Categories: TOP STORIES

కొత్త మాల్స్‌ వస్తున్నాయ్‌!

కరోనా మహమ్మారితో పాతాళంలో కొట్టుకుపోయిన షాపింగ్‌ మాల్స్‌ వ్యాపారం… తిరిగి క్రమంగా పుంజుకుంటోంది. దీంతో మాల్స్‌ నిర్మాణ సంస్థలకూ జోష్‌ వచ్చింది. ఈ ఏడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో కొత్తగా 45 లక్షల చ.అ. షాపింగ్‌ మాల్‌ స్పేస్‌ అందుబాటులోకి రానుంది. ఇందులో 85 శాతం స్పేస్‌ ప్రధాన నగరాలలో, 15 శాతం ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలలో రానుంది. ఈ ఏడాది కొత్తగా అందుబాటులోకి రానున్న రిటైల్‌ మాల్‌ స్పేస్‌లో బెంగళూరులో 12.2 లక్షల చ.అ. మాల్‌ స్పేస్, ముంబై, నోయిడాల ఒక్కో నగరంలో 11 లక్షల చ.అ. స్పేస్‌ రానుంది. అమరావతి, లక్నో పట్టణాలలో కొత్తగా రెండు మాల్స్‌లలో 4.7 లక్షల చ.అ.లలో రానున్నాయి. 2019లో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో కొత్తగా 85 లక్షల చ.అ. మాల్‌ స్పేస్‌ అందుబాటులోకి వచ్చింది. అంతకుక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 73 శాతం వృద్ధి. గతేడాది కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా చాలా వరకు ఇంటికే పరిమితం అయ్యారు. అవసరమైన వస్తువులు, నిత్యావసరాలను ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోళ్లకే మొగ్గుచూపారు. దీంతో భౌతిక రిటైల్‌ స్పేస్‌ అవసరం క్షీణించింది. ఫలితంగా 2019తో పోలిస్తే గతేడాది కొత్త రిటైల్‌ మాల్‌ స్పేస్‌ 75 శాతం క్షీణించి.. 21 లక్షల చ.అ.లకు చేరింది.

This website uses cookies.