రెజ్ న్యూస్, హైదరాబాద్, జనవరి 25: హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో భారీ/ ఎత్తైన భవనాలకు, వ్యాపార, వాణిజ్య భవనాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, ఎత్తైన అపార్టుమెంట్లలో సేప్టి ఆడిట్ నిర్వహించాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. సికింద్రాబాద్‌లో ఇటీవల జరిగిన భారీ అగ్ని ప్రమాదం నేపథ్యంలో అగ్ని ప్రమాద నివారణ అనుమతుల్లేని భారీ భవనాలపై చేపట్టాల్సిన చర్యలపై బిఆర్కెఆర్ భవన్లో బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది.
ఈ సందర్బంగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని ఇతర అన్ని ప్రధాన నగరాలలో అన్ని భారీ/ ఎత్తైన భవనాలకు ఫైర్ సేప్టి ఆడిట్ నిర్వహించాలని, మున్సిపల్, పోలీస్, ఫైర్, తదితర శాఖల అధికారులతో కలసి నియమిత కాలంలో పూర్తి చేయాలని పేర్కొన్నారు. వీటితో పాటు అన్ని ఆసుపత్రులు, పాఠశాల భవనాలు, పెట్రోల్ బంకులు, గ్యాస్ గోదాములు, వ్యాపార, వాణిజ్య భవనాలు, ఎత్తైన అపార్టుమెంట్లలో సేప్టి ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. అయితే, ఫైర్ సేప్టి ఆడిట్ పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలుగ కుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. గణనీయంగా పెరుగుతున్న నగర ప్రజల భద్రత అత్యంత ప్రధానమని, ఈ విషయంలో అవసరమైతే 1999లో రూపొందించిన ఫైర్ సేప్టి చట్టాలను మార్చేందుకు తగు ప్రతిపాదనలను పంపాలని మంత్రి సూచించారు.
రాష్ట్ర పశు సంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ, నగరంతో పాటు ఇతర నగరాలలో భారీ అగ్ని ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు చేపట్టే విధంగా మార్గ దర్శకాలు సూచించడానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో దాదాపు 25 లక్షల వ్యాపార, వాణిజ్య సముదాయాలున్నాయని, ఇవన్నీ తమ స్వంత ఫైర్ సేప్టీ జాగ్రత్తలు తీసుకునే విధంగా తగు మార్గదర్శకాలు జారీ చేయాలని పేర్కొన్నారు. హోం శాఖ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, భవన నిర్మాణాలు జారీ చేసే సమయంలోనే ఫైర్ సెఫీటి పై కఠిన నిబంధనలు విధించాలని అన్నారు.
This website uses cookies.