హైదరాబాద్.. అసలే హైటెక్ సిటీ. ఆ తరువాత ఐటీ హబ్. ప్రపంచంలో ఎక్కడ ఏ టెక్నాలజీ అభివృద్ది చెందినా మన భాగ్యనగరం వెంటనే అందిపుచ్చుకుంటుంది. ఇదిగో ఇలాంటి హైదరాబాద్ నగరం నిర్మాణ రంగంలోను హైటెక్ గా ఉండాలని కోరుకుంటోంది. ఔను.. ఆధునిక పద్దతుల్లో ఇల్లు స్మార్ట్ గా ఉండాలని కోరుకుంటున్నారు నేటి జనరేషన్. అందుకు అనుగునంగా టెక్ సిటీలోని రియల్ రంగ సంస్థలు సైతం స్మార్ట్ హోమ్స్ నిర్మాణాలపై దృష్టి సారించాయి.
హైదరాబాద్ కు హైటెక్ నగరంగా పేరు. టెక్నాలజీ హబ్‌గా రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. ఇలాంటి నగరంలో కట్టే ఇళ్లు సైతం అంతే హైటెక్ గా ఉండాలని నేటి జనరేషన్ కోరుకుంటోంది. వీరి ఆలోచనలకు అనుగుణంగానే నిర్మాణ రంగ సంస్థలు సైతం కొత్తతరం ఇళ్లను నిర్మిస్తున్నాయి. విదేశాల్లో అధ్యయనం చేసి సాంకేతికతను జోడించి ఇళ్లను స్మార్ట్ హోమ్స్‌గా తీర్చిదిద్దుతున్నాయి. కొనుగోలుదారులను ఆకట్టుకోవాలన్నా, మార్కెట్లో తమ ప్రత్యేకతను చాటుకోవాలన్నా, టెక్నాలజీని వినియోగించుకోవాలని నిర్మాణ సంస్థలు గుర్తించాయి. ప్రస్తుతం హరిత భవనాల నిర్మాణాలతో పాటు, స్మార్ట్ హోమ్ నిర్మాణాలపై నగరానికి చెందిన పలు నిర్మాణ సంస్థలు దృష్టి సారించాయి. రానున్న రోజుల్లో స్మార్ట్ హోమ్స్ కు డిమాండ్ బాగా పెరుగుతుందని రియల్ రంగ కంపెనీలు అంచనా వేస్తున్నాయి.
నిర్మాణదారులు ఇల్లు స్మార్ట్‌గా పని చేసేందుకు తగ్గట్టుగా ప్రణాళిక దశ నుంచే డిజైన్‌పై దృష్టి పెడుతున్నారు. వినియోగదారుల డిమాండ్స్ ను పరిగమలోకి తీసుకుని ప్రాజెక్ట్ మొత్తం ప్రయోగాత్మకంగా స్మార్ట్ హోమ్స్‌గా నిర్మిస్తున్నారు. మార్కెట్లోనూ స్మార్ట్ పరికరాల అందుబాటులోకి రావడం, ధరలు సైతం అందుకునే స్థాయిలో ఉండటంతో వీటిపై అవగాహన, ఆసక్తి, సాంకేతికతను స్వాగతించేవారు పెరిగారు. హైదరాబాద్ తో పాటు, శివార్లలో దొంగతనాల భయం వెంటాడుతుంది. పండగ సెలవుల్లో, ఎక్కడికైనా కొద్ది రోజుల పాటూ విహారానికి వెళితే ఇంటి భద్రతపైనే ఎక్కువ మంది ఆందోళన చెందుతుంటారు. అదే స్మార్ట్ హోమ్ సెక్యూరిటీ సిస్టమ్ ఉంటే భరోసాగా ఉండొచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లలను ఇంట్లో ఒంటరిగా ఉంచినా ఆందోళన చెందాల్సిన పని లేదనే భరోసా ఇస్తోంది స్మార్ట్ హోమ్.
స్మార్ట్ హోమ్ సిస్టమ్లో భాగంగా వైఫై సెక్యూరిటీ కెమెరా రాత్రి పూట కూడా పని చేస్తుంది. అవసరమైన చోట దీన్ని బిగించుకుని యాప్ సహాయంతో అవసరమైనప్పుడు మొబైల్ నుంచే చూసుకోవచ్చు. ఇంటిని, పిల్లలను ఓ కంట కనిపెట్టవచ్చు. ఇక వైఫై ఆధారంగా పని చేసే స్మార్ట్ స్విచ్చులు వచ్చాయి. టీవీలు ఏసీలు మాత్రమే కాదు ఇంట్లో బల్బులు, ఫ్యానులు, స్టీరియోలు రిమోట్ తో నియంత్రించవచ్చు. ఇంట్లో ఉన్నప్పుడే కాదు.. మొబైల్ లోని యాప్ సహాయంతో ఎక్కడ ఉన్నా వీటిని ఆన్, ఆఫ్ చేయవచ్చు. ఏ సమయంలో నిద్ర లేపాలో చెబితే ఆ వేళకు మ్యూజిక్ సిస్టమ్ నుంచి వచ్చే పాటతో నిద్ర లేపుతుంది. స్మార్ట్‌గా పని చేసే ఎల్‌ఈడీ బల్బులు ఈ రోజుల్లో ఇంటికి ప్రధాన ఆకర్షణ. అలసిపోయి ఇంటికి వచ్చి సోఫాలో కూలబడి లైట్ వేయగానే సంగీతం కూడా వినపడితే.. అలసిన మనసుకు సాంత్వన కలుగుతుంది. ఈ తరహా స్మార్ట్ పరికరాలు మున్ముందు ప్రతి ఇంట్లో సాధారణం కానున్నాయి.
ప్రతి రోజు గృహిణులకు ఇంటిని శుభ్రం చేయడం పెద్ద పని. తీరిక లేకుండా ఉండేవారికి ఇంటిని శుభ్రం చేసే స్మార్ట్ క్లీనింగ్ రోబోలు వచ్చాయి. వ్యాక్యూమ్ క్లీనర్ అనగానే ఎక్కడో అల్మారాలో దాచిన దాన్ని బయటకు తీసి శుభ్రం చేయమంటే బద్ధకిస్తుంటారు. చిన్న పరిమాణంలో వచ్చిన ఈ క్లీనింగ్ రోబో సులువుగా శుభ్రం చేస్తుంది. మూలలు, ఫర్నిచర్ అడుగుభాగం అన్నిచోట్లకు వెళుతుంది. క్లీనింగ్ రోబోలతో ఏ రోజు, ఏ సమయంలో శుభ్రం చేయాలో ఆదేశాలు ఇస్తే చాలు దానంతట అది పని చేసుకుంటూ పోతుంది.
This website uses cookies.