(రియల్ ఎస్టేట్ గురు, హైదరాబాద్):హైదరాబాద్లో మోసపూరిత రియల్టర్లు రోజురోజుకి బరితెగిస్తున్నారు. అనుమతుల్లేకుండా ప్లాట్లు, ఫ్లాట్లను విక్రయించడమే కాదు ఏకంగా హెచ్ఎండీఏ లోగో వేసి మరీ సామాన్యులకు అంటగడుతున్నారు. మరి, ఇలాంటి మోసపూరిత ప్రమోటర్ల మీద హెచ్ఎండీఏ ఎలాంటి చర్యల్ని తీసుకుంటుంది? కొద్ది రోజుల్నుంచి అక్రమ నిర్మాణాల్ని కూల్చివేస్తున్న హెచ్ఎండీఏ.. ఇలాంటి అక్రమ వెంచర్లు, నిర్మాణాల్ని ఆదిలోనే ఎందుకు తుంచివేయదు? ప్రజలు కొనుగోలు చేశాక, అపార్టుమెంట్ల నిర్మాణం మధ్యలో ఉన్నాక వాటిని కూల్చివేస్తే జాతీయ సంపద వృథా అయినట్లే కదా! కాబట్టి, ఇలాంటి మోసపూరిత ప్రమోటర్ల ప్రాజెక్టులపై ఆరంభంలోనే తుది చర్యలు తీసుకోవాలి.
కరోనా వైరస్ రూపం మార్చుకుంటూ కొత్త వేరియంట్లుగా పుట్టుకొస్తున్నట్లే.. హైదరాబాద్ రియల్ రంగంలోనూ ప్రజల కష్టార్జితాన్ని దోచుకునేలా కొత్త వేరియెంట్లు దర్శనమిస్తున్నాయి. తెలంగాణ రెరా అథారిటీ నుంచి తప్పించుకునేందుకు సంస్థ పేరును పూర్తిగా మార్చేసి.. కొత్త పేరుతో అమ్మకాల్ని జరుపుతున్నాయి. మొన్నటివరకూ ఆర్‌జే గ్రూపు యమ్నంపేట్‌లో జై వాసవి బ్లిస్ హైట్స్ అనే పేరుతో 550 ఫ్లాట్లను కట్టేందుకు ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను విక్రయించింది. తెలంగాణ రెరా అథారిటీ నుంచి నోటీసు అందటంతో ఈ సంస్థ తమ పేరును తీసేసి.. శ్రీ చేతన్ డెవలపర్స్ అనే కొత్త పేరుతో మళ్లీ అక్కడే అక్రమ దందా షురూ చేసింది. ఈ మోసాన్ని గమనించిన తెలంగాణ రెరా అథారిటీ అధికారులు ఒక్కసారిగా విస్తుపోవడం విశేషం. ఈ కొత్త సంస్థపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు.
This website uses cookies.