ఔను.. కోకాపేట్లోకి కొత్త రియల్ మోసగాడు అడుగుపెట్టాడని బయ్యర్లు అంటున్నారు. గండిపేట్- శంకర్‌పల్లికి వెళ్లే కోకాపేట్ మెయిన్ రోడ్డు మీదే.. హైదరాబాద్‌లో ఎత్తయిన టవర్‌ను కడతామని ప్రచారం చేస్తున్నాడని.. ఫ్లాట్ కొంటే భూతల స్వర్గం అంటున్నాడని ప్రజలు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ఫేస్ బుక్‌లో ప్రచారాన్ని నిర్వహిస్తున్న సంస్థకు ఫోన్ చేస్తే.. ఈ 63 అంతస్తుల ఎత్తు గల స్కై స్క్రాపర్‌ను కట్టే బిల్డర్ పేరు ఈ- ఇన్‌ఫ్రా సంస్థ అని తెలిసింది.
ఇప్పటివరకూ ఒక్క స్కై స్క్రేపర్‌ను కట్టని ఈ నిర్మాణ సంస్థ.. ఒక్కసారిగా 63 అంతస్తుల ఎత్తులో ఆకాశహర్మ్యాన్ని కడుతోందంటే.. బయ్యర్లు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. టీజీ రెరా ఆమోదం లభించాకే కొనుక్కుంటే ఉత్తమం. అన్‌లిమిటెడ్ ఎఫ్ఎస్ఐపై ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందనే వార్తలు గుప్పుమంటున్న నేపథ్యంలో.. కోకాపేట్‌లో 63 అంతస్తుల ఎత్తులో ప్రాజెక్టు అంటే ఆలోచించాల్సిన విషయమే.