- అభివృద్దికి కేరాఫ్ ట్రిపుల్ ఆర్ ఇంటర్ చేంజర్లు
- రియల్ ఎస్టేట్ లో గేమ్ చెంజర్ గా ట్రిపుర్ ఆర్
- రీజినల్ జంక్షన్స్ దగ్గర భారీగా మౌలిక వసతులు
- మారిపోనున్న ట్రిపుల్ ఆర్ నర్సాపూర్ జంక్షన్
- నర్సాపూర్ పరిసరాల్లో భారీగా రియల్ వెంచర్లు
హైదరాబాద్ నగరం చుట్టూ ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు ఉండగా.. దీని వెలుపల రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం జరగనుంది. తెలంగాణలోని పలు జిల్లాలను కలుపుతూ రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటు అవుతోంది. రీజినల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ వస్తే రాష్ట్ర స్వరూపం మారిపోతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. మూడేళ్లలో రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది రేవంత్ సర్కార్.
ఈ క్రమంలో రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా నర్సాపూర్ దగ్గర నిర్మించే భారీ జంక్షన్ తో అక్కడ రియల్ ఎస్టేట్ రంగానికి మంచి ఫ్యూచర్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ప్రతిష్టాత్మకమైన రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో మొత్తం 12 ఇంటర్ చేంజర్లు నిర్మించేలా డిజైన్ చేశారు. జాతీయ, రాష్ట్ర రహదారులతో కనెక్ట్ అయ్యే ఈ 12 ప్రాంతాల్లో భారీ జంక్షన్స్ ఏర్పాటు కానున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణం జరుపుకునే ఈ భారీ ఇంటర్ చేంజర్లు పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ గ్రోత్ కు మంచి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
రీజినల్ రింగ్ రోడ్డు ఇంటర్ చేంజర్లలో నర్సాపూర్ దగ్గర వచ్చే జంక్షన్ గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. మెదక్ వెళ్లే ప్రధాన రహదారిని కనెక్ట్ చేస్తూ నర్సాపూర్ దగ్గర నిర్మించే ఇంటర్ చేంజర్ చుట్టు పక్కల భారీగా మౌలిక వసతులు ఏర్పాటు కానున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఇటు గండిమైసమ్మ నుంచి దుండిగల్ వరకు డెవలప్ అవ్వగా.. ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్డు, నర్సాపూర్ దగ్గర వచ్చే భారీ జంక్షన్ తో ఈ ప్రాంతం మరింత అభివృద్ది చెందనుందని అంచనా వేస్తున్నారు.
ఎకరం ఎంత?
ఇప్పటికే రీజినల్ రింగ్ రోడ్డు కు సంబంధించిన మెదక్ హైవేపై నర్సాపూర్ సమీపంలో మార్కింగ్ చేయడంతో పాటు భూసేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలో నర్సాపూర్ చుట్టుపక్కల ప్రాంతాలు భవిష్యత్తులో ఊహించలేనంతగా మారిపోతాయని రియాల్టీ వర్గాలు అంటున్నాయి. ట్రిపుల్ ఆర్ మార్కింగుతో నర్సాపూర్ సమీప ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రెక్కలొస్తున్నాయి.
దుండిగల్-నర్సాపూర్ మధ్య మొన్నటి వరకు హైవే ఫేసింగ్ తో ఎకరం 1.2 కోట్ల రూపాయల నుంచి 1.5 కోట్ల రూపాయలు ఉండగా.. ట్రిపుల్ ఆర్ కారణంగా ఎకరం 1.5 కోట్ల నుంచి 2 కోట్లు పెంచి చెబుతున్నారు. జాతీయ రహదారి నుంచి కాస్త లోపలికి 2 నుంచి 5 కిలోమీటర్ల రేడియస్ లో ఎకరం 75 లక్షల నుంచి కోటి రూపాయలు చెబుతున్నారు.
ప్లాట్ల ధరలెలా?
ట్రిపుల్ ఆర్ జంక్షన్ ఏర్పాటయ్యే నర్సాపూర్ సమీపంలోని బొంతపల్లె, గుమ్మడిదల, మాదాపూర్ వరకు ఇప్పటికే రియల్ వెంచర్లు వెలిశాయి. రీజినల్ రింగ్ రోడ్డు ఇంటర్ చేంజర్ ఏర్పాటవుతుండటంతో భారీగా వెంచర్లు వేసేందుకు రియాల్ ఎస్టేట్ సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రస్తుతం గండిమైసమ్మ లో డీటీసీపీ లేఅవుట్ లో రియాల్టీ ప్రాజెక్టు, ప్రాంతాన్ని బట్టి చదరపు గజం 20 వేల రూపాయల నుంచి 35 వేల రూపాయల వరకు ధరలున్నాయి.
నర్సాపూర్ సమీప పరిసర ప్రాంతాల్లో చదరపు గజం 8 వేల రూపాయల నుంచి 22 వేల రూపాయల వరకు ప్లాట్ల ధరలున్నాయి. నర్సాపూర్ సమీపంలోని మనోహరాబాద్ భారీ స్థాయిలో ఇప్పటికే ఓపెన్ ప్లాటు వెంచర్లు ఉండగా.. చదరపు గజం 10 వేల రూపాయల నుంచి మొదలు 2౦ వేల రూపాయల వరకు ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ తరువాత మాసాయిపేటలో డీటీసీపీ లేఆవుట్లలో చదరపు గజం 8 వేల రూపాయల నుంచి 20 వేల రూపాయల వరకు ధరలున్నాయి.