- గత నెలలో 10.3 శాతం పెరుగుదల
- నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడి
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రియల్ రంగం దూసుకెళ్తోంది. గత నెలలో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు 15వేల మార్కను దాటాయి. వార్షిక ప్రాతిపదికన 10.3 శాతం పెరుగుదలతో 15,603 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. తద్వారా రూ.1,597 కోట్ల మేర ఆదాయం స్టాంపు డ్యూటీ రూపంలో వచ్చింది. ఇది 45 శాతం అధికం అని నైట్ ఫ్రాంక్ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. అధిక నికర విలువ కలిగిన లావాదేవీలు ఎక్కువగా జరగడంతో స్టాంపు డ్యూటీ ఆ మేరకు పెరిగిందని తెలిపింది. నెలవారీ ప్రాతిపదికన చూస్తే.. మార్చిలో రిజిస్ట్రేషన్లు 29 శాతం, స్టాంపు డ్యూటీ వసూళ్లు 71 శాతం పెరిగాయి.
2025లో అత్యంత చురుకైన నెలగా మార్చి నిలిచింది. మార్చిలో జరిగిన అన్ని రిజిస్ట్రేషన్లలో రెసిడెన్షియల్ ప్రాపర్టీలు 80 శాతంతో అగ్రభాగాన నిలిచాయి. హై-టికెట్ లావాదేవీల ప్రభావం రోజువారీ స్టాంప్ డ్యూటీ కలెక్షన్లలో స్పష్టంగా కనిపించింది. ఇది ఏప్రిల్ 2024లో సగటున రూ.35 కోట్టు ఉండగా.. మార్చి 2025లో రూ.52 కోట్లకు పెరిగింది. అలాగే రోజువారీ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు కూడా ఏప్రిల్ 2024లో 388 యూనిట్టు ఉండగా.. మార్చి 2025లో 503 యూనిట్లకు పెరిగాయని నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్లు 9% వార్షిక పెరుగుదలను చూడగా.. అదే కాలంలో స్టాంప్ డ్యూటీ వసూళ్లు 22% పెరిగాయి.
2024-25 ఆర్థిక సంవత్సరంలో 143,948 ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. గత సంవత్సరం ఇదే కాలంలో ఇవి 132,2723గా ఉన్నాయి. ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి తన హవా ప్రదర్శించిందని.. గణనీయమైన స్టాంప్ డ్యూటీ వసూళ్లు, అధిక-విలువ లావాదేవీలలో స్థిరమైన వృద్ధితో ఆర్థిక సంవత్సరాన్ని ఘనంగా ముగించిందని నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ అన్నారు. కాగా, 2024 మొదటి త్రైమాసికం (జనవరి-మార్చి) తో పోలిస్తే.. 2025వ సంవత్సరం మొదటి త్రైమాసికంలో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు 22% మేర పెరిగినట్టు నివేదిక వెల్లడించింది. అదే కాలంలో స్టాంప్ డ్యూటీ వసూళ్ల ద్వారా వచ్చిన ఆదాయం 27% పెరిగింది. గత నెలలో కొనుగోలుదారుల ప్రాధాన్యతలలో గణనీయమైన మార్పు కనిపించింది.