్తుంది.
2. స్టాంపు డ్యూటీ తగ్గింపు: సాధారణంగా ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు గృహ కొనుగోలుదారులపై భారీ స్టాంపు డ్యూటీ చార్జీల భారం పడుతుంది. అయితే, చాలా మంది డెవలపర్లు ఈ పండగ సీజన్ లో ఆస్తి కొనుగోళ్లకు సంబంధించి స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలను మినహాయించడం లేదా గణనీయంగా తగ్గించడం ద్వారా కొనుగోలుదారులపై భారం తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఆఫర్ల వల్ల పెద్ద మొత్తంలో కొనుగోలుదారులకు ఆదా అవుతుంది.
3. ఆకర్షణీయమైన గృహ రుణ రేట్లు: బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మీకు ఆకర్షణీయమైన గృహ రుణ వడ్డీ రేట్లను తీసుకురావడానికి పండగ సందర్భాన్ని ఎంచుకుంటాయి. కొత్తగా హోమ్ లోన్ తీసుకునేవారికి మరింత ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తుంటాయి. దీని వల్ల నెలవారీ ఈఎంఐపై కాస్త పొదుపు లభిస్తుంది.
4. బంగారు నాణేలు: కొనుగోలుదారులను ప్రలోభపెట్టడానికి బంగారు నాణేలు లేదా ఇతర విలువైన బహుమతులు ఇస్తామంటూ బిల్డర్లు ప్రకటనలు ఇస్తుంటారు. ఈ చిన్నచిన్న సంపద మీ ఇంటికి మరింత అదృష్టం తీసుకురావొచ్చు.
5. సాంకేతికత: కొత్త ఇంటికి వెళ్లడం అనేడి ఎప్పుడూ ఉత్తేజకరమైన సమయమే. ఈ ప్రక్రియలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సరికొత్త టీవీ, ఏసీ యూనిట్, సరికొత్త స్మార్ట్ కిచెన్ ఉపకరణాలు, ఏఐ-ఇంటిగ్రేటెడ్ ఫ్రిజ్, పూర్తి ఆటోమెటిక్ వాషింగ్ మెషీన్ లేదా ఫైర్ అలారాలు, వీడియో డోర్ బెల్ లతో సహా అత్యుత్తమ భద్రతా ఫీచర్లు.. మీ ఇంటి విలువను మరింత పెంచుతాయి. పండగ సమయంలో కొందరు డెవలపర్లు ఈ అద్భుతమైన ఉపకరణాలను ఉచితంగా అందించడం ద్వారా కొనుగోలుదారులను ఆకర్షిస్తుంటారు.
6. రాయితీలు: రద్దీగా ఉండే మెట్రో నగరంలో ఫ్లోర్ రైజింగ్, పార్కింగ్ చార్జీలు మీకు భారంగా పరిణమిస్తాయి. ఈ పండగ సమయంలో డెవలపర్లు ఉచిత పార్కింగ్ ను ఆఫర్ చేయడంతోపాటు ఎత్తైన అపార్ట్ మెంట్లలో జీరో ఫ్లోర్ రైజ్ చార్జీలు కూడా అందించే అవకాశం ఉంది. దీనివల్ల మీకు చాలా ఆదా అవుతుంది.
7. ఉచిత ఫర్నిచర్: డెవలపర్లు కొనుగోలుదారులకు ఎంతో కొంత మొత్తం ఆదా చేసేందుకు ఉచిత ఫర్నిచర్ ఇస్తుంటారు. హాయిగా ఉండే సోఫాల నుంచి సొగసైన డైనింగ్ టేబుల్స్ వరకు.. సౌకర్యవంతమైన బెడ్ రూమ్ సెట్ ల నుంచి కనువిందు చేసే వార్డ్ రోబ్ ల వరకు ఎన్నో ఉచితంగా ఇస్తుంటారు.
8. ఉచిత మాడ్యులర్ కిచెన్: ఉచిత మాడ్యులర్ కిచెన్ ఇవ్వడం అనేది కొనుగోలుదారులకు అత్యంత విలువైన అంశం. కొనుగోలుదారులకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అధునాతన మాడ్యులర్ కిచెన్ ను బిల్డర్లే ఉచితంగా ఇస్తుంటారు. తద్వారా కొనుగోలుదారులకు పెద్ద మొత్తంలో ఆదా అవుతుంది.
9. సౌకర్యవంతమైన చెల్లింపు ప్రణాళికలు: సౌకర్యవంతమైన చెల్లింపు ప్రణాళికలు కొనుగోలుదారులకు ఎక్కువ ఆర్థిక స్వేచ్ఛను అందిస్తాయి. ఇలాంటి ప్లాన్లు కొనుగోలుదారులకు బాగా ఉపకరిస్తాయి.
10. గుర్తుంచుకోవాల్సిన విషయాలు: ఉచిత ఫర్నిచర్, రాయితీలు, ఇతరత్రా బహుమతుల మీదే పూర్తి ధ్యాస పెట్టి భవన నాణ్యత, బిల్డర్ విశ్వసనీయత వంటి అంశాలను విస్మరించొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇన్నీ సరిగా ఉన్నాయా లేదా? బిల్డర్ ట్రాక్ రికార్డు ఎలా ఉంది వంటి అంశాలన్నీ క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే ఆఫర్ల విషయం ఆలోచించాలని చెబుతున్నారు.