తెలంగాణ ప్రభుత్వం తెలివిగా ఏం చేసిందంటే.. ట్రిపుల్ వన్ జీవో పరిధిలోకి వచ్చే పలు గ్రామాలను కొత్తగా ఏర్పాటు చేసిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలోకి తెచ్చింది. ఉదాహరణకు మొయినాబాద్ పరిధిలోకి వచ్చే బాకారం, కేతిరెడ్డిపల్లి, అజీజ్‌నగర్, చిలుకూరు, కనకమామిడి.. శంషాబాద్ కిందికొచ్చే చౌదరిగూడ, గంధిగూడ.. ఇలా అనేక ప్రాంతాల్ని కొత్త పరిధిలోకి తెచ్చింది. ఇలా 84 గ్రామాల్ని కొత్త నగరంలో కలిపేయడం వల్ల ఆంతర్యమేమిటి?
111 జీవో పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో.. కొత్తగా ఇల్లు కట్టుకోవడానికి అధికారికంగా అనుమతినిస్తారా? లేక ఇప్పటివరకూ ఉన్న నిషేధాన్ని కొనసాగిస్తారా? అనే చర్చ జోరుగా జరుగుతోంది. గత ప్రభుత్వం 111 జీవో పరిధిలోకి వచ్చే లక్షా ముప్పయ్ రెండు వేల ఎకరాలకు కలుపుకుని ఒక మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. మరి, కాంగ్రెస్ ప్రభుత్వం అదే మాస్టర్ ప్లాన్‌కు పచ్చజెండా ఊపుతుందా? అందుకోసమే 111 జీవో ప్రాంతాల్ని కొత్త మెట్రోపాలిటన్ అథార్టీ రిజియన్ పరిధిలోకి తెస్తారా అనే సందేహం ఉత్పన్నం అవుతుంది. పురపాలక శాఖను స్వయంగా ముఖ్యమంత్రియే నిర్వహిస్తున్నారు కాబట్టి.. ఈ అంశంలో ప్రజల్లో నెలకొన్న సందేహాలకు ఆయనే సమాధానం చెప్పాల్సిన అవసరముంది.