ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్మాణ రంగాన్ని నిరాశపర్చింది. ఈ రంగం నిలబడేలా పలు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటారని ఆశించిన రియల్ రంగానికి ఎప్పటిలాగే మొండి చేయి లభించింది. గృహరుణాలపై పన్ను రాయితీని పెంచాలని, అందుబాటు గృహాల పరిమితిని పెంపుదల చేయాలని క్రెడాయ్ కోరింది. మధ్యతరగతి ఇళ్ల కొనుగోలుదారులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమును పొడిగించాలన్నా పట్టించుకోలేదు. రీట్లలో యాభై వేల కంటే ఎక్కువగా మదుపు చేసేవారికి పన్ను రాయితీల్ని ప్రకటించాలని కోరినా కనికరించలేదు.
అందుబాటు గృహాల అనుమతులకు సంబంధించి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేస్తుందని ప్రకటించడం హాస్యాస్పదంగా కనిపిస్తుంది. కనీసం ఇప్పటికైనా కేంద్ర ఆర్థిక మంత్రి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తోన్న పలు విప్లవాత్మక విధానాల్ని తెలుసుకోవాలి. పట్టణ ప్రాంతాల్లో అందుబాటు గృహాల అనుమతుల సమయాన్ని తగ్గించాలని కేంద్రం 2022లో చెబుతోంది. కానీ, ఇందుకు సంబంధించిన నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం 2019లోనే తీసుకుంది. అంటే, మంత్రి కేటీఆర్ ఎంత దూరదృష్టితో ఆలోచిస్తారనే విషయాన్ని ఇప్పటికైనా కేంద్రం తెలుసుకోవాలి. ఇరవై ఒక్క రోజుల్లోనే అనుమతులిచ్చే విధానం దేశంలోనే అతిపిన్న రాష్ట్రమైన తెలంగాణలో అమల్లో ఉందనే విషయమే కేంద్రానికి తెలియనట్లు ఉంది. మంత్రి కేటీఆర్ ఆలోచనలకు అనుగుణంగా రూపొందించిన కొత్త మున్సిపల్ చట్టం కింద అమల్లోకి తెచ్చిన టీఎస్ బీపాస్ ద్వారా ఆన్‌లైన్‌లోనే అనుమతులిచ్చే విధానం 2019లోనే ఆరంభమైంది. దీంతో పట్టణ పేదలతో పాటు నిర్మాణ సంస్థలకూ అనుమతులు సులువుగా లభిస్తున్నాయి. అయితే, అందుబాటు గృహాల్ని రాష్ట్రాల్లో ప్రోత్సహించేందుకు పని చేస్తామన్న నిర్ణయం వినడానికి బాగానే ఉంది కానీ, వాస్తవికంగా ఎలాంటి ఉపయోగపడుతుందో తెలియాలంటే మరికొంత కాలం పడుతుంది.
కేంద్ర ప్రభుత్వం దేశానికంతటికీ వర్తించే బిల్డింగ్ బైలాస్ అమల్లోకి తెస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇది కూడా ఇటీవల కాలంలో సుప్రీం కోర్టు ఇటీవల కాలంలో వెలిబుచ్చిన అభిప్రాయానికి అనుగుణంగానే కేంద్రం తాజా నిర్ణయాన్ని తీసుకుందని అర్థమవుతోంది. కొత్త బిల్డింగ్ బైలాఎస్ ఏర్పాటు చేసి.. అది దేశంలోకి అందుబాటులోకి వచ్చేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుందనే విషయాన్ని మర్చిపోవద్దు. టీడీఆర్ సంస్కరణల్ని ఇప్పటికే హైదరాబాద్‌లో అధిక శాతం మంది వాడుకుంటున్నారు. దీని వల్ల గృహ యజమానులు, బిల్డర్లు లబ్ది పొందుతున్నారు. రవాణా ఆధారిత అభివృద్ధికి సంబంధించిన సంస్కరణల ద్వారా స్థిరమైన అభివృద్ధిని సాధించడంతో పాటు ఆధునీకరించడానికి పట్టణ రంగంపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇదెప్పుడు ఏర్పాటు చేస్తారో? దాని వల్ల పట్టణాలకు కలిగే మేలేంటో అమాత్యులకే తెలియాలి. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (రూరల్ & అర్బన్) కింద 80 లక్షల మంది కొత్త లబ్ధిదారులను గుర్తించాలి. ఈ పనుల నిమిత్తం రూ. 48000 కోట్లు కేటాయించారు. దీని ప్రయోజనం పేదలకు ప్రత్యక్షంగా ఎంతమేరకు ఉంటుందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది.
This website uses cookies.