Categories: TOP STORIES

ప్రీలాంచ్ పేరిట జయగ్రూప్ రూ.300 కోట్ల మోసం!

రెజ్ న్యూస్ చెప్పిందే నిజమైంది. న‌గ‌రంలో మ‌రో ప్రీలాంచ్ స్కామ్ వెలుగులోకి వ‌చ్చింది. ఈ మోసం విలువ ఎంత‌లేద‌న్నా మూడు వందల కోట్ల దాకా ఉంటుంద‌ని ప్రాథ‌మిక అంచ‌నా. రెజ్ న్యూస్ పేపర్లో.. 2022 డిసెంబ‌రు 10న‌.. తెలంగాణ‌లో ఎన్ని సాహితీలున్నాయి? అనే క‌థ‌నంలో జ‌య‌గ్రూప్ ఇంట‌ర్నేష‌న‌ల్ పేరును ప్ర‌చురించింది.

JAYA GROUP PRE LAUNCH SCAM

అయినా రెరా అథారిటీ ఎప్ప‌టిలాగే పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. పోలీసులు అప్పుడేమో లైట్ తీసుకున్నారు. నెలాప‌దిహేను రోజులు గ‌డిచాయో లేదో.. జ‌య గ్రూప్ సంస్థ ఎండీ కాక‌ర్ల శ్రీనివాస్‌ను అరెస్టు చేశామ‌ని కేపీహెచ్‌బీ కాల‌నీ పోలీసులు అధికారికంగా వెల్ల‌డించారు. తొలుత మోసం విలువ రూ.20 కోట్ల దాకా ఉంటుంద‌ని పోలీసులు చెబుతున్న‌ప్ప‌టికీ.. అంత‌కంటే ఇంకా ఎక్కువే వ‌సూలు చేశాడ‌ని స‌మాచారం.

శంక‌ర్‌ప‌ల్లి, చేవేళ్ల‌, ప్ర‌జ్ఞాపూర్‌, స‌దాశివ‌పేట్‌, షాద్ న‌గ‌ర్ వంటి ప్రాంతాల్లో ప్లాట్లు.. అమీన్‌పూర్‌, చందాన‌గ‌ర్‌, ప్రగతినగర్, ముత్తంగి, బాచుపల్లి, స‌ర్దార్ ప‌టేల్ న‌గ‌ర్‌లో ఫ్లాట్ల‌ను ప్రీలాంచ్ పేరుతో జ‌య ఇంట‌ర్నేష‌న‌ల్ గ్రూప్ విక్ర‌యించింది. వాణిజ్య స‌ముదాయాలు, కేపీహెచ్‌బీ కాల‌నీ మెట్రో స్టేష‌న్‌లో స్టాళ్ల పేరిట ప్ర‌జ‌ల నుంచి సొమ్ము వ‌సూలు చేశాడు. వాణిజ్య సముదాయాల్లో పెట్టుబడి పెడితే.. ప్రతినెలా వడ్డీ చెల్లిస్తామంటూ ఈ సంస్థ ఎండీ సొమ్ము వసూలు చేశాడని సమాచారం.
ఇలా, మొత్తానికి ఓ రూ.300 కోట్ల‌ను ఈ సంస్థ ఎండీ ప్ర‌జ‌ల నుంచి వ‌సూలు చేసి బోర్డు తిప్పేశాడ‌ని స‌మాచారం. దీంతో ల‌బోదిబోమ‌న్న బాధితులు కేపీహెచ్‌బీ కాల‌నీ పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. గ‌త కొంత‌కాలం నుంచి త‌ప్పించుకు తిరుగుతున్న కాక‌ర్ల శ్రీనివాస్‌ను ఎట్ట‌కేల‌కు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అతని సోదరుడు, ఇతర డైరెక్టర్ల కోసం గాలిస్తున్నారు. ఈ సంస్థ ఎండీ మోసాల‌కు పాల్ప‌డ‌ట్లు ఆధారాలున్నాయ‌ని కూక‌ట్‌ప‌ల్లి ఏసీపీ ప‌త్రికా స‌మావేశంలో వెల్ల‌డించారు. పోలీసులు త‌మ‌కు న్యాయం చేయాల‌ని బాధితులు కోరుతున్నారు.

This website uses cookies.